సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని టీడీపీలో ఇప్పుడు నియోజక వర్గానికో కొల్ల అప్పలనాయుడు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ గొంప కృష్ణ, ఓ కిమిడి నాగార్జున, ఓ బొబ్బిలి చిరంజీవులు, ఓ ఆర్‌పీ భంజ్‌దేవ్, ఓ మీసాల గీత, ఓ తెంటు లక్ష్మునాయుడు, ఓ కేఏ నాయుడు, ఓ కావలి గ్రీష్మ, ఓ కర్రోతు బంగార్రాజు.. ఇలా ఊహూ అన్న ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్సీ చేసేస్తామని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ హామీలిచ్చేస్తున్నారు.
ఈ వ్యవహారం చూస్తుంటే వెంకీ సినిమాలో కృష్ణ భగవాన్ ఉద్యోగాలిస్తామని హీరో రవితేజ బృందాన్ని బురిడీ కొట్టించిన సీన్ గుర్తొస్తుంది. ‘ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్‌యార్డా, ఏసియాడా, జింకా, బంకా (హెచ్‌పీసీఎల్)... ఏ కంపెనీలో ఉద్యోగం కావాలి? జీఎం కావాల్న? ఏజీఎం కావాల్న?’ అని ఊరించి డబ్బులు నొక్కేసి కృష్ణభగవాన్ లాఘవంగా జెల్ల కొట్టేసిన హాస్యభరిత సన్నివేశం ఇప్పుడీ టీడీపీ నాయకుల సీట్ల వ్యవహారంలో కనిపిస్తోంది.
మాట ఇస్తే ఆరునూరైనా అమలుచేయడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంటి మనస్థత్వం కాదు వారిది!. చంద్రబాబు, లోకేశ్ హామీలిచ్చి ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత ఎలా ముంచేస్తారో కొల్ల అప్పలనాయుడి అనుభవమే నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా మద్దతు కూడగట్టాలని ప్రతి నియోజకవర్గంలో రెబెల్స్‌కు ఎమ్మెల్సీ ఆశ చూపిస్తున్నారు. లేదంటే నామినేటెడ్ పోస్టు.. అదీ లేదంటే సముచిత స్థానం కల్పిస్తామని భ్రమలు కల్పిస్తున్నారు.
ఉన్నవెన్ని? వచ్చేవెన్ని?
రాష్ట్ర శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. రెండేళ్లకోసారి మూడింట ఒకటో వంతు మంది పదవీ విరమణ చేస్తుంటే ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ బలం 43 కాగా టీడీపీకి ఉన్నవి ఎనిమిది మాత్రమే. మిగతావాటిలో పీడీఎఫ్ సభ్యులు ఇద్దరు, స్వతంత్ర సభ్యులు నలుగురు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీడీపీ ఇటీవల రాజ్యసభలో ఖాళీ అయిపోయినట్లుగానే భవిష్యత్తులో శాసనమండలి నుంచి కూడా పూర్తిగా ఖాళీ అయిపోయేట్లు ఉంది. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు.
కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాల్లో భాగంగా సొమ్ములు దండిగా ఉన్నవారికే టికెట్లు ఇస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడినవారికి మొండిచేయి చూపిస్తున్నారు. వారిని బుజ్జగించడానికి ‘ఎమ్మెల్సీ’ పదవులనే బిస్కెట్‌లు వేస్తున్నారు. మన రెండు జిల్లాల్లోనే పది మంది వరకూ ఇలాంటి ఆశాజీవులు ఉంటే... రాష్ట్రంలో ఇలా ఆశలపల్లకి ఎక్కిస్తున్నవారి సంఖ్య వందకు పైమాటే. చంద్రబాబు బూటకపు హామీలిచ్చి ప్రజలనే కాదు సొంత పార్టీ నాయకులనూ బురిడీ కొట్టిస్తున్నారడంలో సందేహం అక్కర్లేదు.
కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి.. మరీ..
ఈయన పేరు కొల్ల అప్పలనాయుడు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సంతకవిటి మండలంలో తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు. ఎంపీపీగా మూడు పర్యాయాలు పనిచేశారు. మరో రెండుసార్లు తన అనుచరులనే ఎంపీపీ పదవిలో కూర్చోబెట్టారు. తన భార్యను కూడా జెడ్పీటీసీగా ఒక పర్యాయం గెలిపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వాడుకొనే ఉద్దేశంతో చంద్రబాబు తాయిలం వేశారు.
శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌ను చేస్తానని ఆశచూపించారు. తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా మొండిచేయి చూపించారు. చౌదరి ధనలక్ష్మిని చంద్రబాబు ఆ పదవిలో కూర్చోబెట్టారు. దీంతో మనస్తాపం చెందిన కొల్ల అప్పలనాయుడిని బుజ్జగించి... ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చారు. 2017 ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం ఇస్తారని ఆశించిన కొల్లకు జెల్ల కొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన శత్రుచర్ల విజయరామరాజును అందలం ఎక్కించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొల్ల తాను రెబెల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. నాడు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి మంత్రిగానున్న పరిటాల సునీత, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు హుటాహుటిన కొల్ల స్వగ్రామం మామిడిపల్లి వెళ్లి మరీ బుజ్జగించారు. నామినేటెడ్ పదవి ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్నా కొల్ల కల నెరవేరలేదు.
ఇవి చదవండి: బాబు తన ప్లాన్ ప్రకారమే జనసేన 'కుర్చీ మడతెట్టేశాడు'!
Comments
Please login to add a commentAdd a comment