స్థానిక ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న టి.సత్యనారాయణ ఓ కాంట్రాక్టర్ నుంచి
రూ.8వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
అనకాపల్లి రూరల్:లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు స్థానిక ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న టి.సత్యనారాయణ ఓ కాంట్రాక్టర్ నుంచి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదగంట్యాడకు చెందిన బేడజంగం సొసైటీ ప్రతినిధి ఎస్.శ్రీనివాసరావు అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్, డిపోలో పారిశుధ్యం కాంట్రాక్టును 2011-13లో దక్కించుకుని పనులు చేపట్టారు. ఈ కాంట్రాక్టు కోసం అప్పట్లో ఈఎంఐగా రూ.1,41,646లు డిపాజిట్ చేశారు. గడువు ముగియడంతో దానిని తిరిగి పొందేందుకు డిపోమేనేజర్ కార్యాలయ వారు నోడ్యూ సర్టిఫికెట్ ఇవ్వాలి.
దాని కోసం ఏడాదిగా డిప్యూటీ సూపరింటెండెంట్ చుట్టూ తిరుగుతున్నాడు. చివరకు అతనికి రూ.8వేలు లంచంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులను శ్రీనివాసరావు ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సూచనమేరకు శనివారం ఉదయం డిప్యూటీ సూపరింటిండెంట్‌కు రూ.8 వేలు ఇచ్చాడు. అప్పటికే వలపన్ని ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అతనిని పట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ నిందితుని విశాఖ ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రమణమూర్తి, రామకృష్ణ, గణేష్ లు పాల్గొన్నారు.