కొత్త మొల్గరలో పట్టా చేసిన ఇళ్ల స్థలాలు
సాక్షి, భూత్పూర్ (దేవరకద్ర): పట్టాదారు ఎవరైనా సరే.. పైసలిస్తే ఎవరి పేరుపైనైనా పట్టా ఇచ్చేస్తారు.. తమ్ముడి జైలుకి వెళ్తే.. అన్న పేరిట పట్టా చేస్తారు.. భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం వీఆర్‌ఓల బదిలీలతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. వీఆర్‌ఓలు గ్రామాల్లో రికార్డు అనుభవం ఉన్న వ్యక్తులను మధ్యవర్తిత్వంగా పెట్టుకొని అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులైన రైతుల భూములను రికార్డుల్లో మార్పు చేస్తున్నారు.
భూ రికార్డుల్లో నమోదు చేయాలంటే భూమి కొనుగోలు చేసిన రోజు నుంచి 45 రోజుల తర్వాత మీసేవలో డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత జిరాక్స్ డాక్యుమెంట్, ఆధార్ కార్డులను తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి విక్రయ పత్రాలు లేకుండానే, ఇళ్ల స్థలాల భూమిని ఏకంగా పట్టాభూమిగా మార్చి రికార్డులోకి ఎక్కించారు. ఈ విషయం విలేకరుల దృష్టికి వచ్చిందని తెలుసుకున్న అధికారులు పట్టా మార్పిడి నంబరును ఆన్‌లైన్‌లో తొలగించారు. గండేడ్ తరహాలో ఇక్కడ కూడా విచారణ చేపడితే మరిన్ని అక్రమ భాగోతాలు బయటపడే అవకాశం ఉంది.
తేదీ లేకుండానే ప్రొసీడింగ్స్
మండలంలోని కొత్తమొల్గరలో సర్వే నంబరు 379లో ఇళ్ల స్థలాల పేరిట రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే సర్వే నంబరులో ఎకరా భూమి ప్రభుత్వం గతంలో పేదలకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూమి, ఇళ్ల స్థలాలు ఉండటంతో డిజిటల్ సైన్ ఆన్‌లైన్‌లో పెండింగ్ ఉంచారు. కొత్త మొల్గరకు చెందిన కె.తిమ్మయ్య, నర్సమ్మ పేరు మీద ఒక్కొక్కరికి గాను 0.0250 గుంటల భూమిని పట్టా చేశారు. 60073, 60074 ఖాతా నంబర్లు సైతం ఆన్‌లైన్‌లో ఎక్కించారు. భూత్పూర్ తహసీల్దార్ మహేందర్‌రెడ్డి కె.తిమ్మయ్య, నర్సమ్మలపై ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే ప్రొసీడింగ్స్ జారీ చేసిన తేదీ లేకపోవడం గమనార్హం. ఈ భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండానే పట్టా మార్పు చేసినట్లు తెలిసింది.
ప్రజావాణిలో ఫిర్యాదుతో..
అలాగే మండలంలోని పోతులమడుగు అనుబంధ గ్రామమైన గోపన్నపల్లిలో సర్వే నంబరు 165లో ఎకరా భూమిని కొనుగోలు చేసుకొని పట్టా చేసుకున్నారు. చెన్నయ్య 2012లో మృతి చెందడంతో భార్య మాల ఊషమ్మ పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో మార్చారు. భర్త మృతి చెందిన కొద్ది నెలలకే మాల ఊషమ్మ సైతం మృతిచెందింది. ఈమెకు మాల శంకరయ్య, వెంకటయ్య అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ తల్లి పేరు మీద ఉన్న సర్వే నంబరు 165లో ఉన్న ఒక ఎకరా భూమిని విరాసత్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే వెంకటయ్య భార్య మరణించిన కేసులో ఆయనకు మూడు నెలల జైలుశిక్ష పడింది.
వెంకటయ్య జైలులో ఉన్న సమయంలోనే ఆయన అన్న శంకరయ్య, తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది, సంబంధిత అధికారులతో కుమ్మక్కై మొత్తం తన పేరిట పట్టా చేయించుకున్నాడు. జైలును శిక్ష అనుభవించి వచ్చిన వెంకటయ్య ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నేళ్లు వలస వెళ్లాడు. ఏడాది క్రితం భూమి విషయమై అన్న శంకరయ్యను అడగగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని తిరగడంతో అనుమానం వచ్చిన వెంకటయ్య గత నెల 24న ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ స్థానిక తహసీల్దార్‌కు శంకరయ్య ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
న్యాయం చేయాలి..
నేను నా భార్య మృతి కేసులో మూడు నెలలు జైలు జీవితం అనుభవించే సమయంలో రెవెన్యూ అధికారులు లంచం తీసుకొని మా అన్న పేరిట పట్టా చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత మా అన్న శంకరయ్యతో కలిసి విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. పంచనామాలో ఇద్దరు పేర్లు రాసిచ్చాం. ఇద్దరికి భూమి చేయకుండా మా అన్న శంకరయ్య పేరిటే విరాసత్ చేశారు. విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి. విరాసత్ ప్రకారం నా భాగం నాకు పట్టా చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment