కదం తొక్కిన యానిమేటర్లు
- కలెక్టరేట్ ముట్టడి
- 300 మంది అరెస్టు, విడుదల
విశాఖపట్నం : ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) యానిమేటర్లు బుధవారం కలెక్టరేట్ ఎదుటు కదం తొక్కారు. 15 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యానిమేటర్లపై రాజకీయ వేధింపులు, అధికారుల తొలగింపులు ఆపాలని, గుర్తింపు కార్డులు, నియామకపత్రాలు ఇవ్వాలని ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ గేటు వద్ద నినాదాలు చేస్తూ బైఠాయించారు.
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ పది రోజులుగా ఐకేపీ యానిమేటర్లు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నిత్యం మహిళా ఉద్ధరణపై ఉపన్యాసాలు చేస్తున్న సీఎం చంద్రబాబు మహిళలచేత వెట్టిచాకిరీ చేయించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వీరి పోరాటానికి, న్యాయమైన సమస్యల పరిష్కారానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.
జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ యానిమేటర్లకు అభయ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా అధ్యక్షురాలు దాక్షాయిణి, సీఐటీయూ వర్కింగ్ కమిటీ కన్వీనర్ అరుణ, ఐకేపీ జిల్లా కార్యదర్శి, ఆర్. రామసుశీల, అధిక సంఖ్యలో ఐకేపీ యానిమేటర్లు పాల్గొన్నారు.