వైరా తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు, వృత్తంలో వీఆర్వో
♦ సాదాబైనామా’కురూ.27వేలు డిమాండ్
♦ తన గదిలో లంచం తీసుకుంటూ
♦ పట్టుబడిన వీఆర్వో రవి
వైరా :
సాదా బైనామా ప్రక్రియ పూర్తి చేయాలంటే లంచం ఇవ్వాల్సిందేనని డిమాం డ్ చేసిన వైరా ఇన్‌చార్జ్ వీఆర్వో మీనుగు రవిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపిన వివరాలు ఇలా..
వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన న్యా యవాది జోనబోయిన గోవిందరావు..తన 7.5 ఎకరాలు, తన సోదరుడికి చెం దిన మరో రెండు ఎకరాల భూమి నిసాదాబైనామా కింద ఆన్‌లైన్ చే యాలని ఏడాదికాలంగా తహసీ ల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రు. అష్ణగుర్తి, గొల్లెనపాడు వీఆర్వోగా చేస్తున్న రవి, వైరా ఇన్‌చార్జ్‌గా కూడా ఉండడంతో..ఆయనను కలిశారు. 1బీ, ఆన్‌లైన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంటే రూ.27వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో..బాధితుడు ఏసీబీ కార్యాలయంలో సంప్రదించారు.
వారి సూచనల మేరకు డబ్బు తీసుకొని వీఆర్వోకు ఫోన్ చేయగా..బ్రాహ్మణపల్లిలోని తన గదికి రావాలని సూచించగా..అక్కడికి వెళ్లి లంచం ఇస్తుండగా..ముందగానే వలపన్ని ఉన్న ఏసీబీ అధికారులు వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమణమూర్తి, పద్మ, సిబ్బంది ఉన్నారు.
రైతుల గోడు..: ఏసీబీ డీఎస్పీని పలువురు రైతులు కలిసి..తహసీల్దార్ కార్యాలయంలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా..ఈ విషయమై బాధ్యులైన అధికారిని ఆయన ప్రశ్నించారు.
విసిగిన లాయర్ తెగువతో..
ఖమ్మంలో నివాసముంటున్న న్యాయవాది జోనబోయిన గోవిందరావు సాదా బైనామా ప్రక్రియ కోసం దాదాపు ఏడాదికాలంగా..వైరాకు వచ్చి వెళుతున్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని, వంశపారపర్యంగా వచ్చిన భూమిని నిబంధనల ప్రకారం కేటాయించాలని దరఖాస్తు చేసుకోగా..ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వీఆర్వో రవి ఎకరానికి రూ.10వేలు నుంచి రూ.20వేలు తీసుకుంటానని, లాయర్ కాబట్టి తగ్గించి తీసుకుంటున్నాని ఇబ్బంది పెట్టాడని, గతంలో రూ.6వేలు ఇచ్చానని తెలిపారు. చివరకు ఎకరానికి రూ.3వేల చొప్పున ఇవ్వాల్సిందేనని, ఆఫీసులో మిగతావారికి వాటా ఇస్తానని పట్టుబట్టడంతో.. విసిగి ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు.
గోవిందరావు, న్యాయవాది
ప్రతి పనికీ ఓ లెక్క..ఆయన గదే అడ్డా
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్వో రవి వైరా గ్రామ పంచాయతీ ఇన్‌చార్జ్. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల నుంచి ప్రతి పనికీ ఓ లెక్క ఏర్పాటు చేసుకొని కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల మంజూరుకు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత మండల అధికారి కనీసం మందలించలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గది ఉన్నా..బ్రాహ్మణపల్లిలో ఓ కిరాయి గదిని ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందా నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కొణిజర్ల, మధిర మండలాల్లో పనిచేసిన చోట కూడా వసూళ్లకే ప్రాధాన్యం ఇచ్చారనే మచ్చుంది.
ఉలిక్కి పడ్డ వైరా..అప్పుడు వారిపై..ఇప్పుడు ఇతడిపై
2007లో వైరాలో మోటారు వాహనాల తనఖీ అధికారిగా పనిచేస్తున్న నాగేశ్వరావు..ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కోట్లాది రూపాయల విలువచేసే ఆస్తులను, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం. ఈ కార్యాలయంలో ఎంవీఐగా పనిచేసిన ఎండీ.గౌస్ పాషా కొత్తగూడెం ఎంవీఐగా బదిలీపై వెళ్లాక కొత్తగూడెం, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పుడు రెవెన్యూ విభాగంలో వైరా ఇన్‌చార్జ్ వీఆర్వో లంచం తీసుకుంటూ పట్టుబడడంతో చర్చనీయాంశమైంది. ఏసీబీ అధికారుల దాడితో..కొన్ని ప్రభుత్వ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఒక్కసారిగి ఉలిక్కిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రక్రియ చేపడుతుంటే..అవినీతికి పాల్పడుతున్న ఘటన వెలుగు చూడడంతో..రైతులు, సామాన్యులు దీనిపై చర్చించుకున్నారు.