దినకరన్‌కు మరిన్ని కష్టాలు...
ఢిల్లీ: అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అన్నాడీఎంకే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌పై ఎన్నికల కమిషన్ ఎఫ్‌ఐఆర్ నమోదుకు నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో డబ్బు పంపిణీ వ్యవహారం కేసులో దినకరన్‌తో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రి విజయ్‌భాస్కర్‌పైనా కేసు నమోదు అయింది.
మరోవైపు దినకరన్‌పై ఈడీ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది.
ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. విచ్చలవిడిగా సాగిన ధనప్రవాహంపై ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్‌లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే.