తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు  | ACB inspections in Tehsildar and Sub Registrar offices | Sakshi
Sakshi News home page

తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు 

Published Thu, Apr 27 2023 4:21 AM | Last Updated on Thu, Apr 27 2023 10:44 AM

ACB inspections in Tehsildar and Sub Registrar offices - Sakshi

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: రాష్ట్రంలో డీజీపీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 9 తహసీల్దార్, సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ విభాగం టోల్‌ఫ్రీ నంబర్‌ 14400, ఏసీబీ యాప్‌ 14400లకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బద్వేల్‌(వైఎస్సార్‌ జిల్లా), తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, విశాఖపట్నం జగదాంబ, తుని(కాకినాడ జిల్లా), నర్సాపురం, ఏలూరు, కందుకూరు (నెల్లూరు జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మేడికొండూరు(గుంటూరు), జలుమూరు(శ్రీకాకుళం) తహశీల్దార్‌ కార్యాలయాల్లో దాదాపు 35 మంది అధికారుల బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.

కాగా, గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్‌ కరుణకుమార్‌ కారులో అనధికారికంగా ఉన్న రూ.లక్షా, 4 వేల, 7 వందలు నగదును, çకారు డ్యాష్‌ బోర్డులో ఉన్న పలు రికార్డులు, సర్టిఫికెట్లను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ నగదుపై పూర్తి స్థాయి వివరాలు చెప్పకపోవడంతో తహసీల్దార్‌ను కార్యాలయానికి తీసుకొచ్చి కంప్యూటర్‌ డేటాను తనిఖీ చేశారు. ఇదే తహసీల్దార్‌ కరుణకుమార్‌ మేడికొండూరు కార్యాలయంలోనే సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయం(2009)లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

ఏసీబీ డీఎస్పీ వీరవెంకటప్రతాప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ మేడికొండూరు తహసీల్దార్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయాల్లో పలు రికార్డుల్లో అక్రమాలను గుర్తించినట్టు తెలిసింది. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన అర్జీలను కూడా ఉద్దేశపూర్వకంగా పక్కనబెడుతున్నట్టు గుర్తించారు.  తనిఖీలు గురువారం కొనసాగనున్నాయి. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు.   

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం  
సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏబీసీ దాడులు చేసి లెక్కల్లో చూపని నగదు భారీగా స్వా«దీనం చేసుకున్నారు. అనంతపురం రూరల్‌ (రుద్రంపేట) సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో రిజిస్ట్రేషన్‌ చలానాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సబ్‌ రిజిస్ట్రార్ మహమ్మద్‌ అలీ స్వయాన అల్లుడు, ఆయన వాహన డ్రైవరుగానూ ఉన్న షేక్‌ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అక్రమంగా దాచుకున్న రూ.2.27 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ జగదాంబ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన సోదాల్లో ఇటీవల కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాలను ఏసీబీ పరిశీలించారు. బుధవారం జరిగిన రిజిస్ట్రేషన్‌ లావాదేవీలకు మించి అధికంగా నగదు, అలాగే అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండటంపైనా ఆరా తీశారు. తిరుపతి రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో లెక్కల్లో చూపకుండా ఉన్న మొత్తం రూ.1,53,410 నగదును సీజ్‌ చేశారు.

‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్ల’ పథకం కింద ఇంటి బిల్లులను మంజూరు చేసేందుకు ఓ లబ్ధిదారు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గృహనిర్మాణ శాఖ ఏఈ బుధవారం ఏసీబీకి చిక్కారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గృహనిర్మాణ శాఖ ఏఈ ఎం.వెంకటేశ్వరరావు బిల్లు మంజూరు చేసేందుకు రూ.20వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీనిపై లబ్దిదారుడు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 14400కు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన లబ్దిదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ వెంకటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ని విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో  హాజరుపరచనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement