అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్, అధికారులు
- ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి
- గ్రీవెన్స్‌లో గ్రామస్తుల ఫిర్యాదు
- జిన్నారం మండలం మాదారం గ్రామం నుంచి ఓఆర్‌ఆర్ వరకు నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ రోడ్డును నాణ్యాత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించేలా వీఎన్‌ఆర్ నిర్మాణ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సర్పంచ్ సురేందర్‌గౌడ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు, కల్వర్టు నిర్మాణంలో నాసిరకం డస్టును వినియోగిస్తున్నారని ఆరోపించారు.
- హత్నూర మండలం పాల్పనూర్ పెద్దచెరువులో మిషన్ కాకతీయ పనులను నాసిరకంగా చేపట్టారని, పాత అలుగులకు కొత్త సొగసులు అద్దారని, సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలతో పాటు శిఖం భూమి విస్తీర్ణం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నాగేష్ కోరారు.
- నాలుగు సంవత్సరాల క్రితం ఇందిర జల ప్రభ పథకం కింద బోరు వేసిన అధికారులు మోటారు, ట్రాన్స్‌ఫార్మర్ బిగించే విషయంలో కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని టేక్మాల్ మండలం అచ్చన్నపల్లికి చెందిన రామావత్ సర్వన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
- జనన ధ్రువీకరణ పత్రం కోసం గతేడాది సెప్టెంబర్ 29న మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేస్తే నేటికీ అందలేదని నారాయణఖేడ్ మండలం మాద్వార్ తాండకు చెందిన రవీందర్ నాయక్ ఫిర్యాదు చేశారు.
- విధుల నుంచి తొలగించిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సంగారెడ్డి మండలం చిద్రుప్పకు చెందిన లాల్‌సింగ్ కోరారు.
- పశువులపాక కాలి ఐదు ఆవులు మృతి చెందగా, మరో తొమ్మిది ఆవులు తీవ్రంగా గాయపడినందున తనకు నష్ట పరిహారం ఇప్పించాలని నారాయఖేడ్ మండలం పిప్రితాండకు చెందిన రాంసింగ్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
- జిన్నారం మండలం కాజీపల్లి గ్రామంలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.
- దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుమ్మక్కయి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాని ఉపసర్పంచ్ సాయిలు వార్డు సభ్యులు లావణ్య ,పద్మ,సంగీత, యాదగిరి ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి జోన్: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలిగించి, మాసం రోజుల్లోనే మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై గ్రామస్తులు కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావిజ్ఞాప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
వీరి నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్వో దయానంద్ ,ఇతర జిల్లా శాఖల అధికారులు వినతులు స్వీకరించారు. పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకయ్య రూ. 12 లక్షల మేరకు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు సామాజిక తనిఖీలో నిరూపణ కావడమే కాకుండా, అసభ్యంగా ప్రవరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో గత నెల 13వ తేదీన విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, తిరిగి విధుల్లోకి తీసుకోడంపై సమగ్ర విచారణ చేపట్టి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు.