-
సమస్యలను పరిష్కరించాలని వినతి
నెల్లూరు(పొగతోట): సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ముత్యాలరాజుకు జిల్లా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఆయనకు అర్జీలు సమర్పించారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలన కోరారు. పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కలెక్టర్‌తో పాటు జేసీ ఎ.మహమ్మద్ ఇంతియాజ్, జేసీ–2 రాజ్‌కుమార్, ఇన్‌చార్జి డీఆర్వో మార్కండేయులు అర్జీలు స్వీకరించారు.
ధాన్యానికి మద్దతు ధర కల్పించాలి: బీజేపీ నేతలు
జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రెండో పంట సాగు కోసం రైతులు పెట్టుబడి బాగా పెట్టారు. పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. పుట్టి రూ.10,500కి కొనుగోలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మార్కెట్‌లోకి ధాన్యం భారీగా వస్తుంది. మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
దారిని ఆక్రమించారు యు.అనూరాధ, చీకవోలు, సైదాపురం
నా భర్త, తల్లిదండ్రులు మరణించారు. కుమారుడితో కలిసి పక్కా ఇంట్లో నివాసం ఉంటూ పుట్టింటి ద్వారా సంక్రమించిన నిమ్మతోట సాగు చేసుకుంటున్నాను. రోడ్లోకి పోయే బాటను ఊళ్లో వాళ్లు ఆక్రమించి పేడదిబ్బలు, రాళ్లు వేశారు. సర్వేయర్ వచ్చి హద్దు రాళ్లు నాటినా వాటిని పోస్తూనే ఉన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే గొడవకు దిగుతున్నారు. ఉన్నతాధికారులే న్యాయం చేయాలి.
బెల్టుషాపులు తొలగించండి: పెరుమాళ్లపాడు మహిళలు
మా ఊళ్లో పంచాయతీ ఆఫీసుతో పాటు బడికి, గుడికి పక్కనే బెల్టుషాపులు ఉన్నాయి. మందు తాగిన వారు మాతో పాటు చిన్నపిల్లలతో అసభ్యంగా ప్రవరిస్తున్నారు. ఊళ్లో గొడవలకు దిగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బెల్టుషాపులు తొలగించేలా చర్యలు తీసుకోవాలి.
ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలి: ప్యాసింజర్స్ అసోసియేషన్ నాయకులు
కావలిలోని పెద్దపవని రోడ్డులో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే ట్రాక్ దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసి సమస్య పరిష్కరించాలి.
దివ్యాంగుల పోస్టులు భర్తీ చేయాలి: వీహెచ్‌పీఎస్ నాయకులు
సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులందరికీ రూ.1,500 పింఛన్ ఇవ్వాలి. అలాగే బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి. దివ్యాంగులందరికీ స్థలాలు మంజూరు చేసి పక్కా ఇళ్లు కట్టించాలి.
నిర్వాసితులకు న్యాయం చేయాలి: రాజులపాడు వాసులు
రాజులపాడులో కడుతున్న రిజర్వాయర్‌తో 250 ఇళ్లు, ఆరువందల ఎకరాల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ప్రారంభించారు. వెంటనే పరిహారం అందజేయాలి. పొలాలకు బదులుగా పొలాలే కేటాయించాలి. భూములిచ్చిన వారికి ఉపాధి చూపాలి.