ఒక్క రోజులోనే ధాన్యం రైతుల ఖాతాల్లో రూ.815 కోట్లు జమ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
ఖరీఫ్‌లో రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
ఇప్పటివరకు రూ.6,514.59 కోట్లు చెల్లింపు పూర్తి
మిగిలిన స్వల్ప మొత్తానికి డీఎం అప్రూవల్స్ రాగానే చెల్లించేలా షెడ్యూల్
రాష్ట్ర చరిత్రలోనే సంపూర్ణ మద్దతు ధర అందించిన ప్రభుత్వంగా రికార్డు
ఒక్క రూపాయి బకాయి లేకుండా రైతులకు చెల్లించడంలో సక్సెస్
ఈ ఐదేళ్లలో రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు
చంద్రబాబు హయాంలో 17.94 లక్షల మంది రైతుల నుంచే ధాన్యం సేకరణ
వైఎస్ జగన్ పాలనలో ఏకంగా 37.68 లక్షల మందికి మద్దతు ధర
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్‌లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది.
సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది.
ఖరీఫ్ సీజన్‌లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది.
పెరిగిన ధాన్యం సేకరణ..
గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది.
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది.
తడిచిన ధాన్యమూ కొనుగోలు..
అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్‌లైన్‌లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్‌ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది.
బాబు హయాంలో బకాయిలు..
చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు.
ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు.
అదనంగా టన్నుకు రూ.2,523
గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది.
దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్‌పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు.
Comments
Please login to add a commentAdd a comment