‘మద్దతివ్వండి’ ... మహాప్రభో | give support price to farmers | Sakshi
Sakshi News home page

‘మద్దతివ్వండి’ ... మహాప్రభో

Published Thu, Jun 5 2014 3:22 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

‘మద్దతివ్వండి’ ... మహాప్రభో - Sakshi

‘మద్దతివ్వండి’ ... మహాప్రభో

 సాక్షి, మహబూబ్‌నగర్: అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు చేస్తున్న డిమాండ్‌ను  అధికారులు పెడచెవిన పెడుతున్నారు.  కొనుగోలుకు  ప్రభుత్వంనుంచి ఆదేశాలు  అందకపోవడం వల్లనే అధికార గణం ధాన్యం క్రయ విక్రయాలపై  శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి తరువాత జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ఐకేపీ కేంద్రాల వద్ద క్రయ విక్రయాలకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.
 
 పాన్‌గల్, వీపనగండ్ల తదితర మండలాల పరిధిలోని ఐకేపీ కేంద్రాలలో సుమారుగా 14 వేల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయినట్లు  అధికార వర్గాలు ప్రాధమికంగా అంచనా వేశాయి. ఈ తడిసిన ధాన్యంలో 9 వేల క్వింటాళ్ల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఉన్నట్లు సమాచారం. మిగతా 5 వేల క్వింటాళ్ల ధాన్యం మాత్రం అమ్మకం కోసం ఐకేపీ కేంద్రాలకు తరలించిన రైతుల ధాన్యంగా తెలుస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐకేపీ వర్గాలు మాత్రం బుధవారం 16 వాహనాలను ద్వారా మహబూబ్‌నగర్‌లోని  గోదాములకు చేర్చినట్లు సమాచారం.

రైతుల ధాన్యాన్ని మాత్రం  పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి వరి పంటను పండించి విక్రయం కోసం కొనుగోలు కేంద్రాలకు తరలించగా... అకాల వర్షం కారణంగా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్వయాన ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్  తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరతో కొనుగోలు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ....అధికారులు మాత్రం ఆచరణలో పెట్టడం లేదు.
 
 దీనికి ప్రధాన కారణం  ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడమేనని తెలుస్తోంది. రైతులకు న్యాయం జరిగే విధంగా ధాన్యం క్రయ విక్రయాల్లో పూర్తిస్థాయి తోడ్పాటును అందిస్తున్నామని పేర్కొంటున్న అధికారులు... ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే తూచ తప్పకుండా పాటిస్తామని పేర్కొంటున్నారు. రైతులు మాత్రం తడిసిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలు నిరాసక్తతను చూపిస్తున్నాయని వివరిస్తున్నారు. మార్కెట్లోకి తీసుకెళ్లే వ్యాపారులు కారు చౌకకు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకు అనుగుణంగా ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని రూ.1345 సాధారణ రకం ధాన్యానికి రూ.1310 ఉండగా వ్యాపారులు మాత్రం కారుచౌకగా రూ.700ల నుంచి రూ.900ల వరకే ఖరీదు చేయడానికి ముందుకు వస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిపోయిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసే విధంగా సత్వర చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement