మొదటి సోమవారం.. గ్రీవెన్స్ డే
తొలి ఫైలుపై సంతకం చేసిన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రతి నెల మొదటి సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. ఆదివారం ఉదయం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ నెల 16నుంచి 30వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పెండింగ్ పనులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించారు.
అలాగే ఈ నెల 12నుంచి నెలరోజులపాటు పాఠశాలలు, కళాశాలల బస్సులను తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు, అత్యాధునిక డ్రైవింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రవాణా కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ యం.జగదీశ్వర్, జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గ్రామానికీ ‘ప్రగతిచక్రం’
రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అదివారం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10,600 గ్రామాలకుగాను ప్రస్తుతం 9,200 గ్రామాలకు బస్సు సౌకర్యం ఉందన్నారు. త్వరలో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడమే లక్ష్యమన్నారు. కొత్తగా 50వరకు బస్సు డిపోలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ప్రతి మూడు నెలలకోసారి బస్సుల తీరును సమీక్షించి ప్రమాధాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బస్టాండ్‌ల పరిధుల్లోని ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసి అభివృద్ధితోపాటు అదాయాన్ని పెంచుతామన్నారు. వారంలోగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమల్లోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవరావు, కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.