అన్నీ లోపాలు!
- జిల్లాలో మూతపడుతున్న పాలశీతలీకరణ కేంద్రాలు
- మరికొన్ని ఇతర ప్రాంతాలకు తరలింపు
- పర్యవేక్షణ.. నిర్వహణ లోపమే ప్రధాన కారణం
- నాడు ప్రారంభించింది 21.. నేడు మిగిలింది 8
- నిర్వహణపై విజిలెన్స్ ఆరా?
కడప రూరల్ : జిల్లాలో మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) నిర్వహణలో పాలశీతలీకరణ కేంద్రాలు(బీఎంసీ) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి నిర్వహణ, పాల సేకరణలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలసేకరణ వెల్లువలా సాగిన కేంద్రాలతోపాటు మరికొన్ని మూతపడగా, ఇంకొన్ని అర్ధంతరంగా నిలిచిపోయాయి.
కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రైల్వేకోడూరు, జమ్మలమడుగు, కొండాపురం, చక్రాయపేట, బద్వేలు, పోరుమామిళ్ల, కమలాపురం, రామాపురం, సుండుపల్లె, కాశినాయన, ఒంటిమిట్ట, చిట్వేలి, బి.మఠం, లింగాల, తొండూరు, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడులో మొత్తం 21 బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ బీఎంసీలు ఏపీ డెయిరీ సాంకేతిక సహకారంతో మహిళా సమాఖ్య సభ్యుల నిర్వహణలో సాగాయి. అందుకోసం మహిళా సభ్యులకు కమీషన్ వచ్చేది.
మార్పులు, చేర్పులు
2010 నుంచి బీఎంసీలలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. జమ్మలమడుగు బీఎంసీని బద్వేలుకు తరలించారు. చిట్వేలిలో ఉన్న దానిని పెనగలూరులో పెట్టారు. బి.మఠం బీఎంసీని మదనపల్లెకు మార్చారు. అలాగే వేములలో ఉన్న బీఎంసీని అనంతపురం జిల్లా తిమ్మనపల్లె మండలం సింగవరంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నిర్వహించిన ట్రయల్ రన్‌లో మిల్క్ ట్యాంకర్ పనిచేయకపోవడంతో తిరిగి ఆ యూనిట్‌ను పులివెందులలో భద్రపరిచినట్లు చెబుతున్నారు. అలాగే ఏపీ డెయిరీకి ఒక బీఎంసీ మంజూరు కాగా, దాన్ని అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని బీఎంసీలను ప్రజల భాగస్వామ్యంతో పెనగలూరు, పోరుమామిళ్ల, మైదుకూరులలో ఏర్పాటు చేయగా, అవి నేటికీ ప్రారంభం కాలేదు.
అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అభివృద్ధిలో భాగంగా అక్కడున్న బీఎంసీని అధికారులు ఎత్తివేశారు. ఈ యూనిట్‌ను రాజంపేటలో భద్రపరిచారు. ఒంటిమిట్టలో పాల సేకరణ బాగా ఉంది. అయితే, ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించాలనే సంకల్పం ఎవరికీ లేకపోవడం దారుణం. ఇలా పలు కారణాలతో బీఎంసీలపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. దీంతో 2008లో విజయపథంలో నడిచిన 21 కేంద్రాలు నేడు బద్వేలు, కమలాపురం, తొండూరు, లింగాల, సుండుపల్లె, చక్రాయపేట, రైల్వేకోడూరు, కొండాపురంలో మొత్తం ఎనిమిది కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.
ఎన్నో కారణాలు
కడపలో నిర్మించే మహిళా డెయిరీకి పాలు సరఫరా చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ మహిళా డెయిరీ పూర్తి అయ్యేంత వరకు బీఎంసీల ద్వారా వచ్చే పాలను ఏపీ డెయిరీకి తరలించాలనే నిబంధన ఉంది. ఆ మేరకు పాలు ప్రస్తుతం ఏపీ డెయిరీకి తరలుతున్నాయి. కాగా, ఒక్కో యూనిట్‌కు రూ.12 లక్షల విలువైన పరికరాలతో ఏర్పాటు చేశారు. అయితే ఈ మిషనరీల సంరక్షణ విషయంలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ఒక ఐకేపీ సిబ్బంది, మరికొందరు కలిసి పరిక రాలను ఇతర ప్రాంతాలకు తరలించడం తదితర అక్రమాలకు పాల్పడటంతో బీఎంసీల పరిస్థితి అధ్వానంగా తయారైందనే విమర్శలున్నాయి. దీనికితోడు ఏపీ డెయిరీ నిర్వాకం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఇటీవల విజిలెన్స్ అధికారులు ఇందుకు సంబంధించిన పలు ఫైళ్లను సేకరించి బీఎంసీల నిర్వహణ, అక్రమాలు, లోపాలు తదితర విషయాలపై ఆరా తీస్తున్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. నాటి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం, నిరుపేద మహిళల కోసం ఏర్పాటు చేసిన బీఎంసీల లో‘పాల’ను సరిదిద్ది సక్రమమైన బాటలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2008లో కడప సమీపంలో రూ. 7 కోట్ల వ్యయంతో మహిళా డెయిరీని నిర్మించాలని నాటి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా డెయిరీకి పాల సేకరణ