Indira Kranti trajectory
-
అన్నీ లోపాలు!
- జిల్లాలో మూతపడుతున్న పాలశీతలీకరణ కేంద్రాలు - మరికొన్ని ఇతర ప్రాంతాలకు తరలింపు - పర్యవేక్షణ.. నిర్వహణ లోపమే ప్రధాన కారణం - నాడు ప్రారంభించింది 21.. నేడు మిగిలింది 8 - నిర్వహణపై విజిలెన్స్ ఆరా? కడప రూరల్ : జిల్లాలో మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధికోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) నిర్వహణలో పాలశీతలీకరణ కేంద్రాలు(బీఎంసీ) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి నిర్వహణ, పాల సేకరణలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలసేకరణ వెల్లువలా సాగిన కేంద్రాలతోపాటు మరికొన్ని మూతపడగా, ఇంకొన్ని అర్ధంతరంగా నిలిచిపోయాయి. కేంద్రాల ఏర్పాటు నిమిత్తం రైల్వేకోడూరు, జమ్మలమడుగు, కొండాపురం, చక్రాయపేట, బద్వేలు, పోరుమామిళ్ల, కమలాపురం, రామాపురం, సుండుపల్లె, కాశినాయన, ఒంటిమిట్ట, చిట్వేలి, బి.మఠం, లింగాల, తొండూరు, వేంపల్లె, వేముల, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడులో మొత్తం 21 బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ బీఎంసీలు ఏపీ డెయిరీ సాంకేతిక సహకారంతో మహిళా సమాఖ్య సభ్యుల నిర్వహణలో సాగాయి. అందుకోసం మహిళా సభ్యులకు కమీషన్ వచ్చేది. మార్పులు, చేర్పులు 2010 నుంచి బీఎంసీలలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. జమ్మలమడుగు బీఎంసీని బద్వేలుకు తరలించారు. చిట్వేలిలో ఉన్న దానిని పెనగలూరులో పెట్టారు. బి.మఠం బీఎంసీని మదనపల్లెకు మార్చారు. అలాగే వేములలో ఉన్న బీఎంసీని అనంతపురం జిల్లా తిమ్మనపల్లె మండలం సింగవరంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నిర్వహించిన ట్రయల్ రన్లో మిల్క్ ట్యాంకర్ పనిచేయకపోవడంతో తిరిగి ఆ యూనిట్‌ను పులివెందులలో భద్రపరిచినట్లు చెబుతున్నారు. అలాగే ఏపీ డెయిరీకి ఒక బీఎంసీ మంజూరు కాగా, దాన్ని అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని బీఎంసీలను ప్రజల భాగస్వామ్యంతో పెనగలూరు, పోరుమామిళ్ల, మైదుకూరులలో ఏర్పాటు చేయగా, అవి నేటికీ ప్రారంభం కాలేదు. అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం అభివృద్ధిలో భాగంగా అక్కడున్న బీఎంసీని అధికారులు ఎత్తివేశారు. ఈ యూనిట్‌ను రాజంపేటలో భద్రపరిచారు. ఒంటిమిట్టలో పాల సేకరణ బాగా ఉంది. అయితే, ఇక్కడ యూనిట్‌ను ప్రారంభించాలనే సంకల్పం ఎవరికీ లేకపోవడం దారుణం. ఇలా పలు కారణాలతో బీఎంసీలపై నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి. దీంతో 2008లో విజయపథంలో నడిచిన 21 కేంద్రాలు నేడు బద్వేలు, కమలాపురం, తొండూరు, లింగాల, సుండుపల్లె, చక్రాయపేట, రైల్వేకోడూరు, కొండాపురంలో మొత్తం ఎనిమిది కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఎన్నో కారణాలు కడపలో నిర్మించే మహిళా డెయిరీకి పాలు సరఫరా చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా బీఎంసీలను ఏర్పాటు చేశారు. ఈ మహిళా డెయిరీ పూర్తి అయ్యేంత వరకు బీఎంసీల ద్వారా వచ్చే పాలను ఏపీ డెయిరీకి తరలించాలనే నిబంధన ఉంది. ఆ మేరకు పాలు ప్రస్తుతం ఏపీ డెయిరీకి తరలుతున్నాయి. కాగా, ఒక్కో యూనిట్‌కు రూ.12 లక్షల విలువైన పరికరాలతో ఏర్పాటు చేశారు. అయితే ఈ మిషనరీల సంరక్షణ విషయంలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఒక ఐకేపీ సిబ్బంది, మరికొందరు కలిసి పరిక రాలను ఇతర ప్రాంతాలకు తరలించడం తదితర అక్రమాలకు పాల్పడటంతో బీఎంసీల పరిస్థితి అధ్వానంగా తయారైందనే విమర్శలున్నాయి. దీనికితోడు ఏపీ డెయిరీ నిర్వాకం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాగా, ఇటీవల విజిలెన్స్ అధికారులు ఇందుకు సంబంధించిన పలు ఫైళ్లను సేకరించి బీఎంసీల నిర్వహణ, అక్రమాలు, లోపాలు తదితర విషయాలపై ఆరా తీస్తున్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. నాటి ప్రభుత్వం మహిళా సాధికారత కోసం, నిరుపేద మహిళల కోసం ఏర్పాటు చేసిన బీఎంసీల లో‘పాల’ను సరిదిద్ది సక్రమమైన బాటలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2008లో కడప సమీపంలో రూ. 7 కోట్ల వ్యయంతో మహిళా డెయిరీని నిర్మించాలని నాటి ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా డెయిరీకి పాల సేకరణ -
వడ్డన
ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ)అధికారుల స్వలాభం మహిళా శిశు సంక్షేమశాఖకు భారంగా మారుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్లకు కాంట్రాక్టర్లు ఒక్కోగుడ్డుకు 10పైసలు తీసుకుంటుండగా.. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా సరఫరా అవుతున్న ఒక్కోగుడ్డుకు 60 పైసలు అధికారులు చెల్లిస్తున్నారు.. దీంతో ప్రభుత్వ ఖజానాకు నెలకు దాదాపు రూ.29 లక్షల భారం పడుతోంది.. కాగా, ‘ఆరోగ్య లక్ష్మి’ నిబంధనలకు విరుద్ధంగా సరఫరా చేస్తున్నారు.. - కోడిగుడ్ల రవాణా పేరిట చార్జీల మోత - ఐకేపీ సంఘాల ద్వారా అదనపు భారం - ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.29 లక్షలు గండి - ఇప్పటివరకు రూ.1.50 కోట్లు చెల్లింపు సాక్షి, హన్మకొండ : జిల్లాలో 18 అంగన్వాడీ ప్రాజెక్టుల పరిధిలో 4,196 అంగన్వాడీ, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నారుు. ఇందులో గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు వయసున్న పిల్లలు కలిపి 2,23,323 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి నెలలో 26 రోజులపాటు కోడిగుడ్లు పౌష్టికాహారంగా అందిస్తారు. ఆ ప్రకారం అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 58,06,398 గుడ్లు సరఫరా అవుతున్నాయి. ఇంత భారీసంఖ్యలో గుడ్లు కొనుగోలు చేస్తే రవాణా చార్జీలు తక్కువగా ఉండాలి. కానీ, జిల్లాలో పది రెట్లు అదనంగా రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా సరఫరా చేయాల్సి రావడంతో అదనపు భారం పడుతోంది. నెలకు రూ.29 లక్షలు అదనం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్ల సంఖ్య ఒక నెలకు 58,06,398. లబ్ధిదారులు 2,23,323 ఉండగా ఒక్కొ గుడ్డుకు రవాణా చార్జీగా రూ.0.60 చెల్లిస్తున్నారు. దీనితో కోడిగుడ్లకు రవాణాకు నెలకు రూ.34,83,838 ఖర్చవుతోంది. కానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర సంక్షేమ హస్టళ్లకు టెండర్ల విధానం ద్వారా కాంట్రాక్టర్లు కేవలం పది పైసలకే రవాణా చేస్తున్నారు. ఇదే పద్ధతి ఐసీడీఎస్‌లో అమలైతే నెలకు రూ.5,80,639లోపే రవాణా చేయవచ్చు. కానీ ఐకేపీ సంఘాల ద్వారా గుడ్ల సరఫరా బాధ్యత అప్పగించడం వల్ల ప్రతీ నెల దాదాపు రూ.29 లక్షలు అదనంగా రవాణా చార్జీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.1.50 కోట్లు అదనపు భారం పడింది. ఐకేపీతోనే తంటా.. కలెక్టర్‌గా జి.కిషన్ కొనసాగిన కాలంలో అమృతహస్తం పథకంలో భాగంగా అంగన్వాడీల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న గుడ్ల సరఫరా బాధ్యతను ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), మహిళా సమాఖ్యలకు అప్పగించారు. ఐకేపీ సంఘాలు ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలకే గుడ్లు సరఫరా చేయాల్సి రావడంతో రవాణా చార్జీలు పెరిగాయి. దీనికితోడు పెద్ద సంఖ్యలో గుడ్లను సరఫరా చేయడంలో మహిళా సంఘాల అనుభ వలేమి, మౌలిక సదుపాయల కొరతను ఆసరా చేసుకున్న కొందరు అధికారులు గుడ్ల సరఫరాలో తమ మార్క్ దందాను కొనసాగిస్తున్నారు. కాగితాల్లోనే మహిళా సంఘాల ద్వారా సరఫరా అని పేర్కొంటూ.. వాస్తవంలో పర్సంటేజీ స్వీకరించి కాంట్రాక్టర్ల ద్వారానే కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణా చార్జీల రూపంలో భారీగా మిగులు ఉండటంతో ఇటూ కాంట్రాక్టర్లు, అటూ అధికారులకు కాసుల పంట పండుతోంది. దీనితో ఇదే పద్ధతిని కొనసాగించేందుకు సుముఖత చూపుతున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్న నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ‘ఆరోగ్యలక్షి్ష్మ’తో రాని మార్పు 2015 జనవరి నుంచి అమృత హస్తం పథకం స్థానంలో ఆరోగ్య లక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ పథకం నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ ద్వారానే కోడిగుడ్లను సరఫరా చేయాలి. అయితేటెండర్ల ద్వారా గుడ్లు అందివ్వాలనే నిబంధనలు అమలు చేసేందుకు ఐకేపీ అధికారులు విముఖత చూపుతున్నారు. ఐదు నెలలుగా టెండర్లను ఆహ్వానించకుండా ఐకేపీ మహిళా సంఘాల ద్వారానే గుడ్ల సరఫరాను కొనసాగిస్తున్నారు. -
చలో హైదరాబాద్‌పై ఉక్కుపాదం
ఏలూరు (టూ టౌన్): గత 18 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్న ఇందిరాక్రాంతిపథం యానిమేటర్లు ఆదివారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు పక్కా ప్రణాళికతో భగ్నం చేశారు. జిల్లాలోని సుమారు 200 మంది ఐకేపీ యానిమేటర్లను అదుపులోని తీసుకుని హెచ్చరించారు. అంతేకాకుండా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కనుక అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారంటూ బెదిరించారు. జిల్లాలోని ప్రతి మండలంలోని ఐకేపీ యానిమేటర్ల ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు సేకరించిన పోలీసులు నేరుగా ఇళ్లకు వెళ్లి బయటకు వస్తే అరెస్ట్‌లు చేస్తామంటూ బెదిరించారు. కొందరు యానిమేటర్లు ధైర్యం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఐకేపీ యానిమేటర్లను ఉదయం తొమ్మిది గంటలకే అదుపులోకి తీసుకుని సాయంత్రం ఐదుగంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై పంపించారు. మమ్మల్ని కాదని మీరు బస్టాండ్‌కు వెళ్లినా, రైల్వేస్టేషన్‌కు వెళ్లినా అరెస్ట్ చేసి తీరతామంటూ హెచ్చరించారు. కాగా నరసాపురం రూరల్ పోలీసుస్టేషన్లో అదుపులోకి తీసుకున్న యానిమేటర్లకు మద్దతుగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడు నాని పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. కాళ్ల మండలంలోని దొడ్డనపూడికి చెందిన కుమారి అనే యానిమేటర్ కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో స్పృహతప్పి పడిపోయూరు. గర్భిణులను కూడా స్టేషన్ తరలించటంతో పోలీసులు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఐకేపీ యానిమేటర్లు 96 రోజులుగా తమ జీతాల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ వారికి న్యాయం చేయకపోగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయటంపై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎన్‌వీడీ ప్రసాద్ విమర్శించారు. ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఖరి ఎండగట్టారు. నిడదవోలు మండలంలో నలుగురిని, పెరవలి మండలంలో ఐదుగురిని, ఉండ్రాజవరం మండలంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరంలో 18 మందిని, ఉండిలో 13 మందిని, కాళ్లలో ఏడుగురిని, పాలకోడేరులో 10 మందిని, ఆకివీడులో ఐదుగురిని, దేవరపల్లిలో 27 మందిని, ద్వారకాతిరుమలలో ఐదుగురిని, ఆచంటలో ఎనిమిది మందిని, పెనుగొండలో 18 మందిని, పెనుమంట్రలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడిలో 10 మందిని జంగారెడ్డిగూడెంలో 12 మందిని, లింగపాలెంలో ముగ్గురిని, కామవరపుకోట మండలంలో తొమ్మిది మందిని, నరసాపురం మండలంలో 31 మందిని, పోడూరులో 11 మందిని, యలమంచిలిలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తణుకు, అత్తిలి మండలాల్లో ఐకేపీ యానిమేటర్లను ఉదయం నుంచీ బెదిరించారు. తాడేపల్లిగూడెంలో ప్రత్యేక నిఘా పెట్టి రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద పోలీసులు రాత్రి వరకు పహారా కాశారు. జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి, గౌతమి, నరసాపుర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే స్టేషన్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. స్టేషన్‌కు వచ్చేవారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకునేలా అధికారులు డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు అదేశాలు జారీచేశారు. బస్టాండ్ల వద్ద కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. -
ఉద్యమంపై ఉక్కుపాదం
* వెలుగు యానిమేటర్లకు పోలీసుల నిర్బంధం * ‘చలో హైదరాబాద్’కు వెళ్లకుండా నిరోధం కాకినాడ క్రైం : ఇందిరా క్రాంతి పథం (వెలుగు) యానిమేటర్ల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. యానిమేటర్లు తమ సమస్యల పరిష్కారానికి సోమవారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం తలపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యానిమేటర్లు, నాయకులు ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లబోగా యఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నాయకులను వారి గృహాల్లో నిర్బంధించారు. వెలుగు యానిమేటర్లు తమ 15 నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో మూడు నెలలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో తమ గళం అసెంబ్లీ ఎదుట వినిపించాలని యానిమేటర్ల నాయకులు తీర్మానించారు. సోమవారం అసెంబ్లీముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యానిమేటర్లు హైదరాబాద్ తరలి రాకుండా నిరోధించాలని ప్రభుత్వం పోలీసుల్ని ఆదేశించింది. ఉద్యమాన్ని అణిచి వేయాలని సూచించింది. దీంతో పోలీసులు జిల్లాలో పలువురు నాయకులను నిర్బంధించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రత్యేక గస్తీ నిర్వహించి, యానిమేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. జిల్లాలో సుమారు 500 మంది యానిమేటర్లను వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజోలులో యానిమేటర్లను వారి గృహాల్లో నిర్బంధించారు. అమలాపురంలో బస్టాండుకు వెళ్లిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆత్రేయపురంలో యూనియన్ నాయకురాలు మణిని అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో 20 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బొమ్మూరులో ఇళ్ల వద్ద ఉన్న యానిమేటర్లను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదు : ఎస్పీ ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ పేర్కొన్నారు. వారి దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆ రెండు రోజుల్లో యానిమేటర్లు, నాయకులు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరెస్టులకు ఖండన కాకినాడ సిటీ : సమ్మె చేస్తున్న యానిమేటర్లు సమస్యలు పరిష్కరించకుండా చలో హైదరాబాద్‌కు వెళ్ళేవారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఐటీయూ ఖండించింది. కార్పొరే ట్ వర్గాలకు తొత్తుగా పనిచేస్తున్న ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోరుతున్న కార్మికుల అరెస్టులకు, అణచివేతలకు పూనుకోవడం దారుణమని ఆ సంఘం నాయకులు జి.బేబిరాణి, డి.శేషబాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. యానిమేటర్ల చలో హైదరాబాద్ నేపథ్యంలో పోలీసులను ఇళ్ళకు పంపి భయానక పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మేకలు బంధువుల ఇళ్లకు వెళ్లాయట!
రేగోడ్: పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు సర్కార్ ఇందిరాక్రాంతి పథం కింద అర్హులైన వారికి లక్షల రూపాయలు విడుదల చేసి మేకలు, బర్రెలను కొనుగోలు చేసుకోవాలని సూచిస్తే, అర్హులంతా తాము బర్రెలు, మేకలు కొనుగోలు చేశామని సర్కార్‌కు నివేదించారు. కానీ ఆడిటింగ్ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినప్పడు మాత్రం ఆ పశువులు కనిపించలేదు. పశువులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే మా బంధువుల ఇళ్లకు వెళ్లాయనే సమాధానం చెప్పారని అధికారులు ప్రజాదర్బార్‌లో వివరించారు. శనివారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజాదర్బార్‌లో డీఆర్పీలు ఇలాంటి వింత కథలెన్నో వినిపించారు. 2009-10 సంవత్సరంలో వాటర్‌షెడ్ పథకంలో మంజూరైన రూ.6 కోట్లలో రూ.79 లక్షలు ఆయా పనులపై ఖర్చు చేయగా, ఈ పనులపై ఆడిట్ అధికారులు సర్వే చేసి గ్రామసభలు నిర్వహించారు. శనివారం స్థానిక ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఈజిఎస్ అడీషనల్ పీడీ అమరేశ్, జిల్లా విజిలెన్స్ అధికారి రాంరెడ్డి, పోగ్రాం మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి సమక్షంలో ఉదయం 11.30 గంటలకు నుంచి రాత్రి 8 వరకూ ఈ ప్రజాదర్బార్ కొనసాగింది. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మేకలు, గొర్రెలు, బర్రెల కొనుగోళ్ల కోసం లక్షల రూపాయలు మంజూరు చేశారు. కానీ గొర్రెలు, బర్రెలు పొందిన వారి ఇళ్లవద్దకు వెళ్లగా, చాలా చోట్ల పశువులు కనిపించలేదని ఆడిట్ అధికారులు ప్రజా దర్బార్‌లో తెలిపారు. పశువులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించగా, తమ బంధువుల ఇంటి వద్ద ఉన్నాయని పశువులు పొందిన వారు తెలిపారన్నారు. ఈ తతంగం చూస్తుంటే పశువులను కొనుగోలు చేయకుండానే నిధులు మాత్రం తీసుకున్నారనే విషయం బహిర్గతమైనట్లు వారు వెల్లడించారు. ఇక రాళ్లకట్టలు, చెక్‌డ్యాంలు, కుంటల పనుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు డీఆర్పీలు తెలిపారు. గతంలో ఉపాధిహామి పథకంలో చేపట్టిన పనులనే వాటర్‌షెడ్ పథకంలో చూపించినట్లు ప్రజాదర్బార్‌లో వెల్లడించారు. పలుచోట్ల పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత, జెడ్పీటీసీ రాంరెడ్డి, వాటర్‌షెడ్ పీఓ వీరన్న, ఈజీఎస్ ఏపీఓ జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐకేపీ యానిమేటర్ల గోడు పట్టదా?
సీఎం చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ విమర్శ వారి ఆందోళనను వెటకారం చేస్తారా! సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) యానిమేటర్లు గత రెండు నెలలుగా తమ కోర్కెల సాధనకు సమ్మె చేస్తోంటే ఏపీ ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. యానిమేటర్ల ఆందోళనను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కరించాల్సిందిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు వెటకారంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. పద్మ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం సభల్లో ఐకేపీ యానిమేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే ‘కొన్ని పనికిమాలిన పార్టీలు వారిని రెచ్చగొట్టి ఆందోళన చేయిస్తున్నాయి’ అని చంద్రబాబు వెటకారం చేయడం దారుణమని ఆమె అన్నారు. డ్వాక్రా గ్రూపులను సమన్వయపర్చడంతో పాటుగా క్షేత్ర స్థాయిలో 17 రకాల విధులను నిర్వర్తిస్తూ గొడ్డు చాకిరీ చేస్తున్న యానిమేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారనడ మేమిటని పద్మ ప్రశ్నించారు. కాళ్లు పట్టుకున్న వారికి విలువ ఉంటుందా! పాలెం వద్ద బస్సు దుర్ఘటనలో 40 మంది సజీవ దహనం అయిన కేసు నుంచి తప్పించుకోవడానికి అధికారపక్షం కాళ్లు పట్టుకున్న అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు.. వైఎస్ జగన్‌పై చేసే వ్యాఖ్యలకు విలువ ఉండదని వాసిరెడ్డి పద్మ అన్నారు. -
టార్పాలిన్.. సొమ్ము తినేసెన్
* రూ.42 లక్షలకు రెక్కలు * అస్మదీయుల కోసం అధికారుల ఆరాటం ఏలూరు సిటీ : ఒక వస్తువు కొనాలంటే ఎవరైనా ఏం చేస్తారు. ఆ వస్తువు ధర ఏ దుకాణంలో ఎంత ఉందో వాకబు చేస్తారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో చూస్తారు. అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అత్తసొమ్ము అల్లుడి దానం చేసిన చందంగా ఏకంగా రూ.42 లక్షలను తమ వారి జేబుల్లో వేసేందుకు సిద్ధమైపోయారు. ఇదీ అవినీతి అసలు కథ ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆయా కేంద్రాలకు ప్లాస్టిక్ టార్పాలిన్స్ సమకూర్చాలని నిర్ణయించింది. ఇక్కడే అధికారులు తమ చేతివాటాన్ని పక్కాగా ప్రదర్శించారు. మార్కెట్లో నాణ్యమైన ప్లాస్టిక్ టార్పాలిన్ రూ.4,200కు లభిస్తోంది. అధికారులు మాత్రం ఏకంగా దానిధర రూ.5,500కు కోట్ చేసిన టెండరుదారుడికి కాంట్రాక్టు కట్టబెట్టారు. గతంలోనూ ఇంతకంటే తక్కువ ధరకే ఓ కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేయగా, కుదరదని చెప్పి దాన్ని రద్దు చేశారు. అస్మదీయులకు కట్టబెట్టేందుకే తొలి టెండర్‌ను రద్దుచేసి రెండోసారి టెండర్లు పిలిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 3,264 ప్లాస్టిక్ టార్పాలిన్స్ అవసరం ఉంది. ఇది ఒక్కొక్కటి 129 సైజులో ఉండాలని నిర్దేశించారు. నాణ్యతతో కూడిన ఈ సైజు టార్పాలిన్ ధర మార్కెట్లో రూ.4,200 ఉంది. వీటి కొనుగోలు కోసం సివిల్ సప్లైస్, మార్కెటింగ్, తూనికలు-కొలతలు, డీఆర్డీఏ అధికారుల ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. అక్టోబర్ 30న తొలిసారి టెండర్లు పిలవగా 10 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు దాఖలు చేశారు. ఒంగోలుకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఒక్కో ప్లాస్టిక్ టార్పాలిన్కు రూ.4,908 ధర కోట్ చేస్తూ టెండర్ సమర్పించారు. అధికారులు ఆ ధర అధికమంటూ దానిని రద్దు చేశారు. ఈనెల 11న మరోసారి టెండర్లు పిలవగా, ఐదుగురు దరఖాస్తులు సమర్పించారు. వారిలో యూనివర్సల్ ట్రేడర్స్ ఒక్కో ప్లాస్టిక్ టార్పాలిన్‌ను రూ.4,600కు, అమలాపురానికి చెందిన రుద్ర ఏజెన్సీస్ రూ.5,500కు సరఫరా చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నాయి. అయితే, అధికారులు రూ.5,500 ధరను కోట్ చేసిన రుద్ర ఏజెన్సీస్ టెండర్‌ను ఆమోదించారు. మార్కెట్లో రూ.4200లకే దొరుకుతున్న టార్పాలిన్‌ను కాంట్రాక్టర్ నుంచి రూ.5,500కు కొనేందుకు నిర్ణయించడం ద్వారా ఒక్కో టార్పాలిన్‌పై అదనంగా రూ.1,300 చొప్పున రూ.42 లక్షలను గోల్మాల్ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మార్కెటింగ్ ఏడీ కిషోర్‌ను వివరణ కోరగా, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ఆధారంగా వాటర్ ప్రూఫ్ టార్పాలిన్ కావాలని సివిల్ సప్లైస్ అధికారులు చెప్పారన్నారు. జిల్లా అధికారుల సమక్షంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించామని, ఇందులో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. -
కదం తొక్కిన యానిమేటర్లు
కలెక్టరేట్ ముట్టడి 300 మంది అరెస్టు, విడుదల విశాఖపట్నం : ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) యానిమేటర్లు బుధవారం కలెక్టరేట్ ఎదుటు కదం తొక్కారు. 15 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యానిమేటర్లపై రాజకీయ వేధింపులు, అధికారుల తొలగింపులు ఆపాలని, గుర్తింపు కార్డులు, నియామకపత్రాలు ఇవ్వాలని ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ గేటు వద్ద నినాదాలు చేస్తూ బైఠాయించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ పది రోజులుగా ఐకేపీ యానిమేటర్లు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నిత్యం మహిళా ఉద్ధరణపై ఉపన్యాసాలు చేస్తున్న సీఎం చంద్రబాబు మహిళలచేత వెట్టిచాకిరీ చేయించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వీరి పోరాటానికి, న్యాయమైన సమస్యల పరిష్కారానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ యానిమేటర్లకు అభయ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా అధ్యక్షురాలు దాక్షాయిణి, సీఐటీయూ వర్కింగ్ కమిటీ కన్వీనర్ అరుణ, ఐకేపీ జిల్లా కార్యదర్శి, ఆర్. రామసుశీల, అధిక సంఖ్యలో ఐకేపీ యానిమేటర్లు పాల్గొన్నారు. -
వేతనం ఇవ్వకపోగా వేధింపులా?
వీవోఏలకు అధికారుల బెదిరింపు మొబైల్ ఫోన్లు ఇచ్చేయాలని హుకుం కేసులు పెడతామని హెచ్చరిక భయపడబోమంటున్న బాధితులు ఇందిరా క్రాంతి పథంలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ (యానిమేటర్లు)కు 15 నెలలుగా కనీస గౌరవ వేతనం అందకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. పట్టెడన్నం పెట్టమని వారు అర్థిస్తుంటే... అరెస్టు చేయిస్తామంటున్నారు అధికారులు. దాదాపు 30 నుంచి 40 డ్వాక్రా సంఘాల కార్యకలాపాల సంపూర్ణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీరు పై అధికారులకు నివేదించాల్సి ఉంటుంది. నూజివీడు : తమకు రావాల్సిన కనీస గౌరవ వేతనాన్ని విడుదల చేసి కుటుంబాలను ఆదుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటూ తప్పనిసరి పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాలకు దిగిన వీవోఏలపై వెలుగు అధికారుల బెదిరింపులు ఉధృతమయ్యాయి. వారిని నయానో భయానో బెదిరించి ఎలాగోలా సమ్మెను విరమింపజేసేలా చేయాలని డీఆర్డీఏ అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండటంతో వారు వీవోఏలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. శాంతియుతంగా రిలే దీక్షలు చేసుకుంటున్న వీవోఏల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపకపోగా... కేసులు పెడతామంటూ వెలుగు అధికారులతో హెచ్చరికలు జారీ చేయించడం పలు విమర్శలకు దారితీస్తోంది. విధి నిర్వహణలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం వారికిచ్చిన మొబైల్ఫోన్లు వెంటనే ఇచ్చేయకపోతే పోలీసుస్టేషన్లో కేసు పెడతామంటూ ఏరియా కో-ఆర్డినేటర్లు, ఏపీఎంలు, సీసీలు తీవ్రంగా బెదిరిస్తున్నారని సమాచారం. నూజివీడులోని వెలుగు కార్యాలయంలో సోమవారం ఏరియా కో-ఆర్డినేటర్ మర్రి సునీతాలక్ష్మీ రిలేదీక్షలు చేస్తున్న వీవోఏలను పిలిచి సమ్మె చేస్తున్నందున మీకిచ్చిన మొబైల్ ఫోన్లను అప్పగించకపోతే మీపై కేసులు పెడతానంటూ హెచ్చరించారు. దీంతో వీవోఏలు సైతం ఆమెతో వాగ్వివాదానికి దిగారు. తమతో 15నెలలుగా పనులు చేయించుకుని వేతనాలు చెల్లించకపోతే ఎలాగని ప్రశ్నించారు. మేము న్యాయమైన సమస్యల పరిష్కారానికే సమ్మె చేస్తున్నామని బదులిచ్చారు. మైలవరం, నూజివీడు తిరువూరు, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం, జగ్గయ్యపేట తదితర అన్ని ప్రాంతాల్లోనూ వీవోఏలపై వెలుగు అధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. వీవోఏలు గ్రామైక్య సంఘాలకు సంబంధించిన పొదుపు వివరాలను, తీసుకున్న రుణాల వివరాలను మొబైల్ ద్వారా సెర్ఫ్‌కు పంపుతారు. అంతేగాకుండా ‘బంగారుతల్లి’ పథకానికి వివరాల సేకరణ, అభయహస్తం, ఆమ్‌ఆద్మీబీమాయోజన, జనశ్రీబీమా యోజన, వికలాంగుల గ్రూపు వివరాలు తదితర బాధ్యతలన్నీ వీవోఏలే నిర్వహిస్తుంటారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన పుస్తకాలు రాస్తున్నందున ప్రతి గ్రూపు నెలకు రూ.50 చొప్పున వీవోఏలకు చెల్లించాలని సెర్ఫ్ ఉన్నతాధికారులు సూచించినా... ఇదీ అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి గతేడాది ప్రభుత్వం నెలకు రూ.2వేల చొప్పున గౌరవవేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో పాటు రెండు నెలలకు సంబంధించిన గౌరవ వేతనం కూడా అందజేసింది. ఈ నేపథ్యంలో గౌరవ వేతనం వస్తుందన్న ఉద్దేశంతో గతేడాది ఆగస్టు నుంచి వీవోఏలు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటై మూడునెలలు గడచినా తమకు రావాల్సిన గౌరవవేతనం విడుదల చేయకపోవడంతో వీవోఏలు పలుమార్లు సమ్మెనోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో 15వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. దీంతో గ్రామైక్య సంఘాల పుస్తకాలతో పాటు వీరికి ఇచ్చిన మొబైల్ ఫోన్లు వీరిదగ్గరే ఉన్నాయి. వీరి సమ్మెను బలహీనం చేయడానికి గానూ మొబైల్ఫోన్లు ఇవ్వకపోతే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్యలతో కేసులు పెట్టిస్తామంటూ వెలుగు అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ వీవోఏలు ఏమాత్రం తాము భయపడేది లేదంటూ ఎక్కడికక్కడ పోరాటం కొనసాగిస్తున్నారు. -
మిల్లర్ల సంచిలో సర్కారు బియ్యం
►గాడి తప్పిన కస్టమ్ మిల్లింగ్ ►2,47,429 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వని మిల్లర్లు ► ప్రభుత్వ ధర ప్రకారం రూ.408 కోట్ల పైమాటే ►గడువు పొడిగింపునకు పౌరసరఫరాల శాఖ వినతి ముకరంపుర : జిల్లాలో 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లో కలిపి ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు (జీసీసీ) ద్వారా ప్రభుత్వ యంత్రాంగం 10,16,312 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. కస్టమ్ మిల్లింగ్ కోసం 600 మంది మిల్లర్లకు అప్పగించింది. 6,89,021 మెట్రిక్ టన్నుల బియ్యం మరపట్టించి రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయూల్సి ఉంది. కానీ.. 4,41,595 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,47,429 మెట్రిక్ టన్నులు మిల్లర్ల సంచుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే సేకరణ పూర్తికావల్సి ఉండగా... జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులేమో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ కోసం మరో రెండు నెలల గడువు కావాలని గురువారం ప్రభుత్వాన్ని కోరడం విశేషం. దాచిన బియ్యం విలువ రూ.408 కోట్లు వరిసాగు విస్తీర్ణం మన జిల్లాలో ఎక్కువ. అన్నదాతలు పండించే ధాన్యం ఆధారంగా అభివృద్ధి చెందాల్సిన రైస్‌మిల్లింగ్ పరిశ్రమ కొందరి లాభపేక్షతో పక్కదారిపడుతోంది. జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. మూడేళ్లుగా సర్కార్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారిపట్టిస్తున్నారు. 2013-14 సీజన్లో ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్‌లో 357 మంది మిల్లర్లకు, రబీలో 253 మంది మిల్లర్లకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం రెండు సీజన్లలో కలిపి ధాన్యం తీసుకున్న మిల్లర్లు 6,89,021 టన్నుల బియ్యాన్ని సెప్టెంబర్ 30వ తేదీలోగా పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. మిల్లర్ల జాప్యంపై ఇటీవలే పౌరసరఫరాల కమిషనర్ పార్థసారధి సమీక్షించారు. గడువులోగా బియ్యూన్ని అప్పగించాలని మిల్లర్లను ఆదేశించారు. అరుునా లాభం లేకుండా పోరుుంది. రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో సంబంధిత అధికారులూ వారికే వత్తాసు పలుకుతుండడంతో ఈ ప్రక్రియ మరింత జాప్యం జరుగుతోంది. భారత ఆహార సంస్థ మిల్లర్లకు ఇచ్చే బియ్యం ధర ప్రస్తుతం సగటున క్వింటాల్‌కు రూ.1600 ఉంది. ఈ ధర లెక్కన పరిశీలిస్తే మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్న బియ్యం విలువ దాదాపు రూ. 408 కోట్ల పైమాటే. మిల్లర్ల ‘ప్రైవేటు’ వ్యాపారం...:మిల్లర్లు తమ వద్ద దాచుకున్న బియ్యంతో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నారుు. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించారు. ఇందులో 2.56 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇప్పటివరకు 2.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యూన్ని అప్పగించగా మిగిలిన 3,000 టన్నులు (30 వేల క్వింటాళ్లు) బియ్యాన్ని 10 మంది మిల్లర్లు తమ వద్దే ఉంచుకున్నారు. గత సీజన్లో రైతుల నుంచి 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు 4.32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే అందజేశారు. ఇంకా 272 మంది మిల్లర్లు 2,47,429 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సర్కార్‌కు ఇవ్వలేదు. పౌరసరఫరాల శాఖ రుణం తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తే మిల్లర్లు వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సివిల్సప్లై సంస్థకు వడ్డీ భారం తప్పడంలేదు. -
మోతెలో పసుపు శుద్ధి కర్మాగారం
- నెరవేరనున్న కల - ప్రసంగంలో ప్రస్తావించిన గవర్నర్ - హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మోర్తాడ్ : పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న రైతుల కల నెరవేరనుంది. తెలంగాణ తొలి శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో మోతెలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. గవర్నర్ ప్రసంగంలో తమ గ్రామం పేరు రావడంతో మోతెకు ప్రాధాన్యత పెరిగిందని గ్రామస్తులు అంటున్నా రు. పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తే పసుపు రైతుల సమస్యలు తీరుతాయంటున్నారు. పసుపును ఉడికించి ఆరబెట్టిన తర్వాత శుద్ధి కోసం కర్మాగారానికి తరలించాల్సి ఉంది. పసుపును శుద్ధి చేసిన తర్వాత మార్కెట్‌కు తరలిస్తే ఆశించిన ధర లభిస్తుందని రై తులు పేర్కొంటున్నారు. రైతులు ఇప్పుడు పసుపును స్వ యంగా శుద్ధి చేస్తున్నారు. కర్మాగారంలో శుద్ధి చేస్తే నాణ్యత పెరుగుతుందని వారంటున్నారు. గతంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పసుపు శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఇందిరా క్రాంతి పథంలో నిధుల కొరత, అధికారుల్లో శ్రద్ధ లోపించడం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గతంలో మో తె గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఈ ప్రాంతంలో పసుపు పం ట ఎక్కువగా సాగు అవుతున్నందున గ్రామంలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ హామీకి కట్టుబడ్డారని, అందుకే గవర్నర్ ప్రసంగంలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు ఆంశాన్ని చేర్పించారని గ్రామస్తులు భావిస్తున్నారు. -
ఐకేపీ ఉద్యోగుల్లో ఆశలు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : వెట్టిచాకిరి తప్ప ప్రతిఫలం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఉద్యోగుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కొత్త ఆశలు రేపుతోంది. ఐకేపీ ఉద్యోగుల సంక్షేమం గురించి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించడంతో జిల్లాలోని సంబంధిత ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2001వ సంవత్సరంలో టీడీపీ హయాంలో వెలుగు పథకం పేరుతో మండలానికి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాలన్నింటినీ ఏకం చేశారు. ఆయా సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షి స్తూ మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వెలుగు పథకం ద్వారా కాంట్రాక్టు పద్ధతిన సిబ్బందిని నియమించారు. అప్పట్లో వెలుగు పథకం సిబ్బందికి అదిచేస్తాం..ఇదిచేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరకు చేసిందేమీ లేకుండా పోయింది. వెలుగు సిబ్బందికి ఏమీ చేయకపోగా టీడీపీ రాజకీయ సభలకు జనాన్ని తరలించేందుకు వారిని వాడుకున్నారు. పనిఒత్తిడి ఉన్నప్పటికీ సరిపడా సిబ్బందిని నియమించకుండా తక్కువ మందితో ఎక్కువ పని చేయిస్తూ ఇబ్బందిపెట్టారు. పనిఒత్తిడి తగ్గించి వేతనాలు పెంచిన వైఎస్ఆర్... 2004లో ముఖ్యమంత్రి అయిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. వెలుగు సిబ్బంది అనుభవిస్తున్న కష్టాలను గమనించారు. వెలుగు పథకాన్ని ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)గా మార్చి సరిపడా సిబ్బందిని నియమించి వారికి పనిఒత్తిడి తగ్గించారు. వేతనాలు పెంచడంతోపాటు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తింపు ఇచ్చారు. పొదుపు మహిళలకు, సంఘాలకు రుణాలు మంజూరు చేయించేందుకు, తిరిగి వసూలు చేయించేందుకు, మహిళలతో పొదుపు చేయించి ఆర్థికంగా వారు నిలదొక్కుకునేలా చూసేందుకు మాత్రమే ఐకేపీ ఉద్యోగులను వినియోగించి ఎంతో గౌరవించారు. త్వరలో రెగ్యులర్ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆయన ఆకస్మిక మరణంతో ఐకేపీ ఉద్యోగుల సంక్షేమం అటకెక్కింది. అనంతరం కాంగ్రెస్ పాలకులు ఐకేపీ ఉద్యోగుల పట్ల చంద్రబాబు విధానాలనే అమలుచేశారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తన రాజకీయ సభలకు జనాన్ని తరలించేందుకు ఐకేపీ ఉద్యోగులను ఉపయోగించారు. సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గతంతో పోలిస్తే మహిళా సంఘాలు పెరిగి పనిఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కొత్తగా సిబ్బందిని నియమించకపోగా, ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయకుండా, వేతనాలు పెంచకుండా ఐకేపీ ఉద్యోగులకు నరకం చూపిస్తున్నారు. దీంతో వారంతా ప్రస్తుతం నిస్సహాయస్థితిలో ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోతో ఉద్యోగుల్లో ఆనందం... ఐకేపీ ఉద్యోగులను దశలవారీగా రెగ్యులర్ చేస్తామని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించారు. కనీస వేతనాలు అమలుచేస్తామని, ఉద్యోగ భద్రత కల్పించి పనిభారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా కొత్తగా ప్రవేశపెట్టనున్న అమ్మ ఒడి పథకాన్ని నిర్వహించే బాధ్యతను ఐకేపీకే అప్పగిస్తామన్నారు. దీంతో ఐకేపీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై భరోసా లభించింది. జిల్లాలో ఐకేపీ పరిధిలో డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ సిబ్బంది కలిపి 450 మంది వరకూ ఉన్నారు. వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన భరోసాతో వారితో పాటు వారి కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సంక్షేమం గురించి పట్టించుకునే జననేతకే తమ ఓటని వారంతా స్పష్టం చేస్తున్నారు. -
రికవరీ హుళక్కేనా?
‘ఐకేపీ’ బాధితుల గగ్గోలు లెక్క తేల్చింది రూ.51.15 లక్షలు స్వాహా సొమ్ము రూ. 90 లక్షలు? దర్జాగా తిరుగుతున్న స్వాహారాయుడు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : బందరు మండలంలో ఇందిరా క్రాంతి పథంలో చోటుచేసుకున్న సొమ్ముస్వాహాకు సంబంధించిన నిధుల రికవరీలో సంబంధిత ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసిన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తమ పని అయిపోయిందనిపించారు. నిధుల స్వాహాలో కీలకసూత్రధారి చుట్టం చూపుగా జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. లక్షలాది రూపాయల సొమ్ము స్వాహా జరుగుతున్నట్లు తెలిసినా పై అధికారులకు సమాచారం అందించలేదని బందరు మండల ఇందిరాక్రాంతిపథం ఏపీవో ఉద్దండి వీరరాఘవయ్యను, మరో మహిళా ఉద్యోగిని అధికారులు ఈనెల 10వ తేదీ ఉద్యోగం నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఇందిరా క్రాంతి పథం సొమ్ము పక్కదారి పడుతున్న విషయంపై గత ఏడాది జనవరి నెలలో సాక్షి ‘‘అమ్ ఆద్మీ బీమా సొమ్ము స్వాహా’’ అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించడంతో అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి విచారణకు ఆదేశించారు. దాదాపు తొమ్మిది నెలల పాటు విచారణ జరిపారు. ఈ విచారణలో బందరు మండలంలో ఆమ్ఆద్మీ బీమా యోజన పథకంలో రూ. 51.15 లక్షల సొమ్ము స్వాహా జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే వాస్తవంగా స్వాహా జరిగిన సొమ్ము రూ. 90లక్షలకు పైగానే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. స్వాహా జరిగిన సొమ్ము మొత్తాన్ని లెక్కల్లో చూపారా లేదా అనే ప్రశ్నలు ఇందిరా క్రాంతి పథం సిబ్బంది నుంచే వ్యక్తమవుతున్నాయి. నిధుల స్వాహాపై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షేక్ వహీదున్నీసా గతేడాది నవంబరు 5వ తేదీన ఫిర్యాదు చేశారు. మండల సమాఖ్యకు వచ్చిన నగదును బందరు మండలంలో ఐకేపీ విభాగం లో ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఎం.జీవన్‌బాబు తన సొంత ఖాతాలోకి మార్చుకుని నిధులు స్వాహా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ చేసిన పోలీసులు జీవన్‌బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్‌పై వచ్చాడు. ఎలా జరిగిందంటే.... బందరు మండలం ఇందిరా క్రాంతి పథంలో ఎకౌంటెంట్‌గా పనిచేసిన జీవన్‌బాబు మండల సమాఖ్యకు వచ్చిన నిధులను ఇండియన్ బ్యాంకులో తన పేరుతో ఉన్న ఖాతాకు మార్చుకున్నాడు. బతికి ఉన్న వారిని చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేయడమే కాకుండా...వాస్తవంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తెలియకుండా వేరే వ్యక్తులతో సంతకాలు చేయించి అమ్ ఆద్మీ బీమా సొమ్ము లక్షలాది రూపాయలు డ్రా చేసుకున్నాడు. బందరు మండల ఇందిరా క్రాంతి పథంలో జరుగుతున్న అక్రమాలపై అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి విచారణాధికారిగా ఏపీడీ శ్రీధర్‌రెడ్డిని నియమించారు. దీంతో తీగలాగితే డొంక కదిలింది. మండల ఇందిరా క్రాంతి పథం ఎకౌంటెంట్ జీవన్‌బాబు 2012 సెప్టెంబరు 13వ తేదీన రూ. 6.30 లక్షలు, 2013 జనవరి 11వ తేదీన రూ. 6.25 లక్షలు, మార్చి 18వ తేదీ రూ. 8.60 లక్షలు, ఏప్రిల్ 13వ తేదీన రూ. 13.50 లక్షలు, మే 4వ తేదీన రూ. 4 లక్షలు, జూన్ 6వ తేదీన రూ. 3.50 లక్షలు, ఆగష్టు 7వ తేదీన రూ. 2 లక్షలు డ్రా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఉన్నతాధికారుల విచారణలోనూ జీవన్‌బాబు తాను నిధులు దిగమింగినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఇన్ని ఆధారాలు ఉన్నా, సొమ్ము స్వాహ జరిగినట్లు రుజువులున్నా అధికారులు ఇప్పటి వరకు ఒక్క రూపాయి రికవరీ చేసే ప్రయత్నమే చేయలేదనే ఆరోపణలున్నాయి. మహిళా సమాఖ్య సభ్యులకు మంజూరైన దాదాపు లక్షలాది రూపాయలు స్వాహా జరిగి వందలాది మంది అన్యాయానికి గురైనా అధికారులు సొమ్ము రికవరీ కోసం ప్రయత్నాలు చేయడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వాహా అయిన సొమ్మును రికవరీ చేసే అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
‘స్త్రీశక్తి’కి గూడుగోడు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: మహిళల కోసం అనేక అభివృద్ధి పథకాలు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఆచరణలో ఘోరంగా విఫలమవుతున్నారు. మహిళల సాధికారత ఎండమావిగానే మారుతోంది. జిల్లాలో 56 మండల సమాఖ్యలు, వీటి పరిధిలో 47,400 గ్రూపులున్నాయి. వీటిలో 5 లక్షలకు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరు కనీసం కూర్చోవడానికి స్థలం కూడా లేని పరిస్థితి జిల్లాలో ఉంది. ఈ భవనాల్లోనే జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఇందిరా క్రాంతి పథం సిబ్బంది కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయాలి. జిల్లాలోని మహిళలకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, వారి సమస్యలను చర్చించుకోవడానికి ప్రతి మండల పరిధిలోని మండల సమాఖ్యలకు స్త్రీ శక్తి భవనాలు నిర్మించాలని 2010 వ సంవత్సరంలో నిర్ణయించారు. ఈ మేరకు 2011లో శిలాఫలకాలు వేశారు. 2014 వచ్చినా ఇప్పటి వరకూ కేవలం 2 భవనాలు మాత్రమే పూర్తి అయి ప్రారంభానికి నోచుకున్నాయి. స్త్రీశక్తి భవనాల తీరుతెన్నులపై ‘న్యూస్‌లైన్’ బృందం శనివారం జిల్లావ్యాప్తంగా పరిశీలించింది. స్త్రీ శక్తి భవనాల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. చాలాచోట్ల శిలాఫలకాలే దర్శనమిస్తున్నాయి. 56 మండలాలకు గాను 52 మండలాల్లో స్త్రీ శక్తి భవనాలకు అనుమతులు వచ్చాయి. వాటిలో 34 భవనాలకు నిధులు విడుదలయ్యాయి. ఇందులో 18 భవనాలకు నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. మూడేళ్ల క్రితం అంచనా వేసిన నిర్మాణ వ్యయం ప్రస్తుతం భారీగా పెరిగిపోయింది. అద్దంకి నియోజకవర్గంలో భవనాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చీరాల నియోజకవర్గ పరిధిలోని చీరాల మండలంలో గత 27 నెలల నుంచి నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. వేటపాలెంలో నిధులు లేక పనులు మొదలు కాలేదు. దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల పరిధిలో భవనాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరయ్యాయి. అయితే ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాలేదు. కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 12 భవనాలు మంజూరయ్యాయి. ఆరు భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్త్రీ శ క్తి భవనాల నిర్మాణానికి నిధులు సరిపోకపోవడంతో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో కొన్నిచోట్ల నిర్మాణ పనులు మొదలు కాలేదు. మరికొన్నిచోట్ల బిల్లులు సకాలంలో అందించక పనులు నిలిచిపోయాయి. కనిగిరి నియోజక వర్గ పరిధిలో కనిగిరిలో మినహా మిగిలిన 5 మండలాల్లో స్త్రీశక్తి భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. నిధుల జాప్యంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల గడచినా పూర్తిస్థాయి నిర్మాణాలు జరగలేదు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలో ఒక్క భవనం కూడా నిర్మాణ దశలో లేదు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో కొన్నిచోట్ల నిధులు మంజూరైనా నిర్మాణ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల నిర్మాణం ప్రారంభమైనప్పటికీ ఇంకా పూర్తి చేయలేదు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో నిధులు మంజూరైనా అధికారుల మధ్య సమన్వయం లేక ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల అనువైన స్థలం లేదని, మరోచోట నిధులు చాలవని నిర్మాణాలు చేపట్టలేదు.