టార్పాలిన్.. సొమ్ము తినేసెన్
* రూ.42 లక్షలకు రెక్కలు
* అస్మదీయుల కోసం అధికారుల ఆరాటం
ఏలూరు సిటీ : ఒక వస్తువు కొనాలంటే ఎవరైనా ఏం చేస్తారు. ఆ వస్తువు ధర ఏ దుకాణంలో ఎంత ఉందో వాకబు చేస్తారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో చూస్తారు. అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. అత్తసొమ్ము అల్లుడి దానం చేసిన చందంగా ఏకంగా రూ.42 లక్షలను తమ వారి జేబుల్లో వేసేందుకు సిద్ధమైపోయారు.
ఇదీ అవినీతి అసలు కథ
ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఆయా కేంద్రాలకు ప్లాస్టిక్ టార్పాలిన్స్ సమకూర్చాలని నిర్ణయించింది. ఇక్కడే అధికారులు తమ చేతివాటాన్ని పక్కాగా ప్రదర్శించారు. మార్కెట్లో నాణ్యమైన ప్లాస్టిక్ టార్పాలిన్ రూ.4,200కు లభిస్తోంది. అధికారులు మాత్రం ఏకంగా దానిధర రూ.5,500కు కోట్ చేసిన టెండరుదారుడికి కాంట్రాక్టు కట్టబెట్టారు. గతంలోనూ ఇంతకంటే తక్కువ ధరకే ఓ కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేయగా, కుదరదని చెప్పి దాన్ని రద్దు చేశారు. అస్మదీయులకు కట్టబెట్టేందుకే తొలి టెండర్‌ను రద్దుచేసి రెండోసారి టెండర్లు పిలిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 3,264 ప్లాస్టిక్ టార్పాలిన్స్ అవసరం ఉంది. ఇది ఒక్కొక్కటి 129 సైజులో ఉండాలని నిర్దేశించారు. నాణ్యతతో కూడిన ఈ సైజు టార్పాలిన్ ధర మార్కెట్లో రూ.4,200 ఉంది. వీటి కొనుగోలు కోసం సివిల్ సప్లైస్, మార్కెటింగ్, తూనికలు-కొలతలు, డీఆర్‌డీఏ అధికారుల ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. అక్టోబర్ 30న తొలిసారి టెండర్లు పిలవగా 10 మంది కాంట్రాక్టర్లు దరఖాస్తులు దాఖలు చేశారు.
ఒంగోలుకు చెందిన ఓ కాంట్రాక్టర్ ఒక్కో ప్లాస్టిక్ టార్పాలిన్‌కు రూ.4,908 ధర కోట్ చేస్తూ టెండర్ సమర్పించారు. అధికారులు ఆ ధర అధికమంటూ దానిని రద్దు చేశారు. ఈనెల 11న మరోసారి టెండర్లు పిలవగా, ఐదుగురు దరఖాస్తులు సమర్పించారు. వారిలో యూనివర్సల్ ట్రేడర్స్ ఒక్కో ప్లాస్టిక్ టార్పాలిన్‌ను రూ.4,600కు, అమలాపురానికి చెందిన రుద్ర ఏజెన్సీస్ రూ.5,500కు సరఫరా చేస్తామని షెడ్యూల్‌లో పేర్కొన్నాయి. అయితే, అధికారులు రూ.5,500 ధరను కోట్ చేసిన రుద్ర ఏజెన్సీస్ టెండర్‌ను ఆమోదించారు.
మార్కెట్‌లో రూ.4200లకే దొరుకుతున్న టార్పాలిన్‌ను కాంట్రాక్టర్ నుంచి రూ.5,500కు కొనేందుకు నిర్ణయించడం ద్వారా ఒక్కో టార్పాలిన్‌పై అదనంగా రూ.1,300 చొప్పున రూ.42 లక్షలను గోల్‌మాల్ చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీనిపై మార్కెటింగ్ ఏడీ కిషోర్‌ను వివరణ కోరగా, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ఆధారంగా వాటర్ ప్రూఫ్ టార్పాలిన్ కావాలని సివిల్ సప్లైస్ అధికారులు చెప్పారన్నారు. జిల్లా అధికారుల సమక్షంలో టెండర్ల ప్రక్రియను నిర్వహించామని, ఇందులో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని పేర్కొన్నారు.