IKP centers
-
సన్న వడ్లకు 500 బోనస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సన్నవడ్లకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు.సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్.. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు కూడా పెట్టాలి. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఐకేపీ సెంటర్లకి సీరియల్ నెంబర్లు ఇవ్వాలి. సన్నవడ్లపై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి. ధాన్యం కోసం గోనె సంచులు అందుబాటులో ఉండాలి. ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగం కావాలి. కొనుగోలు చేసిన ధ్యానం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు ప్రతీరోజూ రెండు గంటల పాటు ధాన్యం కొనుగోలుపైన సమీక్ష జరపాలి. ధాన్యం కొనుగోళ్లపైన కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే. ధాన్యంలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిని సహించవద్దు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. రాష్ట్రంలో వంద శాతం రైతులు సన్నబియ్యం పండించేలా చొరవ చూపించాలి. వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లు ఏర్పాట్లు చేయాలి అంటూ అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
బండెనక బండి.. ధాన్యం లెండి
జనగామ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌లతో పాటు వ్యవసాయ మార్కెట్ల ద్వారా 195 కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు వాహనాల కొరత ఏర్పడటంతో కొద్దిరోజులుగా భారీగా ధాన్యం పేరుకు పోయింది. పైగా అకాల వర్షాలు పడటంతో ధాన్యం రవాణాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రంగంలోకి దిగిన జిల్లా అధికార యంత్రాంగం మంగళవారం ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి మరీ ధాన్యాన్ని మిల్లుల్లో దింపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఏ.భాస్కరావు పర్యవేక్షణలో తహసీల్దార్ రవీందర్, ఇతర శాఖల అధికారులు ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. – జనగామ చదవండి: పారిపోయిన కొడుకు.. అత్తకు కోడలు అంతిమ సంస్కారాలు ధాన్యం తడిసిందని.. మహిళా రైతు బలవన్మరణం -
ధాన్యం డబ్బులు ఇంకెప్పుడు.. ?
- ఖరీఫ్ పెట్టుబడుల కోసం ఎదురుచూపులు - ఖాతాలో డబ్బులున్నా చేతికందని వైనం సాక్షి, కరీంనగర్ : రైతు పరిస్థితి దిక్కుతోచకుంది. ధాన్యం అమ్మిన డబ్బులు ఇరవై రోజులు గడిచినా చేతికి రాకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చెక్కుల ద్వారా డబ్బులు చెల్లించిన సివిల్ సప్లై విభాగం రెండేళ్లుగా నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. అయితే, చెల్లింపులు ఆలస్యం అవుతుండడంతో అదనుపై పెట్టుబడులు లేక రైతులు అప్పుల కోసం తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరో పక్కధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు ఉన్నా.. బ్యాంకు అధికారులు కొర్రీలు పెడుతుండడంతో డబ్బులున్నా.. పెట్టుబడుల కోసం పడిగాపులు తప్పడం లేదు. ఉన్నా.. లేకున్నా.. అవే తిప్పలు.. ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం ఐకేపీ కేంద్రాలు, సొసైటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్లైన్లోనే జమ చేస్తామని అధికారులు చెబుతుండడంతో తమ ఖాతాలున్న బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొత్త విధానం కావడంతో ఆలస్యమవుతోందని.. డేటా ఎంట్రీ, సాఫ్ట్వేర్ సమస్యలతో జాప్యం జరిగిందని కొన్ని బ్యాంకులు రైతులను సముదాయించే పని పెట్టుకున్నాయి. మరోపక్క ధాన్యం డబ్బులు బ్యాం కుల్లో జమైన రైతులు వాటిని తీసుకోలేక పోతున్నారు. రైతులకు సాధార ణంగా గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఖాతా లు ఉండడం.. నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ల్లో నగదు నిండుకోవడంతో రైతుల ఖాతాల్లో డబ్బులున్నా కొర్రీలు పెడుతున్నాయి. ఒక్కో చోట కేవలం రూ. 4 వేలు.. పది వేలు చేతిలో పెట్టి వారం రోజుల తర్వాత మరోసారి రావాలని సూచిస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు మానుకొని రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. వడ్లు అమ్మి నెలైతంది.. నాది సిరిసిల్ల. పెద్దూరు దారిలో నాలుగెకరాలుంది. 120 క్వింటాళ్ల వడ్లు అయినయి. సిరిసిల్ల మార్కెట్లో అమ్మిన. నెల రోజులు అవుతుంది వడ్లు అమ్మి. వడ్ల పైసలు రూ.లక్షా ఎనబై ఒక్క వేయి వచ్చినయి అన్నారు. కానీ.. బ్యాంకులో ఇరవై వేలన్నా ఇస్తలేరు. పది వేలు ఇచ్చి మళ్లీ వారం దాకా రావద్దు అంటున్నారు. మల్ల ఎవుసం పెట్టుబడికి గోస అవుతుంది. – గోలి లక్ష్మీనారాయణ, రైతు, సిరిసిల్ల బ్యాంకు చుట్టూ తిరుగుడు అవుతుంది నాది సిరిసిల్ల మండలం చంద్రంపేట. నాకు నాలు గెకరాలు భూమి ఉంది. రెండెకరాల పత్తి పెట్టిన, మరో రెండెకరాలు వరి వేసిన. కొంత ఎండిపోయింది. 42 క్వింటాళ్ల వడ్లు అయినయి. రూ.63 వేలు రావాలే. మే 15నాడు వడ్లు జోకిన. వారం రోజులకే డబ్బులు వస్తయి అన్నరు. నెలదాటింది. కేడీసీసీ బ్యాంకు చుట్టూ తిరుగుడు అవుతుంది. ఇప్పుడు మళ్లీ వ్యవసాయానికి పెట్టుబడి కావాలే. చేతిల పైసల్లేక ఇబ్బంది అవుతంది. – మంద సత్యం, చంద్రంపేట, రైతు ఏడు జిల్లాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు తీరిది కొనుగోలు చేసిన ధాన్యం( మెట్రిక్ టన్నులు ) 10,75,723 రైతులు 1,81,200 మంది... మొత్తం ధాన్యం విలువ 1,623 కోట్లు ఇప్పటి వరకు చెల్లించినవి 1,006 కోట్లు ఇంకా చెల్లించిన బకాయిలు 616.79 కోట్లు ఒక్క కరీంనగర్ జిల్లాలో బకాయిలు 95 కోట్లు -
బిల్లుల కోసం రైతుల ఆందోళన
గుంటూరు: కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకుంటే.. ప్రభుత్వాలు వారికి బిల్లులు సకాలంలో అందించకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. రెండు నెలల కింద గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన రైతులు స్థానిక ఐకేపీ సెంటర్లలో తాము పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకున్నారు. అయితే, ఇప్పటి వరకు రైతులకు మొక్కజొన్న పంటకు సంబంధించిన బిల్లులు చేతికి అందలేదు. ఒక వైపు రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకొని స్థానిక గాంధీ సర్కిల్ వద్ద బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
టోకెన్ ఉండాల్సిందే
నీలగిరి: ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న గ్రామ సంఘాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల్లోని రైతుల వివరాలు, సాగువిస్తీర్ణం, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే అక్టోబర్ మూడోవారంలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటిలోగా రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించే ఐకేపీ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అహర్నిశలు శ్రమించి ధాన్యం కొనుగోలు చేస్తున్న సంఘాలపై రాజకీయ, అధికార ఒత్తిళ్లు తీవ్రమైన నేపథ్యంలో జిల్లాయంత్రాగం ‘టోకెన్’ విధానానికి తెరతీసింది. ప్రధానంగా రబీసీజన్‌లో అకాలవర్షాలు, గాలిదుమారాల కారణంగా ఐకేపీ కేంద్రాలు తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. కొనుగోలు సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాజకీయపార్టీలు రైతులపక్షాన ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. ఐకేపీ కేంద్రాల నెత్తిన భారం అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండండంతో మరో గత్యంతరం లేక ఐకేపీ సంఘాలు పలు సందర్భాల్లో తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదీగాక గ్రామాల్లో రైతుల నుంచి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మళ్లీ రైతుల పేర్లతో ఐకేపీ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. పంటదిగుబడి అధికంగా వచ్చినప్పుడు కూడా కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తోంది. ఈవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం సంఘాల వద్ద లేదు. దీంతో భారీఎత్తున కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు రవాణా చేయడం కూడా సమస్యగా మారింది. దీనిని అదనుగా భావిస్తున్న మిల్లర్లు సైతం ధాన్యంలో క్వింటాళ్ల కొద్ది కోత పెడుతున్నారు. ఈ నష్టాన్ని ఐకేపీ కేంద్రాలు భరించాల్సి వస్తోంది. వారికి చెల్లించే ధాన్యం కమీషన్లో ఆ నష్టాన్ని తగ్గించి చెల్లిస్తున్నారు. దీంతో గత రబీ సీజన్లో దాదాపు రూ. 2 కోట్ల నష్టం వాటిల్లింది. ఐకేపీ కేంద్రాలు తరలించిన ధాన్యానికి మిల్లర్లు ఇచ్చిన రశీదులకు మధ్య రూ.2కోట్లు విలువ చేసే ధాన్యం తేడా వచ్చింది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలకు విరుగుడుగా అధికారులు ఖరీఫ్ సీజన్ నుంచి టోకెన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. టోకెన్ విధానంతో తీరనున్న కష్టాలు.. * ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో రైతులు తమ పేర్లను కేంద్రాల వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. * రిజిస్టర్ చేయించుకున్న రైతులకు ఏ రోజున కేంద్రానికి ధాన్యం తీసుకురావాలో తెలియజేస్తూ ఓ టోకెన్ ఇస్తారు. * రిజిస్టర్ చేయించుకున్న రైతులు బ్యాంకు ఖాతాలు తప్పని సరిగా కలిగిఉండాలి. * తద్వారా ధాన్యం పైకాన్ని రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు. * రిజిస్టర్ చే యించుకునే రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకాలు, లేదా భూములకు సంబంధించిన ఆధారాలు కేంద్రాలకు సమర్పించాలి. * టోకెన్ విధానం వల్ల ఐకేపీ కేంద్రాలకు ఒకేసారి ధాన్యం తీసుకురావడం తగ్గుతుంది. ప్రైవేటు వ్యాపారుల జిమ్మిక్కులను కూడా కట్టడి చేయొచ్చు. * ఈ విధానం వల్ల ఐకేపీ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉండదు. ఎప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే వీలుంటుంది. -
రైతు నోట్లో మట్టి...!
నల్లగొండ : ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి పంటను పండించిన అన్నదాత నోట్లో మట్టి కొడుతున్నారు. పండించిన పంటకు మద్ధతు ధర లభించకపోగా.. అమ్మిన ధాన్యంలో కత్తెరపెడుతుండడంతో తీవ్రంగానష్టపోవాల్సి వచ్చింది. రబీ సీజన్లో ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి.. మిల్లర్ల లెక్కకు పొంతలేకుండా పోయింది. తాలు, దుమ్ము ఉందన్న సాకుతో మిల్లర్లు ధాన్యంలో భారీగా కోత విధిస్తుండగా సంఘాలు మాత్రం రైతులకు చెల్లించాల్సిన ధాన్యం డబ్బుల్లో కోత పెడుతున్నాయి. దీంతో పలు చోట్ల సంఘాలకు, రైతులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 250 ఐకేపీ కేంద్రాల ద్వారా 2 లక్షల 29 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ సారి పంట దిగుబడి గణనీయంగా పెరగడంతో ఐకేపీ కేంద్రాలకు రికార్డు స్థాయిలో ధాన్యం తరలివచ్చింది. పండించిన పంటకు కనీస మద్ధతు ధర లభిస్తుందన్న ఆశతో రైతులు మిల్లర్లను ఆశ్రయించకుండా ఐకేపీ కేంద్రాలలోనే ధాన్యం అమ్మారు. కానీ మిల్లర్లు మాత్రం సంఘాలను నట్టేటముంచాయి. కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు శాతం ఎక్కువగా ఉందన్న సాకుతో వందల క్వింటాళ్లు కోత పెట్టారు. దీంతో ఈ నష్టాన్ని తాము భరిచంలేమని సంఘాలు లబోదిబోమంటున్నాయి. రైతులు కూడా అమ్మిన ధా న్యానికి డబ్బులు చెల్లించాల్సిందేనని నష్టాన్ని తమపై రుద్ధితే మాత్రం సహించేది లేదని చెబుతున్నారు. తాలుపేరుతో దోపిడీ.. ఐకేపీ మహిళల అవగాహన లేమిని అడ్డంపెట్టుకుని మిల్లర్లు రైతుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకున్నారు. వాస్తవానికి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడే సంఘాలు ధాన్యం నాణ్యతను తేమ యంత్రాల ద్వారా పరిశీలిస్తారు. దీంతో పాటు తాలు, మట్టిపెడ్డలు, పొట్టు, గింజలు వంటివి ఉన్నట్లయితే ఆ మేరకు వారికున్న లెక్కల ప్రకారం సరిచూసి రైతులకు రశీదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల ద్వారా మిల్లర్లకు చేరుతుంది. ఇక్కడ మిల్లర్లు మళ్లీ తేమ, తాలు, వంటివన్నీ పరిశీలించిన తర్వాతే ధాన్యం దింపుకుంటున్నారు. దీంతో ఐకేపీ కేంద్రాల లెక్కలకు, మిల్లర్లు పరిశీలించి నిర్ధారించిన దానికి మధ్య వందల క్వింటాళ్ల ధాన్యం తరుగు పోతోంది. క్వింటాళ్ల కొద్దీ కోత.. ఆత్మకూరు (ఎం) ఐకేపీ కేంద్రం నిర్వాహకులు 7,501.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా మిల్లర్లు 7,374.91 క్వింటాళ్లకు లెక్కకట్టారు. దీంతో 126.69 క్వింటాళ్లను ధాన్యం తాలు, తేమ ఇతర కారణాలతో కోత పెట్టారు. వలిగొండ ఐకేపీ కేంద్రంవారు 16, 350 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. మిల్లర్లు 15,999 క్వింటాళ్లకు తగ్గించారు. దీంతో 350.28 క్వింటాళ్ల ధాన్యం కోత పడింది. కనగల్ మండలం కురంపల్లి ఐకేపీ కేంద్రంవారు 16,700 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. మిల్లర్లు 16,535 క్వింటాళ్లకు తగ్గించారు. దీంతో 165.70 క్వింటాళ్ల ధాన్యం కోత పడింది. మేళ్లచెర్వు ఐకేపీ కేంద్రం నిర్వాహకులు 26,863.20 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. మిల్లర్లు 26,6 86.47 క్వింటాళ్లకు లెక్కకట్టారు. ఇక్కడ 176.73 క్వింటాళ్లు తగ్గింది. నూతనకల్ ఐకేపీ కేంద్రంవారు 29,434 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కానీ మిల్లర్లు 2 9,091 క్వింటాళ్లకే లెక్కకట్టారు. దీంతో 342.32 క్వింటాళ్ల ధాన్యం కోల్పోవాల్సి వచ్చింది. భారీ వ్యత్యాసం.. ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి, మిల్లర్లు ఇచ్చిన రశీదులకు ఎంత మేర వ్యత్యాసం ఉందనే దానిపైన ధాన్యం ట్రక్షీట్ల ఆధారంగా యంత్రాంగం లెక్కలు కడుతోంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 64 ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలును సాకుగా చూపి 2,482 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు కోత పెట్టారు. క్వింటాకు రూ.1345 చొప్పున రూ.33 లక్షల 38 వేల 290 నష్టం వాటిల్లింది. అయితే మిగిలిన కేంద్రాల లెక్కలు పూర్తియ్యే సరికి ఈ నష్టం కోటి రూపాయాల వరకు చేరుతుందని అంచనా. క్వింటాకు రూ.32 కమీషన్‌కు పనిచేసే ఐకేపీ కేంద్రాలు ఇంత పెద్ద నష్టాన్ని భరిస్తాయా అన్నది ప్రశ్నార్థకం మారింది. ధాన్యం డబ్బులు నిలిపివేత.. ట్రక్ షీట్ల లెక్కలు ఇంకా పూర్తికాకపోవడంతో రైతులకు చెల్లించాల్సిన ధాన్యం సొమ్ము రూ. 3 కోట్లు నిలిపేశారు. ధాన్యం లెక్కల్లో తేడా వచ్చినట్లు రుజువైన కేంద్రాలకు వారికి చెల్లించాల్సిన సొమ్ములో కోత పెడుతున్నారు. ప్రభుత్వానికి నష్టం కలగకుండా అధికారులు తీసుకుంటున్న ఈ చర్య బాగానే ఉన్నా.. సంఘాలకు ధాన్యం డబ్బులు తగ్గించి ఇస్తే అప్పుడు అంతిమంగా నష్టపోవాల్సింది రైతాంగమే. మిల్లరు, సంఘాలు చేసిన నష్టాన్ని భరించేందుకు రైతులు సిద్ధంగా లేరు. మరి ఈ సమస్యను ఏ విధంగా గట్టెక్కిస్తారనేది అధికారులకే తెలియాలి. సంఘాలు, మిల్లర్ల వాదన ఇదీ.. వరి కోత యంత్రాల ద్వారా పంటను కోస్తున్నారు కాబట్టి మట్టి, రాళ్లు వచ్చే అవకాశమే లేదని మహిళా సంఘాలు, రైతులు పేర్కొంటున్నారు. వరి కోత యంత్రాల్లో ఉండే గాలిగొట్టాన్ని రైతులు మూసివేస్తుండడంతో తాలు, దుమ్ము ధాన్యం లోనే కలిసి వస్తోందనేది మిల్లర్ల వాదన. సంఘాల మీద ఒత్తిడి తీసుకొచ్చాం : చిర్రా సుధాకర్, డీఆర్డీఏ పీడీ. ధాన్యం కొనుగోలు విషయంలో సంఘాల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని, మొలకొత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని వారిపై తీవ్ర ఒత్తిచేశాం. అందువల్ల వారు కొనుగోలు చేశారు. కాబట్టి ఈ నష్టాన్ని రైతులే భరించాల్సి ఉంటుంది. -
‘మద్దతివ్వండి’ ... మహాప్రభో
సాక్షి, మహబూబ్‌నగర్: అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్‌ను అధికారులు పెడచెవిన పెడుతున్నారు. కొనుగోలుకు ప్రభుత్వంనుంచి ఆదేశాలు అందకపోవడం వల్లనే అధికార గణం ధాన్యం క్రయ విక్రయాలపై శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి తరువాత జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ఐకేపీ కేంద్రాల వద్ద క్రయ విక్రయాలకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పాన్‌గల్, వీపనగండ్ల తదితర మండలాల పరిధిలోని ఐకేపీ కేంద్రాలలో సుమారుగా 14 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయినట్లు అధికార వర్గాలు ప్రాధమికంగా అంచనా వేశాయి. ఈ తడిసిన ధాన్యంలో 9 వేల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఉన్నట్లు సమాచారం. మిగతా 5 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రం అమ్మకం కోసం ఐకేపీ కేంద్రాలకు తరలించిన రైతుల ధాన్యంగా తెలుస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐకేపీ వర్గాలు మాత్రం బుధవారం 16 వాహనాలను ద్వారా మహబూబ్‌నగర్‌లోని గోదాములకు చేర్చినట్లు సమాచారం. రైతుల ధాన్యాన్ని మాత్రం పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి వరి పంటను పండించి విక్రయం కోసం కొనుగోలు కేంద్రాలకు తరలించగా... అకాల వర్షం కారణంగా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్వయాన ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరతో కొనుగోలు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ....అధికారులు మాత్రం ఆచరణలో పెట్టడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడమేనని తెలుస్తోంది. రైతులకు న్యాయం జరిగే విధంగా ధాన్యం క్రయ విక్రయాల్లో పూర్తిస్థాయి తోడ్పాటును అందిస్తున్నామని పేర్కొంటున్న అధికారులు... ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే తూచ తప్పకుండా పాటిస్తామని పేర్కొంటున్నారు. రైతులు మాత్రం తడిసిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలు నిరాసక్తతను చూపిస్తున్నాయని వివరిస్తున్నారు. మార్కెట్లోకి తీసుకెళ్లే వ్యాపారులు కారు చౌకకు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకు అనుగుణంగా ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని రూ.1345 సాధారణ రకం ధాన్యానికి రూ.1310 ఉండగా వ్యాపారులు మాత్రం కారుచౌకగా రూ.700ల నుంచి రూ.900ల వరకే ఖరీదు చేయడానికి ముందుకు వస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిపోయిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. -
ధాన్యం.. దైన్యం
సాక్షి, ఏలూరు : ధాన్యం విరగ పండినప్పటికీ రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు. మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ధాన్యానికి ఇచ్చే కనీస మద్దతు ధరను ప్రభుత్వం ఏటా ఎంతోకొంత పెంచుతుంటుంది. ఈ ఏడాది ప్రభుత్వం లేకపోవడం.. కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదీరకపోవడంతో మద్దతు ధరపై నేటికీ ప్రకటన వెలువడలేదు. జిల్లాలో ఇప్పటికే దాదాపు సగానికి పైగా ధాన్యా న్ని మిల్లర్లకు తక్కువ ధరకే రైతులు విక్రరుుంచారు. ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నా కొనుగోళ్లు నామమాత్రంగానే ఉన్నారుు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మిల్లర్లు ధర తగ్గించేశారు. పట్టించుకునేదెవరు? ధరల విషయంలో దోపిడీకి గురవుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమైనా గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే అదీ లేదు. గత ఖరీఫ్‌లో ధాన్యానికి మద్దతు ధర రూ.60 పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించడంతో ఏ గ్రేడ్ ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,250 నుంచి రూ.1,310కి పెరిగింది. ఈసారి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. నిజానికి గిట్టుబాటు ధర ఎంతున్నా రైతుకి దక్కేది నామమాత్రమే. మద్దతు ధరను కనీసం రూ.2,200 పెంచితే మిల్లర్లు ధర పెంచుతారని రైతులు ఆశపడుతున్నారు. చేలల్లోనే ధాన్యం ఈ ఏడాది డెల్టా, సెమీ డెల్టాలో 3,78,190 ఎకరాలు, మెట్టలో 39,310 ఎకరాల్లో కలిపి మొత్తం 4,17,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వాస్తవానికి 17 శాతం తేమ గల ధాన్యాన్ని ఏ గ్రేడ్‌గా గుర్తించి క్వింటాల్‌కు రూ.1,345 చెల్లించాలి. అంతకు మించి తేమ ఉంటే బీ గ్రేడ్‌గా గుర్తించి రూ.1,310కు కొనుగోలు చేయాలి. ప్రభుత్వ ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,008 ధర రావాల్సి ఉండగా, దళారులు రూ.900 నుంచి రూ.920 మధ్య కొంటున్నారు. సాధారణ రకం ధాన్యానికి రూ.982 ధర వస్తుందనుకుంటే రూ.850 నుంచి రూ.880 మాత్రమే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రేడ్‌తో సంబంధం లేకుండా ఏ రకం ధాన్యాన్ని అయినా ఒకే ధరకు అడుగుతున్నారు. దీంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవడానికి మనసొప్పక చేలల్లోనే రాశులుగా పోసి నామమాత్రపు రక్షణ చర్యల మధ్య వదిలేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటివరకూ సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనగలిగారు. అలంకార ప్రాయంగా ఐకేపీ కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకే కొంటామని అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో విఫలమవుతూనే ఉన్నాయి. 2012 ఖరీఫ్‌లో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారు. అంచనా దిగుబడి 11.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, లక్షా 35 వేల హెక్టార్లలో వరి పంట నీలం తుపానుకు దెబ్బతింది. దీంతో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కోల్పోయారు. మిగిలిన ధాన్యాన్ని కొనడానికి జిల్లాలో 72 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేవలం 28 కేంద్రాల్లో 7,301మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 2013 రబీలో లక్షా 68 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ధాన్యం కొనుగోలుకు 76 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్పత్తి లక్ష్యం 11.99 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొన్నది కేవలం 108 మెట్రిక్ టన్నులే. 2013 ఖరీఫ్‌లో జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేశారు. వర్షాలకు 54 వేల 400 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గరిష్టంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ వర్షం దెబ్బకు ఆ దిగుబడి సగానికి పడిపోయింది. 80కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా కేవలం 250 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఈ ఏడాది రబీలో జిల్లాలోని 57 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ కేవలం 886 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొంటే మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. అది ఎగవేయడానికి, మిల్లర్లకు మేలు చేకూర్చడానికీ ప్రభుత్వమే ఈ విధంగా కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నారుు. -
ముంచిన వర్షం
వరంగల్, న్యూస్‌లైన్ : నోటికాడికొచ్చిన ధాన్యం నీటిపాలైంది. చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశారుు. వరుస వానలు వారిని నట్టేట ముంచారుు. అల్పపీడన ద్రోణితో జిల్లాలో శుక్రవారం కురిసిన అకాలవర్షంతో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి తోటలతో పాటు కూరగాయాల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులకు అమ్మకానికి రైతులు తెచ్చిన 25 వేల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కొత్తగూడ మండలంలో ఆకస్మికంగా వచ్చిన సుడిగాలికి రామన్నగూడెం, లడాయిగడ్డ, ముస్మి, ముస్మీతండా గ్రామాల్లో ఆస్తినష్టం జరిగింది. 43 రేకుల ఇళ్లు, పూరిళ్ల కప్పులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 11 వేల హెక్టార్ల పరిధి లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వ్యవసాయ శాఖ అధికారులు ఎన్నికల విధుల్లో భాగంగా శిక్షణలో ఉన్నందున పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయలేకపోయారు. చేలల్లోనే నేలరాలిన పంటలు చేతికొచ్చిన పంటలు చేలల్లోనే నాశనమయ్యాయి. 11 వేల హెక్టార్ల పరిధిలో వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్‌పర్తిలో నాలు గు వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతింది. పరకాల సెగ్మంట్లోని పరకాల, గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఉన్న గొర్రెకుంట, స్తంభంపల్లి, ధర్మారం, పోతరాజుపల్లి ప్రాంతాల్లో ఆకాల వర్షంతో వెరుు్య ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ములుగు నియోజకవర్గ పరిధిలోని గోవిందరావుపేట, వెంకటాపూర్, మం గపేట, కొత్తగూడ మండలాల్లో నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నర్సం పేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి మండలాల్లో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యూరుు. సుమారు 4,500 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. జనగామ నియోజకవర్గం లోని జనగామ, చేర్యాల, బచ్చన్నపేట ప్రాం తంలో 2,500 ఎకరాల్లో ధాన్యం కోతకు రాగా... మొదళ్లు తడిసి గింజలు రాలిపోయా యి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో 4,300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి, మరిపెడ, నర్సింహులపేటలో 800 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్‌గఢ్, ధర్మసాగర్, రఘునాథపల్లి, లింగాలఘన్‌పూర్‌లో 500 ఎకరాల విస్తీర్ణంలో పంట లు దెబ్బతిన్నాయి. రెండు వేల హెక్టార్లలో కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. టార్పాలిన్ లేక తల్లడిల్లిన రైతులు తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, చెన్నారావుపేట, దుగ్గొండి, బచ్చన్నపేట, జనగామ, మహబూబాబాద్, కురవి, కేసముద్రం, నెల్లికుదురు, నర్సింహులపేట, నల్లబెల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక 10వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. నర్సంపేట, జనగామ, పరకాల, వరంగల్, కేసముద్రం, మార్కెట్లలో 15వేల బస్తాల ధాన్యం, మిర్చి నీటిపాలైంది. పరకాల మార్కెట్లో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌రైస్ కోసం కొనుగోలు చేస్తామని జిల్లా ఐకేపీ మార్కెటింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ కరుణాకర్‌రావు తెలిపారు. -
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
కలెక్టరేట్, న్యూస్‌లైన్: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ మండలస్థాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి ఎంఆర్ఐలు, వీఆర్వోలతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేం దుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఏ మార్కెట్లోనైనా కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కువగా ఉంటే తడిచిపోకుం డా టార్పాలిన్లు కప్పాలని సూచించారు. ధాన్యా న్ని మిల్లులకు తరలించే క్రమంలో వాహనాల ఇబ్బంది ఏర్పడితే అద్దెకు తీసుకోవాలన్నారు. వాటి బిల్లులను సంబంధిత ఆర్డీఓలకు పంపించాలని వివరించారు. మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే డీఎస్ఓకు, ఏఎస్‌ఓకు ఫోన్‌చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, తరలింపులో ఎటువంటి సమస్యలున్నా శనివారంలోగా పరిష్కరించుకోవాలన్నారు. 11వ తేదీ వరకు ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తేవొద్దు అల్పపీడన ప్రభావం కారణంగా ఈ నెల 11వ తేదీ వరకు ఐకేపీ కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకురావద్దని జేసీ కోరారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కొనుగోళ్లు నిలుపుదల చేసినట్లు వివరించారు. ఈ విషయాన్ని అధికారులు, ఐకేపీ సిబ్బంది రైతులకు తెలియజేయాలని కోరారు. ఈ సెట్ కాన్ఫరెన్సులో పీడీ డీఆర్డీఏ సుధాకర్, డీఎం సివిల్ సప్లయిస్ వరప్రసాద్, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు ఉన్నారు. -
లక్ష్యానికి దూరం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఈ సారి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం చేరేట్టు లేదు. సన్నరకాలకు డిమాండ్ ఉండటం, రైతులు బయట విక్రయిస్తుండటంతో ఐకేపీ, ఐటీడీఏ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కంటే మార్కెట్లో అధిక రేటు వస్తుండటంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేపట్టే కొనుగోళ్లపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఈ ఖరీఫ్‌లో 1.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. దీంతో ఐకేపీ సంఘాలకు కమీషన్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు 37,763 మెట్రిక్ టన్నులే కొనుగోలు ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు జిల్లాలో 90 డీఆర్డీఏ, ఐటీడీఏ ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు చేపట్టారు. అక్టోబర్ 25 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అధికారులు ప్రభుత్వ మద్దతు ధరపై కొనుగోళ్లు చేపట్టారు. ఎంఎస్పీ ప్రకారం కామన్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1310, గ్రేడ్-ఎ రకం ధాన్యానికి రూ.1345 చెల్లించి కొనుగోలు చేశారు. అయితే 2013-14 యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లాలో 52,016 హెక్టార్లలో వరి సాగవుతుందని భావించారు. నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లకు చెందిన 42 మండలాల్లో 46,228 హెక్టార్లలో వరి వేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ మేరకు 2.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని భావించారు. ఆశించిన మేరకు దిగుబడి రాకపోయినా.. దిగుబడిలో 25 శాతం అవసరాలు, ఇతర కారణాలతో విక్రయించే అవకాశం లేనందున, 1.61 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయవచ్చని అంచనా వేశారు. ఈ మేరకు 90 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సోమవారం నాటికి 11,064 మంది రైతుల నుంచి రూ.50.46 కోట్లు చెల్లించి 37,763 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. దీంతో ఈ ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోలు లక్ష్యం చేరడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐకేపీ సంఘాలకు తగ్గనున్న కమీషన్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు వేసిన అంచనాల మేరకు దిగుబడి వచ్చినా.. సన్నరకాలకు బయట మార్కెట్లో అధిక ధర పలుకుతుండటంతో రైతులు మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్దేశించిన లక్ష్యం చేరడం కష్టంగా కనిపిస్తోంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు క్వింటాల్‌కు రూ.1,345 మించకపోగా.. బయట మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1500 నుంచి రూ.1800 పలుకుతోంది. దీంతో రైతులు వ్యాపారులు, రైసుమిల్లర్లకు ధాన్యం విక్రయిస్తున్నారు. ఇదిలా వుండగా డీఆర్డీఏ, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోళ్లు సవ్యంగా సాగితే ఐకేపీ సంఘాలకు రూ.3.36 కోట్ల కమీషన్ వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా వేశారు. మహిళ సంఘాలకు గతంలో ధాన్యం కొనుగోలుపై రూ.100కు రూ.1.50 చెల్లించిన ప్రభుత్వం గతేడాది నుంచి రూ.2.50కు పెంచింది. గత ఖరీఫ్‌లో 66,385 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన స్వయం సహాయక సంఘాలు రూ.2.10 కోట్ల కమీషన్ పొందాయి. గత రబీ సీజన్లో 30,510 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.97 లక్షల కమీషన్ తీసుకున్నారు. ఈ సారి స్వయం సహాయక సంఘాల ద్వారా కనీసం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినా రూ.3.36 కోట్ల మేరకు కమీషన్ పొందే అవకాశం ఉంది. కొనుగోళ్లు గణనీయంగా తగ్గనుండగా కమీషన్ కూడా తగ్గవచ్చని అధికారులు చెప్తున్నారు.