bribery
-
క్యాడర్‌ను బట్టి లంచం!
సాక్షి, అమరావతి: ప్రసూతి సెలవుల ఆమోదం కోసం రూ.10 వేలు తీసుకున్నారని ఓ మహిళా వైద్యురాలు... రూ.4 వేలు లంచం ఇస్తే గానీ ఎస్ఆర్ నమోదు చేయలేదని మరొక మెడికల్ ఆఫీసర్... రూ.10 వేలు ముట్టజెప్పాకే ప్రొబేషన్ డిక్లరేషన్(రెగ్యులరైజేషన్) చేశారని ఇంకొకరు... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతిపై మెడికల్ ఆఫీసర్ (ఎంవో)లు అధికారిక వాట్సాప్ గ్రూప్‌లోనే తమ ఆవేదనను వ్యక్తంచేయడం వైద్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తంచేస్తూ మాట్లాడిన ఆడియో మెసేజ్ శుక్రవారం వైద్యశాఖ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా క్యాడర్, పనిని బట్టి డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో రేట్లు ఖరారు చేసి లంచాలు వసూలు చేస్తున్నారని ఆ వైద్యుడు చెప్పారు. ఆఖరికి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద పని చేసే చిరుద్యోగులను సైతం లంచాల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా తాము తీసుకుంటున్న ప్రతి రూపాయిలో కొంత డీహెచ్ కార్యాలయానికి ముట్టజెప్పాలని జిల్లా కార్యాలయాల్లో చెబుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో మంతనాలు! తన కార్యాలయ అవినీతి తంతు బట్టబయలు కావడంతో ఉలిక్కిపడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ డీఎంహెచ్‌వో... కొందరు మెడికల్ ఆఫీసర్లను తన కార్యాలయానికి పిలిపించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. తనకు తెలియకుండానే కింది స్థాయి ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇకపై అలా జరగకుండా చూస్తానని డీఎంహెచ్‌వో బతిమిలాడినట్లు సమాచారం. అదేవిధంగా వసూలు చేసిన ప్రతి రూపాయిని తిరిగి చెల్లించేలా చూస్తానని, ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని ప్రాథేయపడినట్లు తెలిసింది. మెడికల్ ఆఫీసర్లు సైతం పీహెచ్‌సీల వారీగా అవినీతి వ్యవహారంపై ఫిర్యాదులు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీఎంహెచ్‌వో కార్యాలయం అవినీతిపై ఎంవోలు జిల్లా స్థాయి అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్‌లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగినా... ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు తేలికగా తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘సోలార్’ లంచాలు.. ఊహాగానాలే
సాక్షి, అమరావతి: ‘‘అదానీ’’ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు ‘అదుగో పులి అంటే.. ఇదుగో తోక!’ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా న్యాయశాఖ (డీఓజే) నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదని.. లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోందన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన 1, 5వ నేరారోపణల్లో అదానీ గానీ ఆయన మేనల్లుడు పేర్లు గానీ లేనే లేవని చెప్పారు. ‘ఎఫ్‌సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లోగానీ.. న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోగానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వారు తెరపైకి తెచ్చారు. కీలకమైన ఈ రెండు నేరారోపణల్లో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదని.. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ అని.. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘డీఓజే’ నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ఈ కేసులో న్యాయపరమైన అంశాలను విశ్లేషించిన న్యాయ కోవిదులు చెబుతున్నారు. -
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. వరుసగా నాలుగో రోజు శనివారం ఏడీఆర్ఎం పేషీలో ఉద్యోగులు, అధికారులను సీబీఐ బృందం విచారించింది. డీఆర్ఎం అనధికార వ్యవహారాలను పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగులపై సీబీఐ ఆరా తీసింది. ప్రొటోకాల్–స్పోర్ట్స్ విభాగంలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ఒకరు డీఆర్ఎం వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఫైళ్ల లావాదేవీలు పూర్తి చేసే విషయంలో ముందుగా సదరు ఉద్యోగితో సంప్రదింపులు జరిగేవి.ఎవరైనా విదేశీ కరెన్సీ లంచంగా ఇస్తే అతనే వాటిని మార్పిడి చేసేవారని సమాచారం. ఈ విషయాలపైనా సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదేవిధంగా డీఆర్ఎం అక్రమ వ్యవహారాలను దగ్గరుండి చక్కబెట్టే ఒక గ్రూప్–4 ఉద్యోగి పాత్రపైనా సీబీఐ అధికారులు అనుమానాలు వ్యక్తం చేసి విచారించారు. మొత్తం మెకానికల్, ఇంజినీరింగ్, మెడికల్‌తోపాటు 8 విభాగాల ఉద్యోగులను ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రశ్నించారు. అనంతరం ‘కేసు దర్యాప్తులో ఉంది.గత డీఆర్ఎం సౌరభ్‌కుమార్ ప్రసాద్ ఆమోదించిన, ఆమోదించబోయే ఫైళ్లను ఎవరూ కదిలించొద్దు. మేం ఈ నెల 27 తర్వాత వచ్చి పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం చెబుతాం’ అని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డీఆర్ఎం లంచాల వ్యవహారంలో ఓ సీనియర్ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు అధికారిని కూడా విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. కొన్ని ఫైళ్లు స్వాదీనంఈ కేసులో ఇప్పటికే డీఆర్ఎం కార్యాలయంతోపాటు విశాఖ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న డీఆర్ఎం బంగ్లాలోను సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లు స్వా«దీనం చేసుకున్నారు. డీఆర్ఎం లంచం తీసుకుంటూ దొరకడానికి కారణమైన సంస్థలతోపాటు ఇంకా ఏ సంస్థలకైనా అనుకూలంగా టెండర్లలో మార్పులు చేయడం, పెనాల్టీ తగ్గించడం వంటి వ్యవహారాలకు పాల్పడి ఉండవచ్చని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ప్రతి టెండర్ ఫైల్‌ను పరిశీలించాలని నిర్ణయించారు. సౌరభ్‌కుమార్ వాల్తేరు డీఆర్ఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏయే ఫైళ్లపై సంతకాలు చేశారన్న విషయాలపై పూర్తిస్థాయిలో ఈ నెల 27వ తేదీ తర్వాత దర్యాప్తు చేయనున్నారు. -
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్‌కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్ సత్పతి, చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
అన్నీ పొలిటికల్ బదిలీలే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. ఎమ్మెల్యేల సిఫారసు లేకుండా ఏ ఉద్యోగి, ఏ అధికారి కూడా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఏ నియోజకవర్గంలోని కార్యాలయంలోనైనా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు చెప్పిన వారిని నియమించాలని కలెక్టర్లకు కూడా అనధికారికంగా ఆదేశాలు వెళ్లాయి. సీనియారిటీ, ప్రతిభను కూడా పక్కన పెట్టి కేవలం సిఫారసుల ఆధారంగానే బదిలీలు జరపాలని ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులకు స్పష్టంగా చెప్పారు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి వారే పోస్టింగులు ఇచ్చేస్తున్నారు. నచ్చిన వారికి, ముడుపులిచ్చిన వారికి మాత్రమే సిఫారసు లేఖలు ఇస్తున్నారు. బదిలీల ప్రక్రియ మొదలైన తర్వాత ఇలా లక్షకుపైగా సిఫారసు లేఖలు ఎమ్మెల్యేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే కనీసం 150 సిఫారసు లేఖలు ఇచ్చారని, కొందరు 250 నుంచి 300 లేఖలు కూడా ఇచ్చారని సమాచారం. జిల్లాకు సగటున 4 వేల సిఫారసు లేఖలు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో 5 వేలకు పైగా సిఫారసు లేఖలు రావడంతో ఉన్నతాధికారులే విస్తుపోతున్నారు. బదిలీల్లో ఇంతటి రాజకీయ జోక్యం, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎప్పుడూ చూడలేదని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీతో బదిలీల గడువు ముగిసినప్పటికీ, పెద్ద ఎత్తున వస్తున్న ఒత్తిళ్లతో ఇప్పటికీ బదిలీలు చేస్తూనే ఉన్నారు. చాలా జిల్లాల్లో పాత తేదీలు వేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అనధికారికంగా వచ్చే నెల 2వ తేదీ వరకు బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.‘దక్షిణ’ ఇస్తే ‘దమ్మున్న’ పోస్టింగ్ నియోజకవర్గాలోని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లను గుప్పిట్లో ఉంచుకునేలా ఎమ్మెల్యేలు అనువైన వారిని గుర్తించి సిఫారసు లేఖలు ఇచ్చారు. ఎక్కువ ముడుపులు ఇచ్చిన వారికి ఫోకల్ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇప్పించారు. కుల ప్రాతిపదికన కూడా చాలామందికి సిఫారసు చేశారు. ఇందుకోసం అప్పటికే అక్కడ పని చేస్తున్న వారిని బలవంతంగా లూప్లైన్లోకి, అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయించారు. కొందరు ఉద్యోగులపై రాజకీయ ముద్ర వేసి మరీ పక్కన పెడుతున్నారు. కొన్నిచోట్ల బదిలీల జాబితాలో ఉన్న పేర్ల పక్కన టీడీపీ, వైఎస్సార్సీపీ, తటస్థం అని రాశారు. టీడీపీకి అనుకూలమైన వారికే నియోజకవర్గాల్లో పోస్టింగ్‌కి అనుమతిస్తున్నారు. లేకపోతే లూప్లైన్లోకి పంపించేస్తున్నారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కూడా తమ వారినే నియమించుకుంటున్నారు. నిబంధనలు బేఖాతరు బదిలీల్లో నిబంధనలను అసలే పట్టించుకోవడంలేదు. తహశీల్దార్లను సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయకూడదనే నిబంధనను అన్ని చోట్లా తుంగలో తొక్కారు. కాగితాలపై ఆ నియోజకవర్గం కాదని చూపించి మరీ సొంత నియోజకవర్గాలకు బదిలీ చేయించుకుంటున్నారు. ఇదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పనిచేస్తున్న తహశీల్దార్ తన సొంత నియోజకవర్గమైన భీమవరం వేయించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చినా అధికారులు కాదనలేని పరిస్థితి నెలకొంది. తాడేపల్లిగూడెం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్‌పై ఏసీబీ కేసు ఉన్నా ప్రధానమైన పోస్టు కోసం అక్కడి ఎమ్మెల్యే సిఫారసు లేఖ ఇచ్చారు. ఎమ్మెల్యేల లేఖలను తప్పనిసరిగా ఆమోదించాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉన్నందున నిబంధనలకు విరుద్ధమైన వారికి కూడా పోస్టింగ్‌లు ఇవ్వక తప్పడంలేదని అధికారులు చెబుతున్నారు. -
కట్టలిచ్చినోళ్లకే కట్టబెట్టారు
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి. నిబంధనలు, మార్గదర్శకాలు, సీనియారిటీ, మెరిట్ జాబితాలన్నింటినీ పక్కనపెట్టి నోట్లకట్టలు ముట్టజెప్పిన వారికే కోరుకున్న పోస్టింగ్‌లు కట్టబెట్టారు. పోస్టింగ్‌ల జాబితాను ముందే తయారు చేసుకుని.. కౌన్సెలింగ్ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.రాష్ట్రంలోని సుమారు 25 ప్రధాన సెంటర్లకు ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారం వారు చెప్పిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇచ్చినట్టు సమాచారం. మిగిలిన ప్రాధాన్య పోస్టులన్నింటినీ నాలుగు జోన్లలో కొందరు ఉన్నతాధికారులే బేరం కుదుర్చుకుని అమ్మేసినట్టు రిజిస్ట్రేషన్ల శాఖలో గుప్పుమంటోంది. సీనియారిటీ జాబితాలో టాప్ టెన్‌లో ఉన్న వారికి సైతం కోరుకున్న ప్రదేశంలో పోస్టింగ్ దక్కలేదు. ఆదివారం కౌన్సెలింగ్ జరిగిన నాలుగు చోట్లలో విశాఖ, ఏలూరులో రెండుచోట్ల కొద్దిపాటి గందరగోళం నెలకొన్నట్టు తెలిసింది. ఫార్సుగా కౌన్సెలింగ్ సాధారణంగా వివిధ అంశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్లకు వచ్చిన మార్కులు, మెరిట్ ప్రకారం బదిలీ జాబితా తయారు చేయాలి. దాని ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో ముందున్న వారిని పిలిచి వారికి కావాల్సిన పోస్టింగ్‌లు ఇవ్వాలి. జాబితాలో మొదట ఉన్న వ్యక్తికి అతను కోరుకున్నచోట మొదట పోస్టింగ్ ఇవ్వాలి. కానీ.. మొదటి వ్యక్తికి అడిగిన ఏ సెంటర్ ఇవ్వలేదు. ఆ సెంటర్‌కి ప్రభుత్వం వేరే వాళ్లని రికమండ్ చేసిందని, అది ఖాళీ లేదని చెప్పి ఫోకల్ పోస్టులను తప్పించేశారు. మెరిట్లో మొదట ఉన్న వారికి సైతం ఉన్నతాధికారులు తమకు నచ్చిన ప్రదేశంలో పోస్టింగ్ ఇస్తామని చెప్పి అక్కడే ఖాళీ ఆప్షన్ ఫారంపై సంతకం చేయించుకున్నారు. కొందరికైతే ఇస్తామని చెప్పిన చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి అర్ధరాత్రి మరోచోటకు మార్చి ఇచ్చారు. ఆ పోస్టుకు ఎవరైనా ఎక్కువ డబ్బు ఇస్తామని ముందుకొస్తే వారికి అక్కడికక్కడే పోస్టింగ్ ఖరారు చేశారు. ముందే ఖాళీ ఆప్షన్ ఫారం తీసుకోవడంతో అధికారులకు నచ్చిన చోట పోస్టింగ్ ఇస్తున్నట్టుగా రాసుకున్నట్టు తెలిసింది. అదేమని అడిగితే నీ మీద ఏసీబీ కేసులున్నాయి, ఛార్జి మెమోలు ఉన్నాయంటూ బెదిరించారు. మరోవైపు బేరం కుదుర్చుకున్న వారిపై ఏసీబీ కేసులున్నా.. వారికి ఏ గ్రేడ్ సెంటర్లలో పోస్టింగ్‌లు కట్టబెట్టడం గమనార్హం.గడువు ముగిసినా కౌన్సెలింగ్నిజానికి 22వ తేదీతో బదిలీల గడువు ముగిసింది. సబ్ రిజిస్ట్రార్ల బదిలీల కౌన్సెలింగ్‌ను ఆదివారం రాత్రంతా నిర్వహించారు. సూపరింటెండ్ంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్‌ను 23వ తేదీ సాయంత్రం వరకూ నిర్వహిస్తూనే ఉన్నారు. అంటే పాత తేదీ వేసి ఈ బదిలీల ఆర్డర్లు ఇవ్వనున్నారు. దీన్నిబట్టి బదిలీలు ఎంత చక్కగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు.రూ.2 కోట్లకు పటమట.. మధురవాడఅందరి కంటే జూనియర్, ఏసీబీ కేసున్న రేవంత్‌కి విజయవాడ పటమట సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. 93 మంది జాబితాలో ఆయన పేరు 50 మంది తర్వాతే. అయినా ఆయనకు రాష్ట్రంలోనే కీలకమైన పటమట పోస్టింగ్ దక్కింది. దీని విలువ రూ.2 కోట్లుగా ప్రచారం జరుగుతోంది. చినబాబు సిఫారసుతో ఆయన ఈ హాట్ సీటును దక్కించుకున్నట్టు తెలిసింది. విశాఖ నగరంలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ పోస్టును అదే రేటుకు అర్హత లేని వ్యక్తికి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. సబ్ రిజి్రస్టార్ ఆఫీసులను ఆదాయాన్ని బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజిస్తారు. ఒకసారి ఏ సెంటర్లో చేసిన వాళ్లకి మరుసటి దఫా బదిలీల్లో ఏ గ్రేడ్ ఇవ్వకూడదు. కానీ.. ప్రస్తుత బదిలీల్లో ఈ నిబంధనను పూర్తిగా పక్కనపెట్టేశారు. ఏసీబీ కేసులున్న వారికి సైతం ముడుపులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చేశారు. సుమారు 7 ఛార్జి మెమోలు ఉండటం వల్ల ఏ గ్రేడ్‌కి అర్హత లేని వ్యక్తికి రాజమండ్రి జాయింట్–2 సబ్ రిజి్రస్టార్‌గా పోస్టింగ్ ఇచ్చారు. సి గ్రేడ్ సెంటర్లో పోస్టింగ్ ఇవ్వాల్సిన వ్యక్తికి డబ్బులు తీసుకుని ఏ గ్రేడ్ సెంటర్ ఇచ్చారు. రాజమండ్రి–1 సెంటర్‌కి పోస్టింగ్ లభించిన సబ్ రిజి్రస్టార్కి అందరికంటే తక్కువ మార్కులు రావడంతో ఆయన పేరు జాబితాలో ఆఖరున ఉంది. గత మూడు సార్లుగా ఏ గ్రేడ్‌లో పనిచేసిన ఆయనకు మళ్లీ ఏ సెంటర్ ఇవ్వడం విశేషం. కంకిపాడు పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లుకు ఏ గ్రేడ్ అర్హత లేకపోయినా ఇచ్చేశారు. ఇటీవల అగ్రి గోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ కేసులో ఉన్న నున్న సబ్ రిజిస్ట్రార్‌ని బదిలీ చేయకపోవడాన్ని బట్టి ఈ బదిలీలు ఎంత గొప్పగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. గుణదల బదిలీ అయిన నందీశ్వరరావు అంతకుముందు ఏ గ్రేడ్ చేసినా మళ్లీ ఏ గ్రేడ్ ఇచ్చారు. గాంధీనగర్–1, 2 సబ్ రిజిస్ట్రార్లకు ఏ సెంటర్లు ఇవ్వకూడదని తెలిసినా ఇచ్చేశారు. నిబంధనలు, అర్హతలతో పనిలేకుండా సబ్ రిజి్రస్టార్ల బదిలీలు జరిగాయనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా ఉన్నాయి. -
చెక్ పోస్టుల వద్ద అవినీతికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: ‘సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే చాలు.. అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిలపాలి.. అనుమతులు తీసుకోవాలి.. అందుకోసం లంచాలు ఇవ్వాలి’. ఇదీ దశాబ్దాలుగా సరిహద్దుల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఇటువంటివాటికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద లంచాల బెడదను శాశ్వతంగా నిర్మూలించింది. రవాణా శాఖ అందించే అన్ని రకాల సేవలు, అనుమతుల జారీని ఆన్లైన్ విధానంలోకి మార్చింది. అంతేకాదు రాష్ట్రంలోని 15 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను శాశ్వతంగా తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. అనుమతులన్నీ ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో దశాబ్దాల నుంచి 15 రవాణా శాఖ చెక్ పోస్టులున్నాయి. వాటిలో 13 రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయి. మిగిలిన రెండింటిలో ఒకటి తిరుపతి జిల్లా రేణిగుంటలోనూ, మరొకటి కాకినాడ జిల్లా తేటగుంటలోను ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి ప్రవేశించే వాహనాల నుంచి పన్ను వసూలు, తాత్కాలిక పర్మిట్ జారీలతోపాటు మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ అనుమతుల జారీ పేరుతో అక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేయడం సర్వసాధారణంగా మారింది. దీంతో ఈ విధానాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద అందించే సేవలు, అనుమతులను గతేడాది జూలై నుంచి ఆన్లైన్ ద్వారా జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడంతో రవాణా శాఖ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్దకు వచ్చే వాహనదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సులభంగా, పారదర్శకంగా అనుమతులు జారీ అవుతున్నాయి. ఆన్లైన్ విధానం లేని 2022–23లో వివిధ అనుమతుల జారీ కింద మొత్తం రూ.51.64 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టాక 2023 జూలై నుంచి 2024 ఫిబ్రవరి వరకు వివిధ అనుమతుల జారీ కింద రూ.62.82 కోట్లు రావడం గమనార్హం. గతంలో అధికారిక అనుమతులు లేకుండా లంచాలు తీసుకుని మరీ వాహనాల ప్రవేశానికి అనుమతించేవారన్నది స్పష్టమవుతోంది. ఆన్లైన్ విధానం సరుకు రవాణా వాహనదారులకు సౌలభ్యంగా ఉండటంతోపాటు ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచింది. ప్రయోజనాలు ఇవీ... ♦ సరుకు రవాణా వాహనాలను ఇక రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతుల కోసం నిలపాల్సిన అవసరం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ♦ ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలు సగటున గంటకు 35 కి.మీ.మేర ప్రయాణిస్తున్నాయి. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో సగటున గంటకు 55 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ♦ ప్రస్తుతం దేశంలో సరుకు రవాణా వాహనాలు రోజుకు సగటున 360 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో రోజుకు సగటున 1,200 కి.మీ. ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు తొలగించడంతో రాష్ట్రంలో రోజుకు సగటున 550 కి.మీ. దూరం ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. దీంతో త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడంతోపాటు సరుకు రవాణా వ్యయం తగ్గుతుంది. -
ఎన్నదగిన తీర్పు
చట్టసభల సభ్యులు చెట్లకూ, పుట్లకూ ప్రాతినిధ్యం వహించరు. ఓటు హక్కున్న పౌరులు వారిని ఎన్నుకుంటారు. తమ ప్రతినిధులుగా చట్టసభలకు పంపుతారు. అలా ఎన్నికైనవారి ప్రవర్తన అందరికీ ఆదర్శనీయంగా వుండాలనీ, వుంటుందనీ జనం ఆశిస్తారు. అందుకు భిన్నంగా వున్నపక్షంలో ఆ సభ్యులపై మాత్రమే కాదు... ఆ చట్టసభలపైనే ప్రజలు నమ్మకం కోల్పోతారు. కనుకనే సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమైనది. చట్టసభల్లో ఓటేయటానికీ లేదా ప్రసంగించటానికీ లంచం తీసుకునే ప్రజాప్రతినిధులు చట్టపరమైన చర్యలనుంచి తప్పించుకోలేరంటూ ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ ఏకగ్రీవ తీర్పు మన ప్రజాస్వామ్యానికి పట్టిన అనేకానేక చీడల్లో ఒకదాన్ని తొలగించటానికి దోహదపడుతుందని భావించాలి. 1993 సంవత్సరంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై లోక్‌సభలో వచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఓడించటానికి అయిదుగురు జేఎంఎం సభ్యులు, జనతాదళ్ (ఏ) సభ్యుడొకరు లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నాటి ప్రధాని పీవీ, ఈ ఆరుగురు సభ్యులూ ఆ తీర్మానాన్ని ఓడించటానికి ఉమ్మడిగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డా రన్నది ఆ ఆరోపణ సారాంశం. లంచావతారాలైన ప్రభుత్వోద్యోగులు ముడుపులు తీసుకుంటే అవినీతి నిరోధక విభాగాలు అరెస్టు చేస్తాయి. వారి నేరం రుజువైన పక్షంలో శిక్ష కూడా పడుతుంది. ఇదే పని మరింత భారీ స్థాయిలో చేసే ప్రజాప్రతినిధి చట్టపరిధిలోకి ఎందుకు రారన్నది సామాన్యులకొచ్చే సందేహం. నిజానికి 1998లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పిస్తూ తీర్పు వెలువరించినప్పుడు రాజ్యాంగ నిపుణులు నివ్వెరపోయారు. ఈ తీర్పు పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుందనీ, ప్రజాస్వామ్యం పతనమవుతుందనీ హెచ్చరించారు. నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును అర్థం చేసుకున్న తీరూ, చట్టసభల సభ్యు లకు రక్షణకల్పించే రాజ్యాంగ అధికరణ 105కు చెప్పిన భాష్యమూ లోపభూయిష్టం. పార్లమెంటు నిర్వహణ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలూ, ఇతరత్రా ఆదేశాలకు లోబడి పార్లమెంటు సభ్యులకు వాక్ స్వాతంత్య్రం వుంటుందన్నది 105(1) అధికరణ చెప్పిన మాట. సభలో సభ్యులు చేసే ప్రసంగాలు, ఏదైనా అంశంపై వారు వేసే ఓటు, సమర్పించే నివేదికలు న్యాయస్థానాల్లో సవాలు చేయటానికి అతీతమైనవని 105(2) అధికరణ చెబుతోంది. కానీ వారు చేసే ప్రసంగాలూ, వేసే ఓటూ వెనక ముడుపుల ప్రమేయం వున్నప్పుడు కూడా రక్షణ పొందగలరా అన్నదే ప్రధాన ప్రశ్న. అయితే చిత్రంగా నాటి ధర్మాసనంలోని మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అయిదుగురు జేఎంఎం ఎంపీలకూ 105(2) అధికరణ కింద రక్షణ వుంటుందని భావించారు. అయితే అదే తరహాలో లంచం తీసుకుని కూడా ఓటింగ్‌కు గైర్హాజరైన జనతాదళ్(ఏ) సభ్యుడు అజిత్ సింగ్‌కు మాత్రం ఆ రక్షణ వర్తించదని తీర్పునిచ్చారు. నాటి ముడుపుల కేసులో ఆరోపణ లెదుర్కొన్న అయిదుగురు జేఎంఎం సభ్యుల్లో ఒకరైన శిబూ సోరెన్ కుమార్తె సీతా సోరెన్ ఎమ్మెల్యేగా వుంటూ 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్వతంత్ర సభ్యుడికి ఓటేస్తానని మాటిచ్చి ముడుపులు తీసుకున్నారు. అయితే ఎన్నిక బహిరంగ విధానంలో జరగటంతో గత్యంతరం లేక తన పార్టీ ఎంపిక చేసిన సభ్యుడికి అనుకూలంగా ఓటేశారు. దానిపై నమోదైన కేసులో తనకు పీవీ కేసు తీర్పే వర్తిస్తుందనీ, కేసు కొట్టేయాలనీ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ లంచం తీసుకుని కూడా అప్పట్లో ఓటింగ్‌కు గైర్హాజరైన అజిత్ సింగ్ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయమే సీతా సోరెన్‌కు కూడా వర్తిస్తుందని హైకోర్టు భావించి ఆ పిటిషన్‌ను తోసిపుచ్చటంతో 2014లో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైనా కొత్త అంశం తెరపైకొచ్చినప్పుడు గత తీర్పులు నిశితమైన పరీక్షకు నిలబడక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సీతా సోరెన్ అప్పీల్ సర్వోన్నత న్యాయస్థానానికి ఆ మాదిరి అవకాశాన్ని చ్చింది. పౌరస్వేచ్ఛ పౌరులకు చట్టం ఇచ్చిన బహుమతి మాత్రమేననీ, ఆత్యయిక పరిస్థితి వున్నప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు రాజ్యానికుంటుందనీ ఏడీఎం జబల్పూర్ కేసుగా ప్రసిద్ధిచెందిన హెబియస్ కార్పస్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువ రించింది. ధర్మాసనంలోని జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా ఒక్కరే దాంతో విభేదించారు. ఎమర్జెన్సీ కాలంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ తీర్పును అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా వేలాదిమంది పౌరులను జైళ్లపాలు చేసింది. ఆ తీర్పును 1978లో సుప్రీంకోర్టు సవరించుకుంది. అలాగే 2017లో పుట్టస్వామి కేసులో గోప్యత హక్కుపై వెలువరించిన తీర్పు సందర్భంగా ఏడీఎం జబల్పూర్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ తీర్పు ఏ పర్యవసానాలకు దారితీస్తుందో, ఎలాంటి దుçస్సంప్రదాయాలకు సాకుగా మారుతుందో గమనించుకోవటం న్యాయస్థానాలకు తప్పనిసరి. ప్రజాప్రతినిధులు పార్లమెంటులో వ్యవహరించే తీరుపై లంచాల ప్రభావంవున్నా వారు చర్యకు అతీతులన్న గత భావనను ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చటం హర్షించదగింది. ముడుపులు ఎక్కడైనా ముడుపులే. ప్రజాప్రతినిధులు అటువంటి ప్రలోభాలకు లొంగితే వారి అనైతికత మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. చట్టసభలపై ప్రజానీకానికుండే విశ్వాసం కుప్పకూలుతుంది. అవినీతి కేసుల్లో దోషులందరికీ ఒకే చట్టం, న్యాయం వర్తిస్తుందన్న తాజా తీర్పు ఎన్నదగింది. -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
ఏసీబీ వలలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొండపల్లి ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ ఏరియా (ఐడీఏ)లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. స్థానిక సెంటారస్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటు అనుమతులకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం రూ.2.10 లక్షలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెంటారస్ ఫార్మా కంపెనీలో నూతన బాయిలర్ ఏర్పాటుకు కంపెనీ యజమాని బాలిరెడ్డి అర్జీ పెట్టుకోగా అనుమతులు ఇచ్చేందుకు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూ.5.50 లక్షలు డిమాండ్ చేశాడు. రూ.3.50 లక్షలు ఇచ్చేందుకు బాలిరెడ్డి ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నగదు రూ.2.10 లక్షలను సత్యనారాయణ అసిస్టెంట్ నాగభూషణం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ బాయిలర్ ఫిటింగ్ చార్జీలు రూ.లక్ష, అదనంగా మరో 1.10 లక్షలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నాగభూషణం చెప్పిన వివరాల మేరకు సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఏసీబీ డీఎస్పీ శరత్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శివకుమార్ పాల్గొన్నారు. -
అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా...అవినీతి కేసులు మూసివేయడం తగదు
సాక్షి, అమరావతి: సీబీఐ, ఏసీబీ నమోదు చేసే అవి నీతి కేసుల్లో సాక్షులుగా ఉన్న అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా ఆ కేసులను సంబంధిత కోర్టు లు మూసివేయడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ, ఇన్స్పెక్టర్లకు సాక్ష్యం చెప్పే అవకా శాన్ని నిరాకరిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు 2014లో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఇద్ద రు అధికారులకు సాక్ష్యం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువ రించారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో తన పేరు ఎక్కించేందుకు చిత్తూరు జిల్లా ఏర్పేడు తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వో బాలకృష్ణారెడ్డి రూ.2,500 లంచం డిమాండ్ చేశారంటూ ఓ వ్యక్తి 2009లో ఏసీ బీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాది నుంచి బాలకృష్ణారెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఈ కేసును కర్నూలు కోర్టు విచారణ చేసింది. అయితే, లంచం తీసుకుంటున్న వీఆర్వోను పట్టు కుని ఈ కేసులో సాక్షులుగా ఉన్న డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ఎన్నికల విధుల్లో ఉండటంతో సాక్ష్యం చెç³్పలేక పోయారు. వారు సాక్ష్యం ఇచ్చేందుకు కేసును రీ ఓపెన్ చేయాలని కర్నూలు కోర్టును ఏసీబీ అధికా రులు అభ్యర్థించారు. దీనిని ఆ కోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏసీబీ 2014లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల తుది విచారణ జరిపింది. ఏసీబీ తరఫు న్యాయవాది ఎస్ఎం సుభానీ వాదనలు వినిపిస్తూ మరో అధికారిక విధుల్లో ఉండటంతో ఆ ఇద్దరు అధికారులు సాక్ష్యం చెప్పలేకపోయారని,ఎన్నికల విధులు ముగిశాక సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమని చెప్పినా కర్నూలు కోర్టు పట్టించుకోలేదన్నారు. వీఆర్వో తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సాక్ష్యం చెప్పేందుకు అధికారులకు ఏసీబీ కోర్టు పలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేదని, దీంతో కోర్టు వారి సాక్ష్యాలను మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. కేసులను త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పునిచ్చారు. కర్నూలు ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. కేసులను త్వరగా పరిష్కరించడం అంటే సాక్షులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వకపోవడం కాదన్నారు. ఈ కేçÜులో వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులకు సాక్ష్యం చెప్పే అవకాశం ఇవ్వక పోవడం సరికాదన్నారు. మూసివేసిన సాక్ష్యాలను తిరిగి తెరిచే అవకాశాన్ని కోర్టులకు చట్టం కల్పిస్తోందన్నారు. అవకాశం ఇచ్చినా అధికారులు సాక్ష్యం చెప్పేందుకు రాకపోతే ఆ విషయాన్ని లేఖ ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సాక్షులుగా ఉన్న సంబంధిత అధికారుల సాక్ష్యాలను నమోదు చేయకుండా అవినీతి కేసులను మూసివేయకుండా న్యాయాధికారులకు ఆదేశాలు ఇస్తూ సర్క్యులర్ జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. -
లంచం ఇవ్వాలని మంత్రి ఒత్తిడి.. లేఖపై రాజకీయ దుమారం..!
బెంగళూరు: కర్ణాటకాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తమను నెలనెలా లంచం సమర్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారని సంబంధిత శాఖ డైరెక్టర్లు రాసిన లేఖ ఒకటి బయటపడింది. అది నకిలీదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రిపై దర్యాప్తు చేయడానికి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్ధరామయ్య. రాష్ట్ర వ్యవసాయ మంత్రి చలువరాయ స్వామి నెలకు రూ.8 లక్షల వరకు లంచం సమర్పించాలని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర గవర్నర్‌కు బాధిత డైరెక్టర్లు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ఒకటి బయటపడింది. ఇలా ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందంటూ బాధితులు గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అవినీతికి మారుపేరుగా ప్రభుత్వం మారిపోయిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఇది ప్రతిపక్షాల కుట్రగా పేర్కొన్నారు. ఆ లేఖ నకిలీదని గుర్తించినట్లు చెప్పారు. తన ప్రభుత్వంపై బురదజల్లడానికి బీజేపీ, జేడీఎస్‌లు ఆడిన నాటకని అన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో డీజీపీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 9 తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ విభాగం టోల్‌ఫ్రీ నంబర్ 14400, ఏసీబీ యాప్ 14400లకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బద్వేల్(వైఎస్సార్ జిల్లా), తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, విశాఖపట్నం జగదాంబ, తుని(కాకినాడ జిల్లా), నర్సాపురం, ఏలూరు, కందుకూరు (నెల్లూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మేడికొండూరు(గుంటూరు), జలుమూరు(శ్రీకాకుళం) తహశీల్దార్ కార్యాలయాల్లో దాదాపు 35 మంది అధికారుల బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. కాగా, గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కరుణకుమార్ కారులో అనధికారికంగా ఉన్న రూ.లక్షా, 4 వేల, 7 వందలు నగదును, çకారు డ్యాష్ బోర్డులో ఉన్న పలు రికార్డులు, సర్టిఫికెట్లను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ నగదుపై పూర్తి స్థాయి వివరాలు చెప్పకపోవడంతో తహసీల్దార్‌ను కార్యాలయానికి తీసుకొచ్చి కంప్యూటర్ డేటాను తనిఖీ చేశారు. ఇదే తహసీల్దార్ కరుణకుమార్ మేడికొండూరు కార్యాలయంలోనే సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయం(2009)లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వీరవెంకటప్రతాప్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మేడికొండూరు తహసీల్దార్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో పలు రికార్డుల్లో అక్రమాలను గుర్తించినట్టు తెలిసింది. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన అర్జీలను కూడా ఉద్దేశపూర్వకంగా పక్కనబెడుతున్నట్టు గుర్తించారు. తనిఖీలు గురువారం కొనసాగనున్నాయి. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏబీసీ దాడులు చేసి లెక్కల్లో చూపని నగదు భారీగా స్వా«దీనం చేసుకున్నారు. అనంతపురం రూరల్ (రుద్రంపేట) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో రిజిస్ట్రేషన్ చలానాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ అలీ స్వయాన అల్లుడు, ఆయన వాహన డ్రైవరుగానూ ఉన్న షేక్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అక్రమంగా దాచుకున్న రూ.2.27 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన సోదాల్లో ఇటీవల కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాలను ఏసీబీ పరిశీలించారు. బుధవారం జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలకు మించి అధికంగా నగదు, అలాగే అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండటంపైనా ఆరా తీశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో లెక్కల్లో చూపకుండా ఉన్న మొత్తం రూ.1,53,410 నగదును సీజ్ చేశారు. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్ల’ పథకం కింద ఇంటి బిల్లులను మంజూరు చేసేందుకు ఓ లబ్ధిదారు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గృహనిర్మాణ శాఖ ఏఈ బుధవారం ఏసీబీకి చిక్కారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గృహనిర్మాణ శాఖ ఏఈ ఎం.వెంకటేశ్వరరావు బిల్లు మంజూరు చేసేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై లబ్దిదారుడు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన లబ్దిదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ వెంకటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ని విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
80 ఏళ్ల వయసులో వెంటాడిన జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఓ ప్రధానోపాధ్యాయుడి నుంచి రూ.5 వేల లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు 25 ఏళ్ల క్రితం పెట్టిన కేసు ఓ మాజీ ఎంపీడీవోను వృద్ధాప్యంలోనూ వెంటాడింది. 80 ఏళ్ల వయసులో ఆ అధికారి జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురైంది. తన వయసు 80 ఏళ్లని.. అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపిన ఆ మాజీ ఎంపీడీవో.. తనను కనికరించాలని అభ్యర్థించాడు. నిర్ధ్వందంగా తిరస్కరించిన హైకోర్టు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే గరిష్ట శిక్షతో కాకుండా కనిష్ట శిక్షతో సరిపెట్టింది. లంచం తీసుకున్నందుకు ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అప్పటి అధికారికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద 6 నెలల జైలు, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శుక్రవారం తీర్పు వెలువరించారు. విధుల్లోకి చేర్చుకునేందుకు లంచం డిమాండ్ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన యూవీ శేషారావు అప్పట్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసే వారు. ఆయనకు అదే జిల్లాలోని నడిమ తిరువూరు పాఠశాలకు బదిలీ కావడంతో.. విధుల్లో చేరేందుకు వెళ్లిన శేషారావును విధుల్లో చేర్చుకోలేదు. దీంతో ఆయన పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయడంతో పాటు జీతం బకాయిలను ఇప్పించాలని కోరుతూ శేషారావు అప్పటి తిరువూరు ఎంపీడీవో బత్తిన వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లారు. ఇందుకు వెంకటేశ్వరరావు రూ.5 వేల లంచం అడిగారు. ఇవ్వలేనని చెప్పినా వినలేదు. దీంతో శేషారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శేషారావు నుంచి లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు 1998లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు లంచం తీసుకున్నారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ వెంకటేశ్వరరావుపై ఏసీబీ పెట్టిన కేసును కొట్టేస్తూ 2005లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ అధికారులు 2007లో హైకోర్టులో అప్పీల్ చేశారు. అప్పటి తీర్పును తప్పుపట్టిన హైకోర్టు ఈ అప్పీల్‌పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు విచారణ జరిపి శుక్రవారం తీర్పు వెలువరించారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు తీర్పును తప్పుపట్టారు. వెంకటేశ్వరరావు లంచం తీసుకున్నారనేందుకు ఆధారాలు ఉన్నాయని తేల్చారు. లంచం డిమాండ్ చేశారనేందుకు, లంచం తీసుకున్నారనేందుకు ఏసీబీ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచారని తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను ఏసీబీ ప్రత్యేక కోర్టు సరైన కోణంలో విశ్లేషించలేదని ఆక్షేపించారు. వాదనల సమయంలో తన వయసు 80 ఏళ్లని, అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చుతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టంలో నిర్దేశించిన గరిష్ట శిక్షకు బదులు కనిష్ట శిక్ష విధిస్తున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ 7 కింద 6 నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా, సెక్షన్ 13(1)(డీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు వీఆర్వోలు
సాక్షి, అమరావతి/రామసముద్రం (చిత్తూరు జిల్లా)/మందస (శ్రీకాకుళం జిల్లా): రాష్ట్రంలో ఇద్దరు గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వోలు) లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ పీఎస్సార్ ఆంజనేయులు కార్యాలయం నుంచి ఇందుకు సంబంధించిన వివరాలు విడుదల చేశారు. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన రైతు బి.వెంకటరమణకు ఈ–పట్టాటారు పాస్‌బుక్ ఇవ్వడానికి వీఆర్వో డి.రాజశేఖర్ రూ.8,500 లంచం అడిగాడు. దీంతో రంగంలోకి దిగిన తిరుపతి ఏసీబీ అధికారులు రాజశేఖర్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ స్పెషల్ కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిరిపురం గ్రామ రైతు రాజేష్ పండకు ఈ–పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇవ్వడానికి బోదరసింగి వీఆర్వో బి.రేణుకారాణి రూ.3వేలు లంచం అడిగారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటుండగా రేణుకారాణిని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. -
లంచం కేసులో చైనా కోర్టు సంచలన తీర్పు
బీజింగ్: లంచం ఎన్నో సందర్బాల్లో ఎంతో మంది జీవితాల్లో పెను విషాదాలు నింపింది. మన దేశంలో లంచగొండి అధికారుల వేధింపులు తాళలేక ఎందరో ప్రభుత్వ కార్యాలయాల ముందే ప్రాణాలు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. ఇక లంచగొండులకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఓ లంచగొండి అధికారికి ఉరి శిక్ష విధించిన వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇది మన దగ్గర కాదు.. చైనాలో. వివరాలు.. లంచం, అవినీతి కేసులో చైనా ప్రభుత్వ మాజీ అధికారి లై షియామిన్‌కు అక్కడ న్యాయస్థానం మంగళవారం మరణశిక్ష విధించింది. మొత్తం 260 మిలియన్ డాలర్ల మేర అవినీతికి పాల్పడినట్టు న్యాయస్థానం నిర్ధారించింది. చైనా అతిపెద్ద ప్రభుత్వ-నియంత్రిత ఆర్ధిక నిర్వహణ సంస్థకు లై షియోమిన్ గతంలో ఛైర్మన్‌గా వ్యవహరించారు. కమ్యూనిటీ పార్టీ మాజీ సభ్యుడైన లై షియామిన్ గతేడాది జనవరిలో అధికార మీడియా సీసీటీవీలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించారు. బీజింగ్‌లోని తన అపార్ట్మెంట్లో ఉన్న లాకర్లను తెరిచిన అధికారులు.. అందులో బయటపడ్డ నగదు చూసి షాక్ అయ్యారు. అక్రమమార్జన కోసం లై తన హోదాను దుర్వినియోగం చేశాడని తియాంజిన్ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన లంచం తీసుకున్న చర్యను ‘చాలా పెద్ద’ నేరంగా, తీవ్రమైనదగా కోర్టు అభిప్రాయపడింది. ఇక లై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన హానికారక చర్యకు పాల్పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: నడి రోడ్డు మీద లంచావతారం..) హాంగ్‌కాంగ్-లిస్టెడ్ చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ ఛైర్మన్ అయిన లై.. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించి, చట్టవిరుద్ధంగా పిల్లలను కన్నట్టు నిర్ధారణ అయ్యింది. హువారంగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఛైర్మన్‌గా ఉంటూ 2009 నుంచి 2018 మధ్య 3.8 మిలియన్ డాలర్ల మేర ప్రజా ధనాన్ని అపహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 ఏప్రిల్‌లో ఆయనపై దర్యాప్తు ప్రారంభమయ్యింది. టెలివిజన్ లైవ్‌లో తన నేరాన్ని అంగీకరించిన లై.. మొత్తం డబ్బును దాచిపెట్టానని, అందులోది ఒక్క పైసా కూడా తాను ఖర్చుచేయలేదు.. దానికి తనకు ధైర్యం సరిపడలేదని తెలిపారు. (చదవండి: శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..) లంచంగా లై ఖరీదైన కార్లు, బంగారు బిస్కెట్లను తీసుకున్నట్టు అంగీకరించారు. లై వ్యక్తిగత ఆస్తులన్నీ జప్తు చేసి, తన రాజకీయ హక్కులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, జీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అవినీతి నిరోధక ప్రచారం తన ప్రత్యర్థులను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగపడిందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సీసీటీవీ తరచూ నేరాలకు పాల్పడే నిందితులతో ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తుంది. వారు కోర్టులో హాజరుకాకముందే బలవంతంగా నేరాన్ని ఒప్పుకునేలా ప్రేరేపించడాన్ని న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. -
సారు చెబితేనే చేశాం..
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పన్నెండు లక్షల లంచం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వయంగా అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్ తమకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తేనే తాము పనులు చేశామని ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ కేసుకు సం బంధించి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తో సహా నిందితులు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూని యర్ అసిస్టెంట్ మహ్మద్ వాసీం, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌లను ఏసీబీ రెండోరోజు మంగళవారం ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఈ సందర్భంగా తామంతా అడిషనల్ కలెక్టర్ ఆదేశాలిస్తేనే పని చేశామంటూ... ఆర్డీవో, తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అధిక ప్రశ్నలకు.. ‘నాకు తెలియదు’అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. రింగ్‌రోడ్డు వద్ద కలవండి.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చిన పలు వివాదాస్పద భూ వ్యవహారాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. ఎక్కడా తనపేరు బయటికి రాకుండా జీవన్‌గౌడ్ నంబరు ఇచ్చేవారు. ఆ తరువాత మొత్తం సెటిల్మెంట్లన్నీ జీవన్‌గౌడ్ చక్కదిద్దేవాడు. పనుల నిమిత్తం జీవన్‌గౌడ్‌కు ఎవరు ఫోన్ చేసినా.. వారితో నగదు గురించి మాట్లాడి, మేడ్చల్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కలుసుకునేవాడని, అక్కడే లంచం కింద తీసుకునే నగదు చేతులు మారేదని సమాచారం. ఏ రోజు, ఏటైములో కలవాలో ఫోన్ లో ముందుగానే సూచనలు చే సేవాడు. రింగ్‌రోడ్డు ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండటం, తాను సికింద్రాబాద్‌లో ఉండటం వల్ల రింగురోడ్డును వసూలు కేంద్రంగా వాడుకునేవాడని తెలిసింది. బినామీల విచారణ.. రెండో రోజు విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం ముగ్గురు బినామీలను అధికారులు ప్రశ్నించారు. బినామీల్లో ఓ మహిళ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మ నోహరాబాద్, మేడ్చల్, కామారెడ్డిలో నగేశ్‌కు చెందిన పలు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కిందిస్థాయి ఉద్యోగులను సైతం అధికారులు విచారించారు. నగేశ్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ లభ్యం కాకపోవడం తో, బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ లా కర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వ స్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. -
అనంతపురం కార్పొరేషన్లో వసూళ్ల పర్వం
ప్రభాకర్: నమస్తే .. సార్ నా కుమారునికి ఆరేళ్లు. బర్త్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అధికారి: ఎక్కడ పుట్టినాడో అక్కడే తీసుకోవాలి. ప్రభాకర్: అక్కడ ఇప్పుడు ఇవ్వమంటున్నారు సార్.. అధికారి: అవునా.. ఏం అర్జెంట్ పని ఉందా.. ప్రభాకర్: అవును సార్.. చాలా పని ఉంది అధికారి: అయితే నీ ఫోన్ నంబర్ చెప్పు మధ్యాహ్నం తరువాత చేస్తా. ప్రభాకర్: ఎంత ఖర్చు అవుతుంది సార్. డబ్బులు సర్దుబాటు చేసుకుంటా. అధికారి: రూ. 2500 ఇస్తే.. మూడు రోజులకు సర్టిఫికెట్ ఇస్తా. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు సెక్షన్లో ఓ అధికారి నగరవాసితో జరిపిన సంభాషణ ఇది. దీన్ని బట్టి చూస్తే చాలు ప్రజల నుంచి ఏ రకంగా డబ్బులు పీడించుకొని తింటున్నారో తెలుస్తుంది. నగరంలో వేణుగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న ప్రభాకర్ (పేరుమార్చాం) తన కుమారుడు సనత్ (పేరుమార్చాం)కి బర్త్ సరి్టఫికెట్ తీసుకునేందుకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగానికి వెళ్లారు. అన్ని రికార్డులు సమర్పించి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా అధికారికి విజ్ఞప్తి చేశారు. సదరు అధికారి ప్రస్తుతం రూ. 300 ఇచ్చి రెండు రోజులు తర్వాత రావాలని చెప్పారు. సర్టిఫికెట్ తీసుకునే రోజు రూ. 1,500 ఇవాల్సి ఉంటుందని చెప్పడంతో దరఖాస్తుదారుడు కంగుతిన్నాడు. అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు విభాగం అధికారులు సేవలకు రేట్లు ఫిక్స్ చేశారు. అవసరాన్ని బట్టి రేటు పెంచేస్తున్నారు. ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ. 500 మొదలుకొని రూ. 5000 వరకూ అవసరాన్ని బట్టి దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల పెరగడంతో నగరవాసులు నగరపాలక సంస్థ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజూ దాదాపు వంద మంది జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తున్నారు. కానీ చేయి తడపందే ఇక్కడి సిబ్బంది ధ్రువీకరణ పత్రాలివ్వడం లేదు. ఉద్యోగుల చేతివాటం నగరపాలక సంస్థలో జనన, మరణ ధ్రువీకరణపత్రాల మంజూరు విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏమాత్రం లేదు. ఎక్కువగా చిన్నస్థాయి ఉద్యోగులే ఇక్కడ పనిచేస్తుండటంతో అందినకాడికి దోచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న పలుకుబడితో కొన్నేళ్లుగా ఈ విభాగంలో తిష్ట వేశాడు. వాస్తవానికి అతను పారిశుద్ధ్య మేస్త్రీగా పనిచేయాల్సి ఉంది. కానీ ఇతర కారణాలు చూపి ఇక్కడే పాతుకుపోయాడు. ఏ పని కోసం వెళ్లినా సరే మొహమాటం లేకుండా బేరం మొదలు పెడతాడు. మరో కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఇదే రీతిలో పనిచేస్తున్నాడు. ఈ విషయాలు ఉన్నతాధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటాం నగర పాలక సంస్థ ద్వారా అందే సేవలన్నీ వార్డు సచివాలయాల్లోనే అందజేస్తున్నాం. ప్రజలెవరూ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు విభాగంపై గతంలో ఫిర్యాదులు రావడంతో ఓ అధికారిని తొలగించాం. తాజాగా వచ్చిన ఆరోపణలపై విచారిస్తాం. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – పీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
లంచం కేసు.. సీఐ శంకరయ్య అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి శంకరయ్య ఇంటిలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిలో భారీగా నగదు, నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్యను ఈ రోజు సాయంత్రం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.శంకరయ్యతో పాటు ఏఎస్ఐ రాజేందర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. (ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ) -
అవినీతి రోగం కుదిరింది!
పాడేరు: మండలానికి ప్రధాన ఆరోగ్య కేంద్రమైన మినుములూరు పీహెచ్సీలో యూడీసీ (సీనియర్ అసిస్టెంట్) శోభారాణి అవినీతిని ఇద్దరు ఏఎన్ఎంలు బట్టబయలు చేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. ఆమె అవినీతి బాగోతంతో విసిగిపోయిన ఏఎన్ఎంలు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సోమవారం ఉదయాన్నే విశాఖ ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ గంగరాజు, ఇతర సీఐలు, సిబ్బంది అంతా మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో తన గదిలో విధులు నిర్వహిస్తున్న యూడీసీ శోభారాణికి ఇద్దరు ఏఎన్ఎంలు పుష్పవతి, భాగ్యవతిలు రూ.19వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రాంగణం ఒక్కసారిగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడింది. గత ఏడాది నుంచి యూడీసీ శోభారాణి అవినీతి అక్రమాలపై ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు వైద్య సిబ్బంది చేపడుతూనే ఉన్నారు. ఇక్కడ వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, యూడీసీ శోభారాణి తమను అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నారని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఏఎన్ఎంలు యూడీసీ అవినీతి అక్రమాలపై ఇటీవల ఏసీబీ అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 11 మంది ఏఎన్ఎంలకు 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫీల్డ్ ట్రావెలింగ్ అలవెన్సుల బిల్లులను ఇటీవల యూడీసీ శోభారాణి మంజూరు చేయించింది. ఏఎన్ఎంల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఎఫ్‌టీఏల సొమ్ము జమ అయింది. అయితే ఈ సొమ్ములో ఒక్కొక్కరు రూ.7,500ల చొప్పున తనకు లంచం ఇవ్వాలని యూడీసీ డిమాండ్ చేయడంతో కొంత మంది ఆమె అడిగిన సొమ్మును ఇచ్చారు. అయితే పుష్పవతి, భాగ్యవతి, మెటర్నటిలీవ్‌లో ఉన్న కె.భవానీ యూడీసీ అడిగినంత నగదును ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అంత పెద్దమొత్తంలో లంచాన్ని ఇవ్వలేమంటు పుష్పవతి, భాగ్యవతి చెప్పడంతో కనీసం రూ.7వేలు చొప్పునైనా ఇవ్వాలని యూడీసీ పట్టుబట్టింది. అలాగే మెటర్నటి లీవ్‌లో ఉన్న భవాని కూడా ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని భాగ్యవతి, పుష్పవతిలు ఇటీవల ఏసీబీని ఆశ్రయించి యూడీసీ శోభారాణి నిత్యం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారులకు సమగ్రంగా విన్నవించారు. దీంతో వ్యూహం ప్రకారం ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి ఏఎన్ఎంల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భాగ్యవతి, పుష్పవతి ఇచ్చిన రూ.14వేలు, లీవ్‌లో ఉన్న కె.భవాని ఇచ్చిన రూ.5వేలు మొత్తం 19 వేలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ గంగరాజు విలేకరులకు తెలిపారు. ఏసీబీ అధికారులు యూడీసీ గదిలోని అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక్కడ వైద్యాధికారి, ఇతర వైద్య సిబ్బందిని విచారించారు. పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్, సీఐ ప్రేమ్‌కుమార్, ఇతర సిబ్బంది కూడా మినుములూరు ఆస్పత్రికి చేరుకుని ఏసీబీ అధికారులకు సహకారం అందించారు. లంచం తీసుకున్న నేరం కింద యూడీసీ శోభారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు మినుములూరు ఆస్పత్రిలోనే వైద్య సిబ్బంది కోవిడ్–19 పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలను కూడా జరిపిన అనంతరం అరెస్టు చేసి విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్లారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కానిస్టేబుల్స్
సాక్షి, హైదరాబాద్ : గూడ్స్ ఆటో డ్రైవర్ వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. అప్జల్ గంజ్ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్స్ ముఖేష్, సురేష్ ఆదివారం గూడ్స్ ఆటో డ్రైవర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయం సీపీ అంజనీ కుమార్ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి ఇద్దరు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేశారు. అలాగే పర్యవేక్షణా లోపం కారణంగా అఫ్జల్‌గంజ్ సీఐకి చార్జ్ మెమో జారీ చేశారు. -
దండం పెట్టే రోజులు పోయాయి
సాక్షి, సిద్దిపేట: లంచాలు అడిగే అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందుకు అనుగుణంగా మున్సిపల్ కొత్త చట్టం లో నిబంధనలు పొందు పరిచారని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన సిద్దిపేటలోని పలు వార్డుల్లో తిరిగారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. దరఖాస్తులు పెట్టి దండం పెట్టే రోజులు పోయాయన్నారు. సిరిసిల్లకు యాభై ఏళ్ల దరిద్రం వది లిందన్నారు. కేటీఆర్ చొరవతో అభివృద్ధిలో దూసుకెళుతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బుధవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హరీశ్ హాజరయ్యారు. -
ఇజ్రాయెల్ ప్రధానిపై సంచలన ఆరోపణలు.. చార్జిషీట్!
జెరూసలేం : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై లంచగొండితనం, మోసం, నమ్మకద్రోహం తదితర నేరాల కింద కేసులు నమోదయ్యాయి. నెతన్యాహు, ఆయన భార్య కొంతమంది బడా వ్యక్తులకు రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినందుకు గానూ దాదాపు 2 లక్షల అరవై వేల డాలర్లను విలాస వస్తువుల రూపంలో స్వీకరించినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ అవిచాయ్ మాండెల్బ్లిట్ 63 పేజీల అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. మూడేళ్ల దర్యాప్తులో భాగంగా నెతన్యాహు, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం లంచాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ‘ వ్యక్తిగతంగా ఈ విషయం నన్నెంతగానో బాధిస్తుంది. అయితే న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రధానికి వ్యతిరేకంగా మూడు కేసులు నమోదయ్యాయి. చట్టం ముందు అందరూ సమానులే. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసేందుకు.. న్యాయ వ్యవస్థపై ఇజ్రాయెల్ ప్రజల నమ్మకాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని చాటిచెప్పేందుకే మీ అందరి ముందుకు వచ్చాను అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఆరోపణలను బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. తనపై అభియోగాలను లంచగొండులైన న్యాయవాదుల తిరుగుబాటుగా ఆయన అభివర్ణించారు. ‘విచారణ జరిపిన వారి గురించి విచారణ జరపాల్సిన సమయం వచ్చింది. స్వయంప్రతిపత్తి గల సంస్థ చేత ఇలాంటి వాళ్లపై విచారణకు కోర్టు ఆదేశించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా... ‘ ఈ దేశం కోసం నా జీవితాన్ని ధారబోశాను. యుద్ధం చేశాను. గాయపడ్డాను. అంతర్జాతీయ వేదికపైన ఇజ్రాయెల్‌ను ఓ బలమైన శక్తిగా నిలిపేందుకు ఎల్లవేళలా కృషి చేశాను. దేశ శ్రేయస్సుకై పోరాడి సాధించిన విజయాల పట్ల ఎంతో గర్విస్తున్నాను. అయితే ప్రస్తుత సంఘటనలు నన్ను, నాకు అండగా నిలిచిన వారిని అగాథంలోకి నెట్టేశాయి’ అని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇక ఇజ్రాయెల్ దేశ చరిత్రలోనే ఇలాంటి ఆరోపణలు చేయబడిన మొదటి ప్రధానిగా నెతన్యాహు నిలిచారు. అదే విధంగా ఈ ఆరోపణలు రుజువు అయినట్లయితే తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా... కొన్ని నెలల పాటు జైలు శిక్ష పడే అనుభవించాల్సి ఉంటుంది. కాగా ఇజ్రాయెల్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ నెతన్యాహు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి ఖరీదైన నగలు, సిగరెట్లు తదితర వస్తువులు లంచంగా స్వీకరించారంటూ ప్రస్తుతం ఆయనపై చార్జిషీట్ నమోదైంది. ఈ క్రమంలో నెతన్యాహు రాజీనామా చేయాలంటూ ఆయన నివాసం ఎదుట నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఇక సుదీర్ఘకాలంగా ప్రధానిగా సేవలు అందించిన నెతన్యాహు లికుడ్ పార్టీ నుంచి తొలిసారిగా పోటీ చేసి.. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1993లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వివిధ పదవులు అలకరించారు. -
రూ.లక్ష లంచం తీసుకుంటూ..
లక్ష్మీపురం (గుంటూరు): వైద్య విధాన పరిషత్ గుంటూరు జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ చుండూరు ప్రసన్నకుమార్ బుధవారం గుంటూరులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. బాపట్లకు చెందిన మధ్యవర్తి, ఔట్సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ ద్వారా డైట్ కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు నుంచి రూ.లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్‌బాబు సిబ్బందితో పట్టుకున్నారు. అదనపు ఎస్పీ సురేష్‌బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాంట్రాక్టర్ తాడిబోయిన శ్రీనివాసరావు బాపట్ల, తెనాలి ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం (డైట్) సరఫరా చేస్తుంటారు. అందుకు సంబంధించిన బిల్లులను జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం మంజూరు చేయాలి. రూ.20 లక్షలు బిల్లు మంజూరై మూడు నెలలు అవుతున్నా అనేక కొర్రీలు పెడుతూ అందులో 15 శాతం లంచంగా ఇవ్వాలని జిల్లా కో–ఆర్డినేటర్ ప్రసన్నకుమార్ వేధిస్తున్నారు. అంత డబ్బు ఇచ్చుకోలేని చెప్పడంతో చివరకు 5 శాతం అంటే రూ.లక్ష ఇవ్వాలని తేల్చి చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టర్ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు 19వ తేదీన ప్రసన్నకుమార్‌కు కాంట్రాక్టర్ శ్రీనివాసరావు ఫోన్ చేసి రూ.లక్ష సిద్ధం చేశానని చెప్పారు. అయితే ఆ నగదును బాపట్ల ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న గోపీకృష్ణకు అందజేయాలని సూచించారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నాని చెప్పగా బాపట్ల నుంచి వచ్చిన గోపీకృష్ణ వచ్చి రూ.లక్ష తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో డాక్టర్ ప్రసన్నకుమార్‌తోపాటు గోపీకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
అవినీతిని ‘కాల్’చేస్తున్నారు!
పెద్దపల్లిలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.2,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది. కామారెడ్డికి చెందిన ఓ ఎక్సైజ్ సీఐ, ఎస్సై లంచం అడిగినందుకే క్రిమినల్ మిస్ కండక్ట్ కింద ఏసీబీ అధికారులు కేసులు బుక్ చేశారు. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలు అవినీతిపై సమరశంఖం పూరిస్తున్నారు. లంచం డిమాండ్ చేస్తున్న ఒక్కో అధికారిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టిస్తున్నారు. అవినీతిపై మీడియా ప్రచారం, ఇటు ఏసీబీ చర్యలు వెరసి ప్రజల్లో కదలిక వచ్చింది. ఫలితంగా బాధితులు ఒక్కొక్కరు ముందు కొస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయం మొదలుకుని మిగిలిన 33 జిల్లాల కార్యాలయాలకు ప్రతీరోజూ పలువురు బాధితులు ఫోన్లు చేస్తున్నారు. ప్రతీ కార్యాలయానికి రోజుకు ఐదు నుంచి 10 వరకు బాధితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రజల్లో పెరిగిన చైతన్యంతో ఏసీబీ రెట్టింపు దూకుడుతో పనిచేస్తోంది. ఓ వైపు ప్రజలను వేధించే అవినీతి జలగలకు వల వేస్తూనే.. మరోవైపు అక్రమంగా దోచే సిన సొమ్ముతో ఆస్తులు కూడబెడుతున్న వారిపై దాడులు చేస్తోంది. వరంగల్ జోన్ నుంచే ఎక్కువగా.. ఏసీబీని ఉమ్మడి జిల్లాల ప్రకారంగా మూడు జోన్లుగా విభజించారు. వాటిలో వరంగల్ (కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్), హైదరాబాద్ (హైదరాబాద్, రంగారెడ్డి), రూరల్ హైదరాబాద్ (నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్) జోన్లుగా ఉన్నాయి. వీటికి డీఎస్పీ ర్యాంకు అధికారి చీఫ్‌గా వ్యవహరిస్తారు. కొత్త జిల్లాల అనంతరం కూడా వాటి బాధ్యతలను కూడా వారే చూసుకుంటున్నారు. ఈ మూడు జోన్లలో వరంగల్ నుంచి అంటే ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో గ్రామీణ ప్రాం తాల్లో రెవెన్యూ, గ్రామ పంచాయతీ విభాగాలపై ఫిర్యాదులు అధికంగా ఉంటున్నాయి. ఇక హైదరాబాద్ జోన్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు క్లియర్ చేసేందుకు అధికారులు లంచం అడుగుతున్నారు. ఇందులో పోలీసు, ఎక్సైజ్, జీఎస్టీ, రెవెన్యూ మొదలుకుని దాదాపుగా అన్ని విభాగాలున్నాయి. ఈ మూడు జోన్లలో తక్కువ ఫిర్యాదులతో హైదరాబాద్ రూరల్ నిలిచింది. ఏసీబీ కార్యాలయాలకు వస్తున్న ఫోన్ కాల్స్‌లో 50 శాతం మాత్రమే కేసుల వరకు వెళ్తున్నాయి. ఫిర్యాదు చేసిన తరువాత చాలామంది తర్వాత పరిణామాలకు భయపడి వెనకడుగు వేయడమే దీనికి కారణం. దీంతో అధికారులు రూట్ మార్చారు. ఆడియో, వీడియోలతో చెక్.. ప్రజల్లో పెరిగిన చైతన్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఏసీబీ అవినీతి అధికారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రజల్ని లంచాలడిగి పీడిస్తోన్న అధికారులను చాకచక్యంగా పట్టుకుంటోంది. ముందుగా లంచం అడిగే అధికారి సంభాషణలను ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారి ఆఖరి నిమిషంలో లంచం తీసుకోవడానికి ఆసక్తి చూపకపోయినా, ఫిర్యాదుదారుడు వెనక్కు తగ్గినా.. లంచం అడిగిన అధికారిపై కేసులు నమోదు చేస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారి లంచం డిమాండ్ చేయడం నేరమే. అందుకు క్రిమినల్ మిస్ కండక్ట్ కింద సెక్షన్ 7ఏ/2018 పీసీ సవరణ చట్టం ప్రకారం కేసులు బుక్ చేస్తున్నారు. దీంతో లంచం అడిగేందుకు అధికారుల్లో చాలామంది వెనకడుగు వేస్తున్నారు.