భద్రతను కట్టుదిట్టం చేయాలి
-
ఎన్‌ఐఎస్‌ఎస్‌సీఓ సదస్సులో కలెక్టర్
నెల్లూరు(క్రైమ్): పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా జిల్లాను సురక్షిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ ఎం. ముత్యాలరాజు పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం రాత్రి స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో నెల్లూరు ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్‌ఐఎస్‌ఎస్‌సీఓ) రివ్యూ సమావేశం ఎస్పీ విశాల్‌గున్నీ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల భద్రతకు పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. దేశంలో నెల్లూరు జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, పారిశ్రామికవేత్తల చూపు జిల్లా వైపు ఉందన్నారు. దీన్ని బట్టి చూస్తే మరిన్ని పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎస్పీ విశాల్‌గున్నీ ఎన్‌ఐసీసీఓ సాధించిన ప్రగతి, సంస్థ నిర్మాణం, సభ్యుల సమీకరణ, మాక్ డ్రిల్ నిర్వహణ తదితరాలను వివరించారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో భాగంగా పరిశ్రమలను క్లస్టర్‌గా విభజించి నేరాల నియంత్రణకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకున్నామన్నారు. తొలుత ఎన్‌ఐఎస్‌ఎస్‌సీఓ విధులు, పని విధానం గురించి ఎస్పీ వివరించారు. ఏఎస్పీ బి. శరత్‌బాబు, ఎస్‌బీ, నెల్లూరు నగర , రూరల్, గూడూరు, ట్రాఫిక్ డీఎస్పీలు ఎన్. కోటారెడ్డి, జి. వెంకటరాముడు, తిరుమలేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, రామారావు, వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.