సాక్షి, ఏలూరు : ధాన్యం విరగ పండినప్పటికీ రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు. మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ధాన్యానికి ఇచ్చే కనీస మద్దతు ధరను ప్రభుత్వం ఏటా ఎంతోకొంత పెంచుతుంటుంది. ఈ ఏడాది ప్రభుత్వం లేకపోవడం.. కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదీరకపోవడంతో మద్దతు ధరపై నేటికీ ప్రకటన వెలువడలేదు. జిల్లాలో ఇప్పటికే దాదాపు సగానికి పైగా ధాన్యా న్ని మిల్లర్లకు తక్కువ ధరకే రైతులు విక్రరుుంచారు. ధాన్యం కొనుగోలుకు ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నా కొనుగోళ్లు నామమాత్రంగానే ఉన్నారుు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మిల్లర్లు ధర తగ్గించేశారు.
పట్టించుకునేదెవరు?
ధరల విషయంలో దోపిడీకి గురవుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమైనా గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే అదీ లేదు. గత ఖరీఫ్‌లో ధాన్యానికి మద్దతు ధర రూ.60 పెంచాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించడంతో ఏ గ్రేడ్ ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,250 నుంచి రూ.1,310కి పెరిగింది. ఈసారి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. నిజానికి గిట్టుబాటు ధర ఎంతున్నా రైతుకి దక్కేది నామమాత్రమే. మద్దతు ధరను కనీసం రూ.2,200 పెంచితే మిల్లర్లు ధర పెంచుతారని రైతులు ఆశపడుతున్నారు.
చేలల్లోనే ధాన్యం
ఈ ఏడాది డెల్టా, సెమీ డెల్టాలో 3,78,190 ఎకరాలు, మెట్టలో 39,310 ఎకరాల్లో కలిపి మొత్తం 4,17,500 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. వాస్తవానికి 17 శాతం తేమ గల ధాన్యాన్ని ఏ గ్రేడ్‌గా గుర్తించి క్వింటాల్‌కు రూ.1,345 చెల్లించాలి. అంతకు మించి తేమ ఉంటే బీ గ్రేడ్‌గా గుర్తించి రూ.1,310కు కొనుగోలు చేయాలి. ప్రభుత్వ ధర ప్రకారం ఏ గ్రేడ్ ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,008 ధర రావాల్సి ఉండగా, దళారులు రూ.900 నుంచి రూ.920 మధ్య కొంటున్నారు. సాధారణ రకం ధాన్యానికి రూ.982 ధర వస్తుందనుకుంటే రూ.850 నుంచి రూ.880 మాత్రమే ఇస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో గ్రేడ్‌తో సంబంధం లేకుండా ఏ రకం ధాన్యాన్ని అయినా ఒకే ధరకు అడుగుతున్నారు. దీంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవడానికి మనసొప్పక చేలల్లోనే రాశులుగా పోసి నామమాత్రపు రక్షణ చర్యల మధ్య వదిలేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటివరకూ సుమారు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు కొనగలిగారు.
అలంకార ప్రాయంగా ఐకేపీ కేంద్రాలు
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకే కొంటామని అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో విఫలమవుతూనే ఉన్నాయి. 2012 ఖరీఫ్‌లో 2.43 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారు. అంచనా దిగుబడి 11.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, లక్షా 35 వేల హెక్టార్లలో వరి పంట నీలం తుపానుకు దెబ్బతింది. దీంతో దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కోల్పోయారు.
మిగిలిన ధాన్యాన్ని కొనడానికి జిల్లాలో 72 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేవలం 28 కేంద్రాల్లో 7,301మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 2013 రబీలో లక్షా 68 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ధాన్యం కొనుగోలుకు 76 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉత్పత్తి లక్ష్యం 11.99 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొన్నది కేవలం 108 మెట్రిక్ టన్నులే. 2013 ఖరీఫ్‌లో జిల్లాలో 2.43 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేశారు. వర్షాలకు 54 వేల 400 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.
గరిష్టంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ వర్షం దెబ్బకు ఆ దిగుబడి సగానికి పడిపోయింది. 80కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేసినా కేవలం 250 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. ఈ ఏడాది రబీలో జిల్లాలోని 57 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ కేవలం 886 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వం ధాన్యం కొంటే మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. అది ఎగవేయడానికి, మిల్లర్లకు మేలు చేకూర్చడానికీ ప్రభుత్వమే ఈ విధంగా కొనుగోలు కేంద్రాలను నిర్వీర్యం చేస్తోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నారుు.
ధాన్యం.. దైన్యం
Published Fri, May 23 2014 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement
Advertisement