టోకెన్ ఉండాల్సిందే | token system for farmers | Sakshi
Sakshi News home page

టోకెన్ ఉండాల్సిందే

Published Sat, Sep 13 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

టోకెన్ ఉండాల్సిందే

టోకెన్ ఉండాల్సిందే

నీలగిరి: ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న గ్రామ సంఘాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల్లోని రైతుల వివరాలు, సాగువిస్తీర్ణం, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే అక్టోబర్ మూడోవారంలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
 
అప్పటిలోగా రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించే ఐకేపీ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అహర్నిశలు శ్రమించి ధాన్యం కొనుగోలు చేస్తున్న సంఘాలపై రాజకీయ, అధికార ఒత్తిళ్లు తీవ్రమైన నేపథ్యంలో జిల్లాయంత్రాగం ‘టోకెన్’ విధానానికి తెరతీసింది. ప్రధానంగా రబీసీజన్‌లో అకాలవర్షాలు, గాలిదుమారాల కారణంగా ఐకేపీ కేంద్రాలు తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. కొనుగోలు సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాజకీయపార్టీలు రైతులపక్షాన ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది.
 
ఐకేపీ కేంద్రాల నెత్తిన భారం

అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండండంతో మరో గత్యంతరం లేక ఐకేపీ సంఘాలు పలు సందర్భాల్లో తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదీగాక గ్రామాల్లో రైతుల నుంచి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మళ్లీ రైతుల పేర్లతో ఐకేపీ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. పంటదిగుబడి అధికంగా వచ్చినప్పుడు కూడా కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తోంది. ఈవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం సంఘాల వద్ద లేదు. దీంతో భారీఎత్తున కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు రవాణా చేయడం కూడా సమస్యగా మారింది.
 
దీనిని అదనుగా భావిస్తున్న  మిల్లర్లు సైతం ధాన్యంలో క్వింటాళ్ల కొద్ది కోత పెడుతున్నారు. ఈ నష్టాన్ని ఐకేపీ  కేంద్రాలు భరించాల్సి వస్తోంది. వారికి చెల్లించే ధాన్యం కమీషన్‌లో ఆ నష్టాన్ని తగ్గించి చెల్లిస్తున్నారు. దీంతో గత రబీ సీజన్‌లో దాదాపు రూ. 2 కోట్ల నష్టం వాటిల్లింది. ఐకేపీ కేంద్రాలు  తరలించిన ధాన్యానికి మిల్లర్లు ఇచ్చిన రశీదులకు మధ్య రూ.2కోట్లు విలువ చేసే ధాన్యం తేడా వచ్చింది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలకు విరుగుడుగా అధికారులు ఖరీఫ్ సీజన్ నుంచి టోకెన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు.
 
 టోకెన్ విధానంతో తీరనున్న కష్టాలు..
* ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో రైతులు తమ పేర్లను కేంద్రాల వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి.
* రిజిస్టర్ చేయించుకున్న రైతులకు ఏ రోజున కేంద్రానికి ధాన్యం తీసుకురావాలో తెలియజేస్తూ ఓ టోకెన్ ఇస్తారు.
* రిజిస్టర్ చేయించుకున్న రైతులు బ్యాంకు ఖాతాలు తప్పని సరిగా కలిగిఉండాలి.
* తద్వారా ధాన్యం పైకాన్ని రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.
* రిజిస్టర్ చే యించుకునే రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకాలు, లేదా భూములకు సంబంధించిన ఆధారాలు కేంద్రాలకు సమర్పించాలి.
* టోకెన్ విధానం వల్ల ఐకేపీ కేంద్రాలకు ఒకేసారి ధాన్యం తీసుకురావడం తగ్గుతుంది. ప్రైవేటు వ్యాపారుల జిమ్మిక్కులను కూడా కట్టడి చేయొచ్చు.
* ఈ విధానం వల్ల ఐకేపీ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉండదు. ఎప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే వీలుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement