వాల్తేరులో వణుకు | Cbi caught Walther Divisional Railway Manager Saurabh Kumar Prasad | Sakshi
Sakshi News home page

వాల్తేరులో వణుకు

Published Mon, Nov 18 2024 6:02 AM | Last Updated on Mon, Nov 18 2024 6:02 AM

Cbi caught Walther Divisional Railway Manager Saurabh Kumar Prasad

లంచాలకు అలవాటుపడిన డీఆర్‌ఎం? 

ప్రతి టెండర్‌కు పచ్చనోటు ఇవ్వాల్సిందే 

రెండేళ్ల నుంచి డీఆర్‌ఎంపై నిఘా పెట్టిన సీబీఐ 

ఆది నుంచీ లంచాల ఆరోపణలే.. 

సరైన సమయం కోసం ఎదురు చూసిన వైనం 

సీబీఐ విసిరిన వలలో చిక్కుకున్న సౌరభ్‌కుమార్‌ 

ఉలిక్కిపడిన డీఆర్‌ఎం వ్యవహారాల్ని చూసే ఉద్యోగులు 

సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్‌ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్‌..?’’..  రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్‌ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్‌.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్‌ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. 

వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌కుమార్‌ ప్రసాద్‌.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్‌ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్‌ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్‌ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. 

రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! 
వాస్తవానికి.. సీబీఐతో డీఆర్‌ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్‌ఎంగా రాకమునుపు సెంట్రల్‌ రైల్వే జోన్‌లో ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. 

అనంతరం నిర్వహించిన సోదాల్లో  రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్‌ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. 

వైజాగ్‌ నుంచి ఫాలో చేస్తూ.. 
టెండర్‌ పాస్‌ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్‌ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్‌ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

అక్కడ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్‌ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్‌ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

ఎంతిచ్చినా ఓకే.?? 
లంచం వ్యవహారంలో సౌరభ్‌ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్‌ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్‌ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్‌ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. 

టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్‌ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్‌ఎం అండ్‌ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. 

విశాఖ రైల్వే పరువు తీసేశారు.! 
వాల్తేరు డివిజన్‌ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్‌ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్‌ సత్పతి, చేతన్‌కుమార్‌ శ్రీవాత్సవ్‌.. డివిజన్‌ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. 

ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్‌ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్‌ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఆ ఇద్దరిలో టెన్షన్‌ 
డీఆర్‌ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్‌లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్‌ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement