న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆదాయం, వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుందని అసోచామ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో 14 ఖరీఫ్ పంటలకు 50 శాతం మేర మద్దతు ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత వారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచగా, ఒక్క దీనివల్లే ప్రభుత్వ ఖజానాపై రూ.15,000 కోట్ల భారం పడుతుంది.
అయితే, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనపు ఆదాయం అందేలా చూస్తామని బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ దిశగా ఈ నిర్ణయం ఉండడం గమనార్హం. ‘‘రైతుల సమస్యల నివారణకు మద్దతు ధరల పెంపు కచ్చితమైన లేదా సరైన పరిష్కారం కాదు. కానీ, దీర్ఘకాలిక సంస్కరణలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతకాలం పాటు రైతులను కష్టాల్లో ఉండనీయకూడదు. మొత్తం వినియోగంలో గ్రామీణ ప్రాంతం 70% వాటా కలిగి ఉంది.
గ్రామీణులకు తగినంత కొనుగోలు శక్తి రానంత వరకు భారత పరిశ్రమలకు డిమాండ్ పుంజుకోదు’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనను ధాన్యం, కూరగాయల మార్కెట్లలో యంత్రాంగాన్ని మెరుగుపరచడం ద్వారా పరిష్కరించొచ్చని రావత్ సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెంపునకు కారణమయ్యే మార్కెట్ దళారులకు కళ్లెం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించగలవన్నారు.
ద్రవ్యోల్బణం, జీడీపీపై ప్రభావం: డీబీఎస్
న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపు వల్ల జీడీపీపై 0.1– 0.2% వరకు ప్రభావం పడుతుందని, దీనికి తోడు ద్రవ్యోల్బణంపైనా దీని ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్ ఓ నివేదిక విడుదల చేసింది. ద్రవ్య పరమైన వ్యయాల పెరుగుదలకు దారితీస్తుందని అభిప్రాయపడింది. జీడీపీపై ప్రభావం నేపథ్యంలో అధిక ఆదాయ మద్దతు అవసరమని లేదా మూలధన వ్యయాలను తగ్గించుకుంటేనే 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యాలపై ప్రభావం పడకుండా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆహార సబ్సిడీ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1.70 లక్షల కోట్లు కేటాయించగా, మద్దతు ధరల పెంపు వల్ల సబ్సిడీ బిల్లు రూ.2లక్షల కోట్లు దాటిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మద్దతు ధరల పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్న కాలంలో ద్రవ్యోల్బణంపై 25–30 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉంటుందని డీబీఎస్ నివేదిక తెలియజేసింది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్‌బీఐ మరో విడత రేట్లను పెంచొచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment