district rural development agency
-
అన్నీ లోపాలు!
- జిల్లాలో మూతపడుతున్న పాలశీతలీకరణ కేంద్రాలు - మరికొన్ని ఇతర ప్రాంతాలకు తరలింపు - పర్యవేక్షణ.. నిర్వహణ లోపమే ప్రధాన కారణం - నాడు ప్రారంభించింది 21.. నేడు మిగిలింది 8 - నిర్వహణపై విజిలెన్స్ ఆరా? కడప రూరల్ : జిల్లాలో మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) నిర్వహణలో పాలశీతలీకరణ కేంద్రాలు(బీఎంసీ) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి నిర్వహణ, పాల సేకరణలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలసేకరణ వెల్లువలా సాగిన కేంద్రాలతోపాటు మరికొన్ని మూతపడగా, ఇంకొన్ని అర్ధంతరంగా నిలిచిపోయాయి. కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రైల్వేకోడూరు, జమ్మలమడుగు, కొండాపురం, చక్రాయపేట, బద్వేలు, పోరుమామిళ్ల, కమలాపురం, రామాపురం, సుండుపల్లె, కాశినాయన, ఒంటిమిట్ట, చిట్వేలి, బి.మఠం, లింగాల, తొండూరు, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడులో మొత్తం 21 బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ బీఎంసీలు ఏపీ డెయిరీ సాంకేతిక సహకారంతో మహిళా సమాఖ్య సభ్యుల నిర్వహణలో సాగాయి. అందుకోసం మహిళా సభ్యులకు కమీషన్ వచ్చేది. మార్పులు, చేర్పులు 2010 నుంచి బీఎంసీలలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. జమ్మలమడుగు బీఎంసీని బద్వేలుకు తరలించారు. చిట్వేలిలో ఉన్న దానిని పెనగలూరులో పెట్టారు. బి.మఠం బీఎంసీని మదనపల్లెకు మార్చారు. అలాగే వేములలో ఉన్న బీఎంసీని అనంతపురం జిల్లా తిమ్మనపల్లె మండలం సింగవరంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నిర్వహించిన ట్రయల్ రన్లో మిల్క్ ట్యాంకర్ పనిచేయకపోవడంతో తిరిగి ఆ యూనిట్‌ను పులివెందులలో భద్రపరిచినట్లు చెబుతున్నారు. అలాగే ఏపీ డెయిరీకి ఒక బీఎంసీ మంజూరు కాగా, దాన్ని అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని బీఎంసీలను ప్రజల భాగస్వామ్యంతో పెనగలూరు, పోరుమామిళ్ల, మైదుకూరులలో ఏర్పాటు చేయగా, అవి నేటికీ ప్రారంభం కాలేదు. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అభివృద్ధిలో భాగంగా అక్కడున్న బీఎంసీని అధికారులు ఎత్తివేశారు. ఈ యూనిట్‌ను రాజంపేటలో భద్రపరిచారు. ఒంటిమిట్టలో పాల సేకరణ బాగా ఉంది. అయితే, ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించాలనే సంకల్పం ఎవరికీ లేకపోవడం దారుణం. ఇలా పలు కారణాలతో బీఎంసీలపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. దీంతో 2008లో విజయపథంలో నడిచిన 21 కేంద్రాలు నేడు బద్వేలు, కమలాపురం, తొండూరు, లింగాల, సుండుపల్లె, చక్రాయపేట, రైల్వేకోడూరు, కొండాపురంలో మొత్తం ఎనిమిది కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎన్నో కారణాలు కడపలో నిర్మించే మహిళా డెయిరీకి పాలు సరఫరా చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ మహిళా డెయిరీ పూర్తి అయ్యేంత వరకు బీఎంసీల ద్వారా వచ్చే పాలను ఏపీ డెయిరీకి తరలించాలనే నిబంధన ఉంది. ఆ మేరకు పాలు ప్రస్తుతం ఏపీ డెయిరీకి తరలుతున్నాయి. కాగా, ఒక్కో యూనిట్‌కు రూ.12 లక్షల విలువైన పరికరాలతో ఏర్పాటు చేశారు. అయితే ఈ మిషనరీల సంరక్షణ విషయంలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక ఐకేపీ సిబ్బంది, మరికొందరు కలిసి పరిక రాలను ఇతర ప్రాంతాలకు తరలించడం తదితర అక్రమాలకు పాల్పడటంతో బీఎంసీల పరిస్థితి అధ్వానంగా తయారైందనే విమర్శలున్నాయి. దీనికితోడు ఏపీ డెయిరీ నిర్వాకం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఇటీవల విజిలెన్స్ అధికారులు ఇందుకు సంబంధించిన పలు ఫైళ్లను సేకరించి బీఎంసీల నిర్వహణ, అక్రమాలు, లోపాలు తదితర విషయాలపై ఆరా తీస్తున్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. నాటి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం, నిరుపేద మహిళల కోసం ఏర్పాటు చేసిన బీఎంసీల లో‘పాల’ను సరిదిద్ది సక్రమమైన బాటలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2008లో కడప సమీపంలో రూ. 7 కోట్ల వ్యయంతో మహిళా డెయిరీని నిర్మించాలని నాటి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా డెయిరీకి పాల సేకరణ -
కొలువు కావాలా?
మీ అర్హతలకు తగిన ఉద్యోగం రావడం లేదని బాధపడుతున్నారా? జాబ్‌మేళాకు రౌండ్లేసి విసిగిపోయారా? డోన్ట్‌వర్రీ! ఇక ఆ బాధ అక్కర్లేదు. మీకున్న అర్హతలకు అనుగుణంగా మీకు నచ్చిన కొలువు చేసే అవకాశం కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) సిద్ధమైంది. అందుకోసం అధికారులే మీ ఇంటికి వచ్చి మీ వివరాలను సేకరించేందుకు సమాయత్తమయ్యారు. ఆ తరువాత మీ అర్హతలు, అభీష్టానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి నచ్చిన ఉద్యోగంలో చేరేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ జాబ్‌మేళా పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. వంద ఉద్యోగాలుంటే... అందులో సగం మందే దరఖాస్తు చేసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తరువాత వారిలో 20 శాతానికి మించి ఉద్యోగాల్లో చేరడం లేదు. అందుకే నిరుద్యోగులకు ఆసక్తి ఉన్న ఉద్యోగాలను తెలుసుకుని వారి అర్హతల మేరకు కొలువు ఇప్పించాలని గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఏప్రిల్‌లో ఇంటింటికీ సర్వే చేసి నిరుద్యోగుల వివరాలు తెలుసుకుంటాం.ఆ తరువాత గ్రామానికి ఐదుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. - జె.అరుణశ్రీ, డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మార్కెట్లో విస్తృ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ సరైన కొలువు దొరకడం లేదని నిరాశతో ఉన్న నిరుద్యోగులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి సంస్థ బృహత్తర ప్రణాళికను రూపొందించిం ది. అందులో భాగంగా ఏప్రిల్ ఒకటి నుంచి 10 వరకు జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి నిరుద్యోగల వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఆ వివరాలను క్రోడీకరించి ఒక్కో గ్రామంలో ఐదుగురి చొప్పున నిరుద్యోగులను ఎంపిక చేస్తారు. వారందరినీ సమీకరించి అవగాహన పేరిట మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో పాల్గొనే నిరుద్యోగులతో విడివిడిగా సమావేశమవుతారు. ఆయా నిరుద్యోగుల విద్యార్హతలను అడిగి తెలుసుకుంటారు. అర్హతలకు అనుగుణంగా ఏయే ఉద్యోగాలు చేసే అవకాశముందో చెబుతారు. వాటిలో ఎలాంటి ఉద్యోగం కావాలో సదరు నిరుద్యోగి అభీష్టానికే వదిలేస్తారు. మూడు రోజులు అవగాహన కార్యక్రమం పూర్తయిన తరువాత ఎవరెవరు? ఏయే ఉద్యోగాలు చేసేందుకు సుముఖంగా ఉన్నారో జాబితాను రూపొందిస్తారు. అనంతరం వారి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని నేర్పించేందుకు 45 రోజుల నుంచి 90 రోజుల వ్యవధి కలిగిన శిక్షణనిస్తారు. జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్) ప్రతినిధులు, మార్కెటింగ్ ప్రముఖులతో శిక్షణ ఇప్పిస్తారు. శిక్షణా కాలంలో అవసరమైన హాస్టల్ వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. అందుకోసం ఒక్కో అభ్యర్ధికి రోజుకు సగటున 120 చొప్పున నెలకు రూ.3,600 ఖర్చు చేస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పిస్తారు. ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులు వివాహం చేసుకున్న తరువాత ఆర్థిక ఇబ్బందుల్లేకుండా ఉండేలా జీతభత్యాలు కల్పించేలా చర్యలు తీసుకునే దిశగా ప్రణాళికను రూపొందిస్తున్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ ‘వారధి’ పేరిట అటు ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేటు సంస్థలకు, ఇటు నిరుద్యోగులకు అనుసంధానంగా ప్రత్యేక ఏజెన్సీని నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నిరుద్యోగుల జాబితాను సేకరించి, వారికి అవసరమైన నైపుణ్యాన్ని సమకూర్చేందుకు డీఆర్డీఏ సిద్ధమవడంతో నిరుద్యోగులకు త్వరలోనే కోరుకున్న కొలువు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
టోకెన్ ఉండాల్సిందే
నీలగిరి: ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న గ్రామ సంఘాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల్లోని రైతుల వివరాలు, సాగువిస్తీర్ణం, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే అక్టోబర్ మూడోవారంలో ఖరీఫ్ ధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటిలోగా రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించే ఐకేపీ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని అన్నివైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అహర్నిశలు శ్రమించి ధాన్యం కొనుగోలు చేస్తున్న సంఘాలపై రాజకీయ, అధికార ఒత్తిళ్లు తీవ్రమైన నేపథ్యంలో జిల్లాయంత్రాగం ‘టోకెన్’ విధానానికి తెరతీసింది. ప్రధానంగా రబీసీజన్‌లో అకాలవర్షాలు, గాలిదుమారాల కారణంగా ఐకేపీ కేంద్రాలు తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. కొనుగోలు సమయాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాజకీయపార్టీలు రైతులపక్షాన ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది. ఐకేపీ కేంద్రాల నెత్తిన భారం అన్నివైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండండంతో మరో గత్యంతరం లేక ఐకేపీ సంఘాలు పలు సందర్భాల్లో తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సి వస్తోంది. అదీగాక గ్రామాల్లో రైతుల నుంచి ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా మళ్లీ రైతుల పేర్లతో ఐకేపీ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. పంటదిగుబడి అధికంగా వచ్చినప్పుడు కూడా కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తోంది. ఈవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం సంఘాల వద్ద లేదు. దీంతో భారీఎత్తున కొన్న ధాన్యాన్ని మిల్లర్లకు రవాణా చేయడం కూడా సమస్యగా మారింది. దీనిని అదనుగా భావిస్తున్న మిల్లర్లు సైతం ధాన్యంలో క్వింటాళ్ల కొద్ది కోత పెడుతున్నారు. ఈ నష్టాన్ని ఐకేపీ కేంద్రాలు భరించాల్సి వస్తోంది. వారికి చెల్లించే ధాన్యం కమీషన్లో ఆ నష్టాన్ని తగ్గించి చెల్లిస్తున్నారు. దీంతో గత రబీ సీజన్లో దాదాపు రూ. 2 కోట్ల నష్టం వాటిల్లింది. ఐకేపీ కేంద్రాలు తరలించిన ధాన్యానికి మిల్లర్లు ఇచ్చిన రశీదులకు మధ్య రూ.2కోట్లు విలువ చేసే ధాన్యం తేడా వచ్చింది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలకు విరుగుడుగా అధికారులు ఖరీఫ్ సీజన్ నుంచి టోకెన్ విధానాన్ని అమలు చేయబోతున్నారు. టోకెన్ విధానంతో తీరనున్న కష్టాలు.. * ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో రైతులు తమ పేర్లను కేంద్రాల వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. * రిజిస్టర్ చేయించుకున్న రైతులకు ఏ రోజున కేంద్రానికి ధాన్యం తీసుకురావాలో తెలియజేస్తూ ఓ టోకెన్ ఇస్తారు. * రిజిస్టర్ చేయించుకున్న రైతులు బ్యాంకు ఖాతాలు తప్పని సరిగా కలిగిఉండాలి. * తద్వారా ధాన్యం పైకాన్ని రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు. * రిజిస్టర్ చే యించుకునే రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకాలు, లేదా భూములకు సంబంధించిన ఆధారాలు కేంద్రాలకు సమర్పించాలి. * టోకెన్ విధానం వల్ల ఐకేపీ కేంద్రాలకు ఒకేసారి ధాన్యం తీసుకురావడం తగ్గుతుంది. ప్రైవేటు వ్యాపారుల జిమ్మిక్కులను కూడా కట్టడి చేయొచ్చు. * ఈ విధానం వల్ల ఐకేపీ కేంద్రాల వద్ద భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉండదు. ఎప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే వీలుంటుంది. -
అడిగేవారేరి?
అవినీతికి కేరాఫ్ ‘డీఆర్డీఏ’ వెలుగుచూసిన పలు కుంభకోణాలు 85 శాతం మంది ఉద్యోగులు ఏళ్లతరబడి ఒకే చోట విధులు పట్టించుకోని అధికారగణం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అక్రమాలకు అడ్డాగా మారింది. అడిగేవారే లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇటీవల ఆ శాఖలో పలు కుంభకోణాలు తెరపైకి వచ్చాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 39 మంది విద్యార్థుల స్కాలర్ షిప్‌లకు సంబంధించి రూ.28,600 సంఘ బంధం అధ్యక్షురాలు దుర్వినియోగం చేశారు. ఉదయగిరిలో ఆర్ఐడీఎఫ్కు సంబంధించి రూ.3.20 లక్షల నిధులను సంఘంబంధం అధ్యక్షురాలు, సిబ్బంది స్వాహా చేశారు. సీతారామపురంలో శ్రీనిధికి సంబంధించి దాదాపు రూ.2.8కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. భారీ స్థాయిలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నప్పటికీ వారిపై చర్యలు మాత్రం శూన్యం. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నార్థకంగా పలు పథకాలు డీఆర్డీఏ ద్వారా అమలవుతున్న పలు పథకాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ సంస్థలో మొత్తం 18 విభాగాలున్నాయి. వీటిలో బ్యాంక్ లింకేజ్ రుణాలు, శ్రీనిధి, ఎన్‌పీఎం (పురుగు మందురహిత వ్యవసాయం), హెల్త్ అండ్ న్యూట్రిషన్, బాలబడులు, యానాది అభివృద్ధి ప్రణాళిక (వైడీపీ), నిరుపేదల వ్యూహం (పీఓపీ), జెండర్, కృషి, జాబ్స్, ఇన్సూరెన్స్, భూమి, అభయహస్తం, మార్కెటింగ్, డెయిరీ, ఐవీ, ఫైనాన్స్, వికలాంగుల సంక్షేమం (పీడబ్ల్యూడీ) వంటివి ఉన్నాయి. అయితే ఈ విభాగాల్లో బ్యాంక్‌లింకేజీ రుణాలను, శ్రీనిధి, అభయహస్తం, జాబ్స్, భూమి వంటి పథకాలు మినహాయిస్తే మిగిలనవన్నీ కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తింది. ఆయా పథకాలపై క్షేత్రస్థాయిలో గ్రామీణులకు అవగాహన కల్పించకపోవడంతో లబ్ధిదారులకు ఉపయోగం లేకుండా పోతోంది. ఇక అధికారుల పర్యవేక్షణ అంతంతమాత్రమే ఉండటం గమనార్హం. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న ఉద్యోగులు వీరే జిల్లా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ (డీపీఎంయూ)తో పాటు మండలాల్లో పనిచేసే ఏపీఎంలు దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్నారు. డీపీఎంయూలో జాబ్స్, హెచ్ఆర్, పీఓపీ, వైడీపీ, శ్రీనిధి విభాగాలకు చెందిన సబ్జెక్ట్ యాంకర్స్‌తో పాటు రాపూరు, వింజమూరు, ఇందుకూరుపేట, చిల్లకూరు, గూ డూరు, సూళ్లూరుపేట, ఓజిలి, కొండాపురం, బో గోలు, కొడవలూరు, దగదర్తి, ఆత్మకూరు, మర్రి పాడు, అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాళెం, దొరవారిసత్రం, కోట, కోవూరు, మనుబోలు, ముత్తుకూ రు, నాయుడుపేట, నెల్లూరు, సంగం, సీతారామపురం, తడ, తోటపల్లిగూడూరు, వెంకటాచలం, వెంకటగిరి, వరికుంటపాడు మండలాలకు చెం దిన ఏపీఎంలు ఉన్నారు. ఏళ్ల తరబడి ఒకే చోట విధులు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో 85 శాతం మంది ఏపీఎంలు నాలుగేళ్ల నుంచి ఏడేళ్లకుపైగా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంత మంది అధికారులు మారినా వీరి కుర్చీకి మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. జిల్లాలోని ఈ శాఖ ఉద్యోగుల బదిలీకి 2012లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈప్రక్రియ ద్వారా ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంది. కాని ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కౌన్సెలింగ్‌లో ఎక్కువ మార్కు లు వచ్చిన వారికి అవకాశాలు కల్పించాలి. కానీ ఈ ప్రక్రియ సక్రమంగా నిర్వహించలేదని అప్పట్లో పలు విమర్శలు వెల్లువెత్తాయి. సొంత మండలా ల్లో విధులు నిర్వర్తించకూడదన్న నిబంధన ఉంది. కాని నిబంధనలకు విరుద్ధంగా ఆయా స్థానాల్లో స్థిరపడి తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. -
కోడ్ పరిధిలోకి డ్వాక్రా మహిళలు
సాక్షి, సంగారెడ్డి: డ్వాక్రా సంఘాలు పల్లెపల్లెకు విస్తరించాయి. స్వయం ఆలంబనతో తోటి మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్నీ రాజకీయ పక్షాలు స్వయం సహాయక సంఘాలను ప్రసన్నం చేసుకోడానికి శతవిధాలుగా ప్రయత్నించడం ఇప్పటి వరకు అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో సైతం అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఎస్‌హెచ్‌జీల సేవలను వినియోగించుకుంది. మండల, గ్రామ సమైక్యల ద్వారా మహిళలకు డబ్బులు, చీరలు పంచిన సంఘటనలు పరిపాటిగా మారాయి. అయితే, ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో మాత్రం ఎస్‌హెచ్‌జీలను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకోడానికి ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. జిల్లా సమైక్య, మండల, గ్రామైక్య సంఘాల ఖాతాలపై ఇప్పటికే నిఘా వేశారు. డీఆర్డీఏ, సెర్ప్ ఖాతాలు నుంచి కాక మరే ఇతర ఖాతాల నుంచి డబ్బులు బదిలీ చేస్తే గుర్తించి సమాచారాన్ని అందజేయాలని ఇప్పటికే బ్యాంకర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున.. జిల్లా, మండల, గ్రామ సమాఖ్యల సమావేశాల్లో ఎవరూ రాజకీయాలు మాట్లాడరాదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్ రాజేశ్వర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ సిబ్బంది ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా..ఎస్‌హెచ్‌జీలను ప్రేరేపించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సభ్యులను పదవుల నుంచి తొలగించడమే కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే గ్రామ సమన్వయకర్త, కమ్యూనిటీ సమన్వయకర్త, ఏపీఎంఎస్, ఏసీఎస్‌లను విధుల నుంచి తొలగిస్తామన్నారు. -
షేమ్.. షేమ్...
అనంతపురం టౌన్/ సిటీ, న్యూస్‌లైన్ : ‘మడకశిర నియోజకవర్గంలోని పాపసానిపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని మంజూరు చేస్తాం.’- సాక్షాత్తు మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత అంగ్‌సాన్ సూచీ ఎదుట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కూడా వకాల్తా పుచ్చుకొని పాపసానిపల్లిని దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తామంటూ గొప్పలు చెప్పారు. ఆ గ్రామానికి అంగ్‌సాన్ సూచీ వచ్చి వెళ్లి రెండేళ్లు కావస్తోంది. అయితే.. ఇప్పటికీ మన పాలకులు ఒరగబెట్టిందేమీ లేదు. ఒక్క పాపసానిపల్లిలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లోనూ ఇదే దుస్థితి. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల సొంత గ్రామాల్లో ‘న్యూస్‌లైన్’ బృందాలు పర్యటించాయి. వాటి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. సాయంత్రం ఆరు దాటితే తప్ప.. మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లలేని దయనీయ పరిస్థితి ఉందంటే అందరూ సిగ్గుతో తలదించుకోవాలి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ సామూహిక మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీపజాప్రతినిధులు సొంత గ్రామాల్లో సైతం మరుగుదొడ్లను నిర్మింపజేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. దివంగత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శత జయంతి ఉత్సవాలను ఇటీవల రూ.కోట్లు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించారు. అయితే ఆయన సొంతూరైన ఇల్లూరులో ఇప్పటికీ మహిళలు సామూహిక మరుగుదొడ్డినే ఉపయోగిస్తున్నారు. జాడలేని నిర్మల్ భారత్ అభియాన్ ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలు బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్), జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లకు అప్పగించింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.4500, ఉపాధి హామీ పథకం కింద రూ.4500 మంజూరవుతోంది. లబ్ధిదారుని వాటాగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ. 9900తో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలి. అయితే.. ఈ పథకం కింద మండలానికి ఐదు పంచాయతీల చొప్పున మాత్రమే ఎంపిక చేస్తున్నారు. వాటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. మొదటి విడత కింద 54,494 మరుగుదొడ్లను మంజూరు చేశారు. వీటిలో 2,119 మాత్రమే పూర్తయ్యాయి. 7,592 నిర్మాణంలో ఉన్నాయి. మిగిలినవి ఎప్పటికి పూర్తి చేస్తారో అధికారులే చెప్పలేకపోతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు నిత్యం ఆదేశాలు జారీ చేస్తున్నా జిల్లాలో పురోగతి మాత్రం కనిపించడం లేదు. దీనికితోడు ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెరిగిన నిర్మాణ సామగ్రి (సిమెంటు, ఇసుక) ధరల కారణంగా ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చే మొత్తం ఏమాత్ర ం సరిపోవడం లేదని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు జాబ్ కార్డు ఉన్న వారికే బిల్లులు చెల్లిస్తామని మెలిక పెట్టారు. ఈ నిబంధన కారణంగా అప్పోసప్పో చేసి మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టిన వారు ఇబ్బంది పడుతున్నారు. -
పథకాలు ప్రజలకు అందేలా చూడాలి
నర్సింహులపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత మండల, గ్రామ స్థాయి అధికారులపై ఉందని గ్రామీణ పేదరిక నిర్మూలన(సెర్ఫ్) సీఈఓ డాక్టర్ రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా షెడ్యూల్డు కులాలు, సహకార సంఘం ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాలకు ఏర్పాటు చేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు. అధికారుల లోపంతో కొన్ని స్కీంలు పెదవారికి సక్రమం గా అందడం లేదన్నారు. రాష్ట్రంలో 1.17 కోట్ల మహిళలు డ్వాక్రా సంఘాల్లో ఉండగా, వారికి రూ.60వేల కోట్లు రుణాలుగా ఇచ్చామని, ఎలాం టి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా ఇస్తు న్న రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలని సూచించా రు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకుంటే పేదరిక నిర్మూలన జరుగుతుందని పేర్కొన్నారు. పెద్దముప్పారంలో ఐకే పీ సిబ్బంది పనితీరు బాగోలేదని, సంఘాల తో ప్రతీవారం సమావేశం ఎర్పాటు చేసి సక్రమంగా రుణాలు జమచేసి, డి-గ్రేడ్‌లో ఉన్న సంఘాలను ఎ-గ్రేడ్‌లోకి తీసుకురావాలని ఆదేశించారు. డ్వాక్రా సంఘాల ద్వారానే మహిళలకు సమాజంలో గుర్తింపు వచ్చిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ ఎండీ బి.జయరాజు మాట్లాడుతూ చిత్తశుద్ధి, క్రమశిక్షణ, తపన, కృషి, పట్టుదల ఉంటే మహిళలు అన్ని రంగాలలో రాణించవచ్చని పేర్కొన్నారు. గ్రా మంలో ఎస్బీఐతోపాటు స్త్రీ నిధి బ్యాంక్ ద్వారా రుణాలు ఇవ్వాలని మహిళా సంఘాల సభ్యులు సెర్ఫ్ సీఈఓను కొరారు. అడిషనల్ జేసీ సం జీవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ కిషన్, డీఆర్డీఏ పీడీ విజయగొపాల్, హౌసింగ్ పీడీ లక్ష్మణ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఆర్డీఓ మధుసూదన్నాయ క్, తహసీల్దార్ బత్తుల సుమతి, ఎంపీడీఓ అశోక్‌కుమార్, సీడీపీఓ ధనమ్మ, గ్రామ సర్పంచ్ వెలుగు ఉపేందర్, ఉప సర్పంచ్ నుగునూతల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఐకేపీ, డీఆర్డీఏ జేఏసీ ఏర్పాటు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పాటయ్యారు. రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. స్థానిక డ్వాక్రాబజార్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఐకేపీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జి.రాంబాబు ఆ వివరాలు వెల్లడించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకుడు అశోక్‌బాబు అధ్యక్షతన శుక్రవారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఐకేపీ జేఏసీ ఏర్పాటైనట్లు చెప్పారు. శనివారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, సోమవారం పీడీలకు సమ్మె నోటీసులు అందజేస్తామన్నారు. మంగళవారం నుంచి నిర్వహించనున్న నిరవధిక సమ్మెలో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో గల 70 లక్షల మంది ఐకేపీ ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఐకేపీ అధికారులు కృష్ణకుమారి, అంబేద్కర్, సురేష్, సాల్మన్, ప్రసాద్, పి.రాంబాబు, డేవిడ్, కృష్ణారావు పాల్గొన్నారు. రేపటి నుంచి పశుసంవర్థకశాఖ వైద్యులు... ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యసెగ పశుసంవర్థకశాఖను తాకింది. ఇప్పటికే ఆ శాఖ సిబ్బంది నిరవధిక సమ్మెలోకి దిగగా, తాజాగా పశువైద్యులు, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్లు సమ్మెబాట పట్టనున్నట్లు ప్రకటించారు. గజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు పశుసంవర్థకశాఖ డెరైక్టర్‌కు సమ్మె నోటీసు కూడా అందించారు. జిల్లాలోని 110 మంది పశువైద్యులు, 17 మంది అసిస్టెంట్ డెరైక్టర్లు సమ్మెలోకి దిగనున్నారు. ఇప్పటివరకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలోని మినిస్టీరియల్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. అయితే, సేవలపై వారి సమ్మె ఎలాంటి ప్రభావం చూపలేదు. పశువైద్యులు, అసిస్టెంట్ డెరైక్టర్ల సమ్మెతో సేవలకు విఘాతం కలగనుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పశువులు వ్యాధుల బారినపడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పశువైద్యులు సమ్మెలోకి దిగడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు... పశువైద్యులు, అసిస్టెంట్ డెరైక్టర్లు ఈనెల 19వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి దిగుతుండటంతో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్థకశాఖ గజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ డీ సురేంద్రప్రసాద్, కార్యదర్శి పీ వెంకటసుబ్బయ్య తెలిపారు. సంతపేటలోని బహుళార్ధ పశువైద్యశాల ఆవరణలో సమ్మెకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను శనివారం వారు వెల్లడించారు. నిరవధిక సమ్మెలోకి దిగినప్పటికీ అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రతి పశువైద్యశాలలో సంబంధిత పశువైద్యాధికారి ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. పశువులకు అత్యవసర వైద్యం అవసరమైతే ఫోన్‌చేసిన వెంటనే వైద్యుడు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు.