ఎచ్చెర్ల మండలంలోని పలు గ్రామాల నుంచి వేటకు సముద్రంలోకి వెళ్లి పాకిస్తాన్ సైనికుల చెరలో చిక్కిన మత్స్యకార కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఏడు నెలలుగా పైసా చెల్లించలేదు. అయితే వారు ఒకటో తేదీన స్పందనలో విన్నవించుకుంటే.. పాకిస్తాన్ చెరలో ఉన్నవారిని విడిపించేందుకు కలెక్టర్ కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాశారు. అంతేకాకుండా వారి కుటుంబాల జీవనోపాధికి ఏడు నెలల పింఛను మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు.
శ్రీకాకుళం మండలం ఇప్పిలి గ్రామానికి చెందిన దివ్యాంగుడు జోగిపాటి వెంకటరమణ తనను ఆదుకోమని గత ప్రభుత్వ హయాంలో అనేకసార్లు విన్నవించుకున్నాడు. అయినా ఫలితం శూన్యం. ఈ నెల 1వ తేదీన ‘స్పందన’ కార్యక్రమంలో మళ్లీ దరఖాస్తు చేశాడు. వారం తిరక్కుండానే కలెక్టర్ స్వయంగా ట్రైసైకిల్ అందజేశారు. ఇది కలా నిజమా అని ఆయన ఆశ్చర్యపోయాడు. జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన దివ్యాంగుడు పంచాది గౌరిది అదే పరిస్థితి. దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే వీల్ చెయిర్ అందించారు. ఇలా జిల్లా అంతటా దిగ్యాంగులకు పెద్ద ఎత్తున ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు.
స్పందన ప్రారంభించాక గడచిన మూడు వారాల్లో అర్జీదారులను ఆశ్చర్య ఆనందాల్లో ముంచెత్తిన ఇలాంటి సంఘటనలెన్నో..
సాక్షి, శ్రీకాకుళం: ‘ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమానికి స్పందన అని పేరు పెట్టండి. బాధలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను నవ్వుతూ పలకరించండి. వారి అర్జీలను పరిశీలించి ఎన్నాళ్లలో పరిష్కరిస్తారో పేర్కొంటూ రశీదు ఇవ్వండి. బాధితుల సమస్య తీర్చేందుకు వెంటనే రంగంలోకి దిగండి..’ ఇదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట. ఆ తర్వాత మూడు వారాలు స్పందన కార్యక్రమం జరిగింది. కొద్ది రోజుల్లోనే అధికారుల స్పందనలో వచ్చిన మార్పును ప్రజలు గమనించారు. మంచి రోజులు వచ్చాయని ఆనందపడుతున్నారు. ప్రతి వారం జిల్లా గ్రీవెన్సుకు వందల్లో వచ్చే వినతులు ప్రస్తుతం వేల సంఖ్యకు చేరుకున్నాయి. తక్షణం చాలా ఫిర్యాదులు పరిష్కరిస్తుండడంతో ప్రజలు దీర్ఘకాలికంగా ఉన్న బాధలను, గతంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా చిక్కు వీడని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. జిల్లాస్థాయిలోనే కాక డివిజన్, మండల స్థాయుల్లో.. అన్ని విభాగాల కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇంతవరకు వచ్చిన దరఖాస్తులు | 5,223 |
పరిష్కరించినవి | 3,224 |
పరిష్కారం కానివి | 1999 |
అందులో గడువు దాటినవి | 399 |
ఇంకా సమయమున్నవి | 1600 |
మూడు వారాల్లో 61.73 శాతం అర్జీల పరిష్కారం
ఈ కార్యక్రమం ఈనెల ఒకటో తేదీ సోమవారం నుంచి ప్రారంభమయింది. ఇప్పటి వరకు ఒకటి, 8, 15 తేదీల్లో మూడుసార్లు జరిగింది. జిల్లా అధికారులు వినతులు తీసుకొని కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తుండడంతో తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమం ప్రజల్లోకి వెల్లింది. ప్రతివారం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొన్ని సమస్యలు అక్కడే అధికారులను పిలిచి పరిష్కరిస్తున్నారు. మరికొన్ని సమస్యలు ఒకటి రెండు రోజుల్లో పరిష్కారమవుతున్నాయి. ఇంతవరకు 5,223 వినతులు రాగా అందులో 3,224 వినతులపై అధికారులు ఇప్పటికే స్పందించారు. అంటే వెంటవెంటనే 61.73 శాతం వినతులు పరిష్కారమయ్యాయి. గతంలో అధికారుల స్పందన అంతంతమాత్రంగా ఉండేది. వినతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉండేవి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఆలోచనలో పాత విధానానికి స్వస్తి పలికారు. ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తుండడంతో సిబ్బంది పరుగులు తీస్తున్నారు.
పౌర సరఫరాల విభాగానికి అత్యధికంగా 1211 వినతులు
స్పందనలో ఇటీవల జరిగిన మూడు కార్యక్రమాల్లోనూ అత్యధికంగా పౌర సరఫరాల విభాగానికి ఎక్కువగా 1211 వినతులు వచ్చాయి. తెలుపురంగు కార్డులు కావాలని ఎక్కువమంది వినతులు అందజేశారు. వీటిలో ఇప్పటికే 872 వినతులు పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment