పాపం పండింది
► జైలుపాలవుతున్న అక్రమార్కులు
► వైఎస్సార్ నగర్‌లో అక్రమ మార్కులకు చెక్
నెల్లూరు రూరల్ : పేదలకు కేటయించిన ఇళ్లను ఆక్రమించుకుని అమ్ముతున్న అక్రమార్కుల పాపం పండింది. వైఎస్సార్ నగర్‌లోని ఇళ్ల అక్రమ నిర్మాణాలు, నకిలీ పట్టాల దందాపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన కలెక్టర్ ముత్యాలరాజు విచారణ చేపట్టాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. వారు విచారణ జరిపి అక్రమ దందా నిజమేనని నిగ్గు తేల్చారు. అక్రమార్కులకు ఆ శాఖ ఏఈ రామకృష్ణారావు సహకారం కూడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. తమ వద్ద ఉన్న ప్రాథమిక ఆధారాలతో పీడీ రామచంద్రారెడ్డి ఆదేశాలతో డీఈఈ రాజారత్నం వాస్తవాలు తేల్చాలని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్న వారితో పాటు మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. వైఎస్సార్ నగర్‌లో ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి, నకిలీ పట్టాలను సృష్టించి, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అమ్మకాలు సాగించి రూ.లక్షలు పోగేసుకున్న వైనం గురించి ఒప్పుకున్నారు. కాగా ఇప్పటికే 21 మంది బాధితులు తాము మోసపోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రాంతాన్ని బట్టి వసూలు చేసి, నకిలీ పట్టాలను అంటగట్టినట్లు బాధితులు ఎస్‌ఐ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.
హడలిపోతున్న అక్రమార్కులు
ఇప్పటికే అక్రమాలకు ప్రధాన సూత్రధారి శివ, మంజుల, హౌసింగ్ ఏఈ రామకృష్ణారావు తదితరులపై కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు పంపారు. హౌసింగ్ ఏఈని ఆ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసు విచారణలో అక్రమంగా ఇళ్లను అమ్మిన మరికొంతమంది ముఠా కూడా ఉన్నట్లు తేలింది. వీరిని కూడా త్వరలో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో అక్రమార్కులు హడలిపోతున్నారు. కొంత మంది కబ్జాదారులు కాలనీ విడిచి వెళ్లారు. కబ్జాకు గురైన ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు అప్పగించే పనిలో హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు.
విచారణ కొసాగుతోంది
వైఎస్సార్ నగర్‌లో ఇళ్ల అక్రమాలపై విచారణలో దోషులుగా తేలిన వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి రిమాండ్ విధించారు. మరి కొంత మందిపై విచారణ కొనసాగుతుంది. వీరి వల్ల నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే విచారించి న్యాయం చేస్తాం. – ఎన్.రామ్మూర్తి, రూరల్ ఎస్‌ఐ