లంచం ఇవ్వలేదని రూ.40లక్షల బిల్లులు ఆపేశారు...వడ్డీలు పెరిగిపోతున్నాయి
గ్రీవెన్స్‌లో ఐదుసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు
అలాంటప్పుడు ఎందుకు మీరు వినతులు స్వీకరించడం
పిఠాపురంలో కలెక్టర్‌ను నిలదీసిన కాంట్రాక్టర్
బయటకు గెంటేసిన పోలీసులు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్‌లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు.
కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్‌ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment