
బెగాస్ కొరతతో నిలిచిపోయిన క్రషింగ్
ఆందోళనకు దిగిన చెరకు రైతులు
ఫ్యాక్టరీ ఎదుట చెరకు బండ్లతో 3 గంటలు రాస్తారోకో
ఎండీపై తిరగబడ్డ రైతులు
పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమణ
మధ్యాహ్నం నుంచి క్రషింగ్ ప్రారంభం
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో బెగాస్ కొరత కారణంగా క్రషింగ్ నిలిచిపోవడంతో చెరకు రైతులు గురువారం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైతులు చెరకు బండ్లతో ఫ్యాక్టరీ గేటు ఎదుట రాస్తారోకో చేయడంతో చోడవరం–అనకాపల్లి రోడ్డుపై 3 గంటలకు పైగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో గత సీజన్‌కు సంబంధించి బెగాస్ కొంత ఉండటంతో యాజమాన్యం క్రషింగ్, కో జనరేషన్ ఒకేసారి ప్రారంభించింది.
అయితే, పూర్తిస్థాయి క్రషింగ్‌కు అవసరమైనంత బెగాస్ సమకూర్చుకోకపోవడంతో క్రషింగ్‌కు తరుచూ అంతరాయం కలిగింది. బాయిలర్‌కు కావలసినంత బెగాస్ లేకపోవడంతో బుధవారం రాత్రి నుంచి క్రషింగ్ పూర్తిగా నిలిచిపోయింది. మరోపక్క గేటు, కాటాల నుంచి పెద్ద ఎత్తున చెరకు సరఫరా అయింది. దూర ప్రాంతాల నుంచి 300కు పైగా ఎడ్లబళ్లు, ట్రాక్టర్లు, టిల్లర్లతో రైతులు చెరకు తెచ్చారు. ఈ బళ్లన్నీ రెండు రోజులుగా ఫ్యాక్టరీ రెండు యార్డుల్లో, రోడ్డుకు ఇరువైపులా నిలిచిపోయాయి.
తెచ్చిన చెరకు ఎక్కడిదక్కడ ఉండిపోవడంతో సహనం కోల్పోయిన రైతులు ఆందోళనకు దిగారు. చెరకు బళ్లను చోడవరం – అనకాపల్లి రోడ్డుపై అడ్డంగా పెట్టి రాస్తారోకో చేశారు. అనకాపల్లి, విశాఖపట్నం, చోడవరం, పాడేరు, మాడుగుల ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడుని రైతుల వద్దకు తీసుకొచ్చారు. బెగాస్ కొరతవల్లే క్రషింగ్‌కు ఇబ్బంది కలిగిందని, వెంటనే క్రషింగ్ ప్రారంభిస్తామని ఎండీ చెప్పారు. ఇందుకు రైతులు అంగీకరించలేదు.
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సమస్యలు తలెత్తాయంటూ ఆయనపై తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎండీని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పోలీసు అధికారులు వచ్చి రైతులను సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులకు సీపీఐ, సీపీఎం, చెరకు రైతు సంఘాలు మద్దతిచ్చాయి. ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న పరిణామాలు, రైతుల ఆందోళనపై అనకాపల్లి ఆర్డీవో ఆయీషా విచారణ జరిపారు.
క్రషింగ్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎండీని ఆదేశించారు. అనంతరం వరి ఊక, చెరకు బెగాస్‌ను సమకూర్చి బాయిలర్‌ను ప్రారంభించారు. దీంతో మధ్యాహ్నం నుంచి క్రషింగ్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment