భక్తులిచ్చే దక్షిణను కూడా లంచమంటారా?
చంద్రబాబుపై ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: భక్తులు పూజారులకు సమర్పించుకునే దక్షిణను కూడా సీఎం చంద్రబాబు లంచంగా అభివర్ణించడంపై ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాకుళంలో జరిగిన ఏపీఎన్జీవోల సభలో ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రతినిధులు పద్మనాభశర్మ, సుధీర్ ఫణిగోపాల్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూజారులకు, అర్చకులకు దక్షిణ సమర్పించడం సంప్రదాయంలో భాగమని.. దానిని లంచంగా, అవినీతిగా చిత్రీకరించడం తగదన్నారు. అధికారంలోకి వస్తే అర్చకులకు అనేక మేళ్లు చేస్తామని చెప్పిన చంద్రబాబు, నేడు ఇలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి వల్లే ఈరోజు అర్చకులు ఆలయాల్లో సేవలు చేయగలుతున్నారని వివరించారు.