సాక్షి ప్రతినిధి, విజయనగరం: 2019 సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీకి మళ్లీ ఊపిరి పోయడానికి ఆ పార్టీ నాయకులు ఫేక్ చేరికలనే నమ్ముకున్నారు. టీడీపీలో ఉన్నవారికే మళ్లీ పచ్చ కండువాలు కప్పుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం అధికార వైఎస్సార్‌సీపీ పంచన కొన్నాళ్లు గడిపినవారిని కూడా నిస్సిగ్గుగా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. వారిని వైఎస్సార్‌సీపీ నాయకులుగా చూపించి వలస వచ్చేస్తున్నారంటూ ఫొటోలు తీయించి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు ఛీకొట్టినా ఫేక్ చేరికలనే నమ్ముకొని రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగడానికి టీడీపీ నాయకులు ఫిక్స్ అయిపోయినట్లున్నారు.
► విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గొల్లలపేట గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ ఈగల సత్యారావు యాదవ్ 2019 సంవత్సరానికి ముందువరకు టీడీపీలోనే ఉండేవారు. అప్పటికే ఆ చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు సుమారు రూ.18 లక్షలు పెండింగ్‌లో ఉండేవి. వాటిని క్లియర్ చేసుకోవడానికి వైఎస్సార్‌సీపీ పంచన చేరారు. ఆ బిల్లులన్నీ క్లియర్ చేయించుకోవడమే గాక తన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు ప్రయోజనాలు పొందారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ కండువా కప్పేసుకొన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి వలస వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు.
► రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాజాం మండలం గెడ్డవలస గ్రామంలో కొంతమంది రెడ్డి నారాయణరావు తదితర టీడీపీ కార్యకర్తలకు ఇటీవల మరోసారి పచ్చకండువా వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట తిరిగినవారే అయినా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కోండ్రు మురళీమోహన్ ఉద్దేశపూర్వకంగానే వారి పూర్వాపరాలు మరచిపోయినట్లున్నారు. ఇలా పార్టీలో చేరినట్లు చూపిస్తున్నవారిలో కిమిడి కళా వెంకటరావు కుటుంబానికి చెందిన పొగిరి గ్రామ టీడీపీ నేత, మాజీ ఎంపీపీ జడ్డు ఉషారాణి భర్త జడ్డు విష్ణుమూర్తి వర్గీయులు కూడా ఉన్నారు. అలా, టీడీపీ వారికే పచ్చ కండువా వేసి తన వర్గీయులుగా ముద్ర వేసుకునే పనిలో కోండ్రు మురళీమోహన్ ఉన్నారని కళావెంకటరావు వర్గీయులు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.
► నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పూసపాటిరేగ మండలం పసపాం గ్రామంలో మాజీ సర్పంచ్ కంది వెంకటరమణ టీడీపీ నుంచి 2019 ఎన్నికల తరువాత వైఎస్సార్‌సీపీ పంచన చేరారు. రెండ్రోజుల కిందట అతనికి పచ్చకండువా వేసి టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తీర్థం ప్రసాదించారు. – బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మరిపి రమేష్, రామభద్రపురం మండలం కోటశిర్లాం గ్రామ సర్పంచ్ తాడ్డి శ్రీనివాసరావు, సోంపురం సర్పంచ్ చొక్కాపు అప్పలనాయుడు, కొత్తరేగ సర్పంచ్ కిలపర్తి మురళి, తెర్లాం మండలం పెరుమాళి సర్పంచ్ సాగిరాజు హేమలత, డి.గడబవలస సర్పంచ్ జావాన రమేష్ ఇటీవల టీడీపీ కండువా వేసుకున్నారు. కానీ వారంతా వాస్తవానికి టీడీపీ వారే. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సొంత ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీలో ఉన్నట్లు నటించారు. తమ ప్రయోజనాలు నెరవేరిన తర్వాత ఇప్పుడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన ప్రలోభాలతో మరోసారి పచ్చకండువా వేసుకున్నారు.
► చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇటీవల కాలంలో టీడీపీలో చేరారని చూపిస్తున్నవారంతా గతంలో నుంచి ఆ పార్టీలో ఉన్నవారే. సోమలింగాపురం గ్రామానికి చెందిన శిరువూరు వెంకటపతి రాజు, ఇప్పలవలస గ్రామానికి సంబంధించి రౌతు వేణునాయుడు, రౌతు ఆనంద్, శ్యామాయవలస మాజీ సర్పంచ్ ఎస్.త్రినాథరావు తదితరులతా ఆ కోవకు చెందినవారే.
► పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సీతానగరం మండలం బక్కుపేట గ్రామ సర్పంచ్ గొట్టాపు మంగమ్మ, మాజీ సర్పంచ్ అప్పారావు సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీ పంచన చేరారు. గత టీడీపీ పాలనలో పరిష్కారానికి నోచుకోని కొండగెడ్డ కల్వర్టును ఎమ్మెల్యే అలజంగి జోగారావు చొరవతో పూర్తి చేయించారు. ఆ గ్రామంలో సమస్యలన్నీ పరిష్కరించారు. అవన్నీ విస్మరించి ఇప్పుడు టీడీపీలో చేరిపోయినట్లుగా పచ్చకండువా వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment