లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
వెల్దుర్తి : ఫౌతీలో పేరు మార్పునకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన వీఆర్వో.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు.. యశ్వంతరావుపేటకు చెందిన నరసింహులు మృతి చెందాడు. నరసింహులు పేరుతో ఉన్న 1.30 ఎకరాల భూమిని, మరో 9 గుంటల భూమిని తన తల్లి అనసూయ పేర ఫౌతీ చేయాలని ఆమె కుమారుడు జనార్దన్ రెండు నెలల క్రితం వీఆర్వోకు దరఖాస్తు పెట్టుకున్నాడు.
అయితే సదరు వీఆర్వో రూ. 2,500 ఇస్తే ఫౌతీ చేయిస్తానని యువ రైతును డిమాండ్ చేశాడు. అయితే రూ. 2 వేలు లంచం ఇచ్చే విధంగా వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో జనార్దన్ ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతు జనార్దన్ నుంచి లంచం తీసుకుంటుండగా.. వల పన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ శాఖకు చెందిన టోల్‌ఫ్రీ నంబర్ మారిందని, మరో నెల రోజుల్లో పూర్తి వివరాలు, పోన్ నంబర్లతో కూడిన బోర్డులను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా అధికారులు లంచాలు అడిగితే నేరుగా ఈ నంబర్ 94404 46149 కు ఫోన్ చేయాలని సూచించారు. దాడుల్లో సీఐలు ప్రతాప్‌కుమార్, నవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.