చంద్రబాబు హయాంలో.. సుగర్‌ ఫ్యాక్టరీ సర్వనాశనం! | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హయాంలో.. సుగర్‌ ఫ్యాక్టరీ సర్వనాశనం!

Published Sun, Mar 3 2024 8:40 AM | Last Updated on Sun, Mar 3 2024 10:21 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయరామ కోఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీ... నాడు చంద్రబాబు విషకౌగిలిలో చిక్కి సమాధి అయిపోయింది. రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఉన్నా ప్రైవేట్‌పరం చేయాలనే కుట్రతో క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. నాటి ఘోరాలను దాచిపెట్టి ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెట్టేయడానికి టీడీపీ నాయకులు దుష్ప్రచారానికి తెరతీశారు. ఇందుకు పచ్చ మీడియా వంతపాడుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడీ నెపం నెట్టేసే కొత్తనాటకం మొదలెట్టారు.

వాస్తవానికి ఈ ఫ్యాక్టరీని గట్టెక్కించడానికి నాడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలే కృషి చేశాయి. ఈ విషయం రైతులకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశవ్యాప్తంగా చక్కెర పరిశ్రమ సంక్షోభంలో ఉంది. రైతులు కూడా మొక్కజొన్న, పామాయిల్‌ తదితర లాభసాటి పంటల వైపు మరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏటా చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. సుగర్‌ ఫ్యాక్టరీల మనుగడ దినదిన గండంగా ఉందనే విషయాన్ని మరుగునపెట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

 కె.ఎ.నాయుడి ఘనకార్యం...
ఫ్యాక్టరీ కోసం వినియోగించాల్సిన రూ.5 కోట్ల నిధిని దుర్వినియోగం చేయడంలో టీడీపీ నాయకుడు కె.ఎ.నాయుడి ఘనకార్యం ఉంది. 2014 సంవత్సరంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ విషయంలో ఎప్పటిలాగే పాత వైఖరినే మరలా కొనసాగించారు. అప్పట్లో గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్న కె.ఎ.నాయుడు ఫ్యాక్టరీ సర్వసభ్య సమావేశాన్ని తూతూమంత్రంగా నడిపించేవారు. అశోక్‌ గజపతిరాజైతే ఏనాడూ హాజరైన దాఖలాలు లేవు. ఇదే అదనుగా ఫ్యాక్టరీ ఆధునికీకరణకు బ్యాంకులో ఉన్న రూ.5 కోట్ల నిధిని కె.ఎ.నాయుడు దుర్వినియోగం చేశారు. రైతులు అడగకపోయినా ఆ డిపాజిట్లను పంచేశారు. దీంతో ఆధునికీకరణ ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగానే తెరవెనుకకు పంపించేశారు. కర్మాగారం కమిటీ చైర్మన్‌గా గంట్యాడ మండలానికి చెందిన గుల్లిపల్లి లలితను నియమించినప్పటికీ నెల తిరగకముందే ఆమె పదవికి స్వయంగా టీడీపీ నాయకులే ఎసరుపెట్టారు. వర్గపోరుతో కోర్టుకెళ్లి ఆమె పదవిని రద్దు చేయించారు.

 రైతుల పొట్టకొట్టింది టీడీపీ...
భీమసింగి కోఆపరేటివ్‌ సుగర్‌ ఫ్యాక్టరీ 1976–77 సంవత్సరంలో తొలిసారి క్రషింగ్‌ను ప్రారంభించింది. దీనిలో 16,873 మంది రైతులు షేర్‌ హోల్డర్స్‌ కాగా, 3500 మంది నాన్‌ షేర్‌ హోల్డర్స్‌గా ఉన్నారు. తొలుత 543 గ్రామాల్లో ఆరు వేల మంది రైతులకు ఉపయోగపడేది. ఆ సమయంలో 8 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. టీడీపీ పాలనలో జరిగిన తప్పిదాలు, వరుస నష్టాలతో రైతులు చెరకు సాగును క్రమేపీ తగ్గించేశారు. ఇప్పుడీ సుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో రైతులు 500 ఎకరాలకు మించి చెరకు సాగుచేయట్లేదు.

ప్రమాదకర స్థితిలోకి ఫ్యాక్టరీ...
గత టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితంగా ఫ్యాక్టరీ సుమారు రూ.47.88 కోట్లు నష్టాల్లోకి వెళ్లింది. ఆప్కాబ్‌ నుంచి తెచ్చిన రూ.25 కోట్ల రుణంపై ఏటా రూ.3.2 కోట్ల వరకూ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. మరోవైపు యంత్రాలన్నీ పనిచేయకుండాపోయాయి. గత టీడీపీ ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తూ రూ.12 కోట్లు మంజూరుచేసినట్లు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో ఉంది.

 ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి...
ఫ్యాక్టరీపై ఆధారపడిన రైతులకు నష్టం లేకుండా జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఫలితంగా రైతులు గత నాలుగేళ్లుగా రేగిడి మండలం సంకిలి వద్దనున్న ఈఐడీ ప్యారీ సుగర్‌ ఫ్యాక్టరీకి చెరకును విక్రయిస్తున్నారు.

చంద్రబాబుదే ఆ పాపం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తొలిదఫా పాలన సాగిన 1995 నుంచి 2003 వరకూ రాష్ట్రంలోని 18 సహకార చక్కెర కర్మాగారాల్లో ఎనిమిది ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీకి అదేగతి పట్టించేందుకు కత్తి వేలాడదీశారు. 2003–04 సీజన్‌లో క్రషింగ్‌ చేయకూడదని అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూతపడింది. నాటి ప్రతిపక్ష నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను 2003 ఏప్రిల్‌లో భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ ముందుగానే సాగింది. అప్పుడు చెరకు రైతులు ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫ్యాక్టరీని తెరిపించారు. ప్రభుత్వ గ్యారెంటీతో రూ.3.50 కోట్ల రుణం అందించారు. ఫ్యాక్టరీకి గుదిబండగా మారిన అప్పులు రూ.18.04 కోట్లను ప్రభుత్వం షేరు ధనంగా మార్చారు. ఆధునికీకరణకు రూ.36.18 కోట్లు మంజూరు చేశారు. తద్వారా క్రషింగ్‌ సామర్థ్యాన్ని 1205 మెట్రిక్‌ టన్నుల నుంచి 2 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచడం, పవర్‌ ప్లాంట్‌ ఉత్పత్తి కూడా 1.5 కిలోవాట్ల నుంచి 12 కిలోవాట్లకు పెంచడం లక్ష్యాలుగా నిర్దేశించారు. మిగులు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా ఫ్యాక్టరీ కొంత లాభపడటం అనేదీ ఇందులో భాగం. మరోవైపు ఫ్యాక్టరీ ఆధునికీకరణకు తమ వంతు సహకారంగా రైతులు నుంచి రూ.3 కోట్ల వరకూ పెట్టుబడి నిధి కూడా సేకరించారు. దాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే అది వడ్డీతో రూ.5 కోట్లు అయ్యింది.

ఫ్యాక్టరీని ముంచేసిందెవరో రైతులకు తెలుసు...
చెరకు రైతులను మభ్యపెట్టడానికి టీడీపీ నాయకులు మొసలికన్నీరు కార్చుతున్నారు. చంద్రబాబు పాలన ఒక శాపం. 2003 నాటికి భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీకి మూతవేసేశారు. సీతానగరం మండలంలోనున్న మరో సుగర్‌ ఫ్యాక్టరీని కమీషన్ల కోసం తక్కువ మొత్తానికే ప్రైవేట్‌పరం చేసేశారు. 2004లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమసింగి ఫ్యాక్టరీకి జీవం పోశారు. లాభాల బాట పట్టించారు. మళ్లీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా నష్టాల్లో ముంచారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం రైతుల వంతుగా సేకరించిన రూ.5 కోట్ల సొమ్మును అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కేఏ నాయుడు దుర్వినియోగం చేశారు. చంద్రబాబు కుర్చీ దిగిపోయేనాటికి చెరకు సాగువిస్తీర్ణం నాలుగో వంతుకు పడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 9,795 మెట్రిక్‌ టన్నుల చెరకు ప్యారీకి వెళ్లింది. ఇంకా 600 టన్నుల వరకూ ఉండవచ్చు. ఇంత తక్కువ క్రషింగ్‌తో ఫ్యాక్టరీని నడపడం ఆర్థికంగా మరింత నష్టమే తప్ప లాభంలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులకు ఉపయోగపడేలా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను అక్కడ ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం.
– బొత్స అప్పలనర్సయ్య, గజపతినగరం ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement