Thahasildar office
-
లంచాలివ్వలేం.. తాళిబొట్లు తీసుకోండి
మోత్కూరు: ‘మీకు లంచాలిచ్చేందుకు మా దగ్గర పైసల్లేవు. బండలు కొట్టి బతుకుతున్నం. మా తాళిబొట్లు, చెవికమ్మలు అన్నీ తీసుకొని మా భూమి మాకు ఇప్పించండి’ అంటూ పలువురు బాధితులు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ముందు గురువారం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వారికి కేటాయించిన ఇళ్లస్థలాలను అక్రమార్కుల చెర నుంచి విడిపించి అప్పగించాలంటూ రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇలా వినూత్న రీతిలో నిరసనకు దిగారు. విసిగిపోయి చివరికిలా...: 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం మోత్కూరు వడ్డెర కాలనీలోనిసర్వే నెంబర్ 610లో 3.39 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించి కొన్ని ఇళ్లు నిర్మించింది. ప్రస్తుతం ఆ కాలనీ 2.39 ఎకరాలకు విస్తరించింది. మిగిలిన ఎకరం స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని తమ స్థలాన్ని తమకు అప్పగించాలని కోరుతూ పలుమార్లు బాధితులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎంతగా పోరాడినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయారు. దీంతో గురువారం వారంతా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహశీల్దార్ షేక్ అహ్మద్‌ను, ఇతర సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్వేగానికి గురైన మహిళలు.. లంచాలు ఇవ్వడానికి తమ దగ్గర డబ్బుల్లేవంటూ మెడలో ఉన్న తాళిబొట్లు, చెవికమ్మలు తీసి ఇవ్వగా, పురుషులు తమ ఉంగరాలు, వాచీలు, సెల్ఫోన్లు తీసి ఓ టవల్లో వేశారు. అవన్నీ తీసుకుని తమ భూమి తమకు ఇప్పించాలని తహశీల్దార్‌ను వేడుకున్నారు. సమస్య పరిష్కరిస్తానని, ఆందోళన విరమించాలని తహసీల్దార్ హామీ ఇచ్చినప్పటికీ.. వెంటనే పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామంటూ వారు భీష్మించుకుని కూర్చున్నారు. 10 గుంటల్లో అక్రమ నిర్మాణాలు... కాలనీవాసుల ఆందోళనతో ఎట్టకేలకు స్పందించిన తహసీల్దార్ షేక్ అహ్మద్.. సర్వేయర్ శ్రీనివాస్‌రాజు, ఆర్ఐ నజీర్, వీఆర్వోలతో కలిసి ఆ కాలనీకి వెళ్లారు. ఆక్రమించిన స్థలాన్ని పరిశీలించి సర్వే చేయించారు. మొత్తం 3.39 ఎకరాల భూమిలో 2.39 ఎకరాల్లో కాలనీవాసులు ఇళ్లు నిర్మించుకున్నారని, ఆక్రమణకు గురైన ఎకరం భూమిలో పది గుంటలు రోడ్డులో పోగా 30 గుంటల భూమి మిగిలి ఉందని నిర్ధారించారు. అందులో 10 గుంటల స్థలంలో ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారని తహశీల్దార్ తెలిపారు. ఆక్రమణదారులకు ఇదివరకే ఒకసారి నోటీసులు ఇచ్చామని, ఇప్పుడు మరోసారి నోటీసులు ఇచ్చి నిర్మాణాలు తొలగించి కాలనీవాసులు అప్పగిస్తామని చెప్పారు. దీంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. -
రెవెన్యూ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య, తదనంతర పరిణామాలు కలకలం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో పట్టపగలే ఓ అధికారిణిని సజీవ దహనం చేయడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎన్నడూ లేని విధంగా 8 రోజుల పాటు విధులు బహిష్కరించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఉద్యోగుల భద్రత, సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గత బుధవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. ఏ శాఖపైనా లేనన్ని ఆరోపణలు రావడం, రెవెన్యూ వ్యవస్థపై ముఖ్యమంత్రే అసంతృప్తి వ్యక్తం చేయడం, ఏసీబీకి చిక్కుతున్న అధికారుల్లోనూ ఈ శాఖకు చెందినవారే అధికంగా ఉండడం, రికార్డుల ప్రక్షాళన, ధరణి వెబ్సైట్ మొరాయింపు, పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో జాప్యం, ఎడతెగని పార్ట్– బీ భూముల వివాదం రెవెన్యూ సిబ్బందికి అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. పనిభారం తడిసిమోపెడు భూ పరిపాలతోపాటు ఇతర శాఖలకు సంబంధించిన పనుల్లోనూ రెవెన్యూ సిబ్బంది కీలకం. విద్యార్థుల కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల నుంచి ఓటరు జాబితా సవరణలు, ఆహార భద్రత, సంక్షేమ పథకాల అమలులో వీరిది పెద్దన్న పాత్ర. 26 శాఖలకు సంబంధించిన పనిభారం రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారింది. ప్రతి పనిలో వీరే కీలకం కావడంతో భూపరిపాలన గాడి తప్పింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు చేతివాటం ప్రదర్శించడం ఆ శాఖకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. హడావుడి ప్రక్షాళనతో... రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించాలనే హడావుడిలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ప్రస్తుత అగచాట్లకు కారణమైంది. తప్పులు సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వకపోవడం, సాంకేతిక సమస్యలు, ధరణి వెబ్సైట్ సహకరించకపోవడం లాంటి కారణాలు రెవెన్యూ సిబ్బంది పనితీరును ప్రశ్నించేలా చేశాయి. లెక్కకు మిక్కిలి చట్టాలు, జీవోలతో గందరగోళం ఏర్పడింది. పార్ట్ బీ భూముల వ్యవహారం వీరికి తలనొప్పిగా మారింది. తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమైంది. దీంతో ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాలకు తొలిసారిగా పోలీస్ బందోబస్తు కల్పించింది. రెవెన్యూ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే సందర్శకుల రాకపోకలను నియంత్రించింది. 26 శాఖలకు సంబంధించిన పనిభారం రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారింది. ప్రతి పనిలో వీరే కీలకం కావడంతో భూపరిపాలన గాడి తప్పింది. -
అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ ఆఫీసు అటెండర్ చంద్రయ్య అరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్యకు గాయాలయ్యాయి. ప్రస్తుతం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు చంద్రయ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అతని కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఇప్పటికే మూడు లక్షల బిల్లు అయిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లిస్తే చికిత్స చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది. డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాలని కుటుంబసబ్యులకు డీఆర్‌డీఓఅపోలో ఆసుపత్రి వర్గాలు సూచించాయి.అతన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వాధికారులు సూచించారు. తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన ఘటనలో.. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్యకు కూడా మంటలంటుకొని గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కాలిన గాయాలతో విజయారెడ్డి డ్రైవర్ గురునాథ్ మరణించిన విషయం తెలిసిందే. -
నా రూటే.. సపరేటు !
సాక్షి, అనంతపురం అర్బన్: జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. అయితే పుట్టపర్తి తహసీల్దారు గోపాలకృష్ణ రూటే సపరేటు... అందరు తహసీల్దార్లకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరణ అన్ని చోట్ల జరుగుతుంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ముఖ్య గమనిక అంటూ ‘‘ప్రస్తుతం రేషన్‌కార్డులకు దరఖాస్తులను స్వీకరించబడవు మీ సేవలోనే ప్రభుత్వ వెబ్సైట్ రిలీజ్ చేసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలి’’ అని ఏకంగా నోటీసు బోర్డులో ఉంచారు. దరఖాస్తులు కచ్చితంగా తీసుకోవాలి కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని కచ్చితంగా స్వీకరించాలే తప్ప తిరస్కరించకూడదు. కలెక్టరేట్‌తో సహా జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాల్లోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలా వచ్చిన దరఖాస్తులను మాస్టర్ రిజిస్టర్లో నమోదు చేస్తారు. అంతే కాకుండా వాటిని పంచాయతీలకు పంపించి విచారణ చేయించి అర్హులను గుర్తిస్తారు. ఇది ప్రక్రియ. అయితే పుట్టపర్తి తహసీల్దారు మాత్రం ఇందుకు భిన్నంగా దరఖాస్తుల స్వీకరించబోమని నోటీసు ఉంచడం చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో అతికించిన నోటీసు మీ–సేవలో దరఖాస్తు విధానం లేదు కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ప్రస్తుతం అమలులో లేదు. కార్డు కోసం మీ సేవలో దరఖాస్తులను స్వీకరించరు. అందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ కూడా లేదు. అయితే పుట్టపర్తి తహసీల్దార్ ఇందుకు భిన్నంగా... మీ– సేవలోనే ప్రభుత్వ వెబ్సైట్ రిలీజ్ చేసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. దరఖాస్తులు స్వీకరించాలి కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చేసుకుంటున్న దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయాల్లో స్వీకరించాలి. అంతే తప్ప వాటిని తిరస్కరించకూడదు. వచ్చిన దరఖాస్తులను పంచాయతీలకు పంపించి విచారణ చేయించి అర్హులను గుర్తించే ప్రక్రియ నిర్వహిస్తాం. పుట్టపర్తి తహసీల్దార్ అలా ఎలా నోటీసు ఉంచారో తెలీదు. ఆయనతో నేనే స్వయంగా మాట్లాడాతాను. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి, పౌర సరఫరాల శాఖ -
పైసలిస్తే.. పట్టా చేసేస్తారు!
సాక్షి, భూత్పూర్ (దేవరకద్ర): పట్టాదారు ఎవరైనా సరే.. పైసలిస్తే ఎవరి పేరుపైనైనా పట్టా ఇచ్చేస్తారు.. తమ్ముడి జైలుకి వెళ్తే.. అన్న పేరిట పట్టా చేస్తారు.. భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం వీఆర్ఓల బదిలీలతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. వీఆర్ఓలు గ్రామాల్లో రికార్డు అనుభవం ఉన్న వ్యక్తులను మధ్యవర్తిత్వంగా పెట్టుకొని అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులైన రైతుల భూములను రికార్డుల్లో మార్పు చేస్తున్నారు. భూ రికార్డుల్లో నమోదు చేయాలంటే భూమి కొనుగోలు చేసిన రోజు నుంచి 45 రోజుల తర్వాత మీసేవలో డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత జిరాక్స్ డాక్యుమెంట్, ఆధార్ కార్డులను తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి విక్రయ పత్రాలు లేకుండానే, ఇళ్ల స్థలాల భూమిని ఏకంగా పట్టాభూమిగా మార్చి రికార్డులోకి ఎక్కించారు. ఈ విషయం విలేకరుల దృష్టికి వచ్చిందని తెలుసుకున్న అధికారులు పట్టా మార్పిడి నంబరును ఆన్లైన్లో తొలగించారు. గండేడ్ తరహాలో ఇక్కడ కూడా విచారణ చేపడితే మరిన్ని అక్రమ భాగోతాలు బయటపడే అవకాశం ఉంది. తేదీ లేకుండానే ప్రొసీడింగ్స్ మండలంలోని కొత్తమొల్గరలో సర్వే నంబరు 379లో ఇళ్ల స్థలాల పేరిట రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే సర్వే నంబరులో ఎకరా భూమి ప్రభుత్వం గతంలో పేదలకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూమి, ఇళ్ల స్థలాలు ఉండటంతో డిజిటల్ సైన్ ఆన్లైన్లో పెండింగ్ ఉంచారు. కొత్త మొల్గరకు చెందిన కె.తిమ్మయ్య, నర్సమ్మ పేరు మీద ఒక్కొక్కరికి గాను 0.0250 గుంటల భూమిని పట్టా చేశారు. 60073, 60074 ఖాతా నంబర్లు సైతం ఆన్లైన్లో ఎక్కించారు. భూత్పూర్ తహసీల్దార్ మహేందర్‌రెడ్డి కె.తిమ్మయ్య, నర్సమ్మలపై ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే ప్రొసీడింగ్స్ జారీ చేసిన తేదీ లేకపోవడం గమనార్హం. ఈ భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండానే పట్టా మార్పు చేసినట్లు తెలిసింది. ప్రజావాణిలో ఫిర్యాదుతో.. అలాగే మండలంలోని పోతులమడుగు అనుబంధ గ్రామమైన గోపన్నపల్లిలో సర్వే నంబరు 165లో ఎకరా భూమిని కొనుగోలు చేసుకొని పట్టా చేసుకున్నారు. చెన్నయ్య 2012లో మృతి చెందడంతో భార్య మాల ఊషమ్మ పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో మార్చారు. భర్త మృతి చెందిన కొద్ది నెలలకే మాల ఊషమ్మ సైతం మృతిచెందింది. ఈమెకు మాల శంకరయ్య, వెంకటయ్య అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ తల్లి పేరు మీద ఉన్న సర్వే నంబరు 165లో ఉన్న ఒక ఎకరా భూమిని విరాసత్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే వెంకటయ్య భార్య మరణించిన కేసులో ఆయనకు మూడు నెలల జైలుశిక్ష పడింది. వెంకటయ్య జైలులో ఉన్న సమయంలోనే ఆయన అన్న శంకరయ్య, తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది, సంబంధిత అధికారులతో కుమ్మక్కై మొత్తం తన పేరిట పట్టా చేయించుకున్నాడు. జైలును శిక్ష అనుభవించి వచ్చిన వెంకటయ్య ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నేళ్లు వలస వెళ్లాడు. ఏడాది క్రితం భూమి విషయమై అన్న శంకరయ్యను అడగగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని తిరగడంతో అనుమానం వచ్చిన వెంకటయ్య గత నెల 24న ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ స్థానిక తహసీల్దార్‌కు శంకరయ్య ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. న్యాయం చేయాలి.. నేను నా భార్య మృతి కేసులో మూడు నెలలు జైలు జీవితం అనుభవించే సమయంలో రెవెన్యూ అధికారులు లంచం తీసుకొని మా అన్న పేరిట పట్టా చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత మా అన్న శంకరయ్యతో కలిసి విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. పంచనామాలో ఇద్దరు పేర్లు రాసిచ్చాం. ఇద్దరికి భూమి చేయకుండా మా అన్న శంకరయ్య పేరిటే విరాసత్ చేశారు. విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి. విరాసత్ ప్రకారం నా భాగం నాకు పట్టా చేయాలి. -
పోలీసు శాఖ అప్రమత్తం
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియల తొలికీలక ఘట్టం.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నామినేషన్ల స్వీకరణకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం కేటాయించారు. దీంతో పోలీసులు ముందస్తుగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కార్యాలయం చుట్టూ పహారా.. వేములవాడ అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం చుట్టూ పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు. సబ్‌డివిజన్‌లోని పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ వెంకటరమణ స్వయంగా బందోబస్తును పర్యవేక్షిస్తూ వారికి సూచనలు చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలు, 50 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. మండల పరిషత్ ఆవరణలోకి వస్తున్న వారిని ప్రశ్నిస్తూ వదిలిపెడుతున్నారు. 3 గంటల తర్వాత నోఎంట్రీ.. ఎన్నికల కార్యాలయమైన స్థానిక తహసీల్దార్ ఆఫీసులోకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు మినహా మిగతా వారినెవ్వరినీ అనుమతించడం లేదు. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చేవారిని పూర్తి వివరాలు అడిగి తెసుకుని నిర్ధారించుకున్నాకే లోనికి అనుమతిస్తున్నారు. రిటర్నింగ్ అధికారి చాంబర్లోకి కేవలం నామినేషన్ పత్రాలు సమర్పించే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీస్తూ ఎప్పటికప్పుడు డీపీఆర్వో కార్యాలయం సిబ్బంది మీడియాకు అందజేస్తున్నారు. నేడు వేములవాడకు మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి హరీశ్‌రావు వేములవాడకు వస్తున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌బాబు తెలిపారు. ఉదయం 9 గంటలకు వేములవాడకు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.30కు రుద్రంగిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అక్కడ్నుంచి కథలాపూర్ మండలం సూరమ్మ చెరువును పరిశీలిస్తారు. తిరుగు పయనంలో చందుర్తి మండలం మల్యాలలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు. -
'తహసీల్' భవన నిర్మాణమెప్పుడో..?
రామగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణం చేపట్టేదెన్నడని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న పంచాయతీలను ఏర్పా టు చేసింది. దీనిలో భాగంగానే నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో కొత్తగా రామగిరి మండలాన్ని ఏర్పాటు చేశారు. ముత్తారం: రామగిరి మండలకేంద్రంలోని సెంటినరీకాలనీలో సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్లలో తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశారు. నూతనంగా క్వార్టర్లలో ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయాన్ని 2016 అక్టోబర్ 11న మంత్రి ఈటల రాజేందర్ చేతులమీదుగా ప్రారంభించారు. అయితే ఇరుగ్గా ఉన్న క్వార్టర్లలో తహసీల్దార్ కార్యాలయ నిర్వహణ అధికారులకు కత్తి మీద సాములా మారింది. దీంతో నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.70లక్షల నిధులను మంజూరు చేసింది. నూతన భవన నిర్మాణం కోసం సింగరేణి సంస్థ పోస్టాఫీస్ ఎదురుగా అంగడి మార్కెట్ సమీపంలో ఎకరం స్థలాన్ని కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న తహసీల్దార్ కార్యాలయం పేరిట లీజ్ రిజిస్ట్రేషన్ చేసింది. అయితే సంబంధిత ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. దాదాపు నిధులు మంజూరై ఏడాది, స్థలం కేటాయించి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. పక్కా భవనం లేక.. నియోజకవర్గంలో విస్తీర్ణంలో, జనాభాలో రామగిరి మండలం రెండో స్థానంలో ఉంటుంది. ఇలాంటి మండలంలో తహసీల్దార్ కార్యాలయానికి పక్కా భవనం లేక ఇరుగ్గా ఉన్న సింగరేణి క్వార్టర్లో నిర్వహించడంతో.. ఇటు ప్రజలు, అటు రెవెన్యూ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
అడుగడుగునా తనిఖీలు..
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గంలో తనిఖీలు గురువారం ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని వేములవాడటౌన్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనారావుపేట, కథలాపూర్, మేడిపల్లి మండలాల పోలీసులు బృందాలుగా విడిపోయి రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు. దీంతో అడుగడుగునా తనిఖీలు జరుగుతున్నాయంటూ వేములవాడ రాజన్న దర్శనం కోసం వస్తున్న భక్తులతోపాటు స్థానికులు, ఇతర జిల్లాలకు చెందిన వారు పేర్కొంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు తనిఖీలు ఇలాగే ఉంటాయని రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ పేర్కొన్నారు. ఇందుకు తనిఖీ బృందాలతోపాటు మోడల్ కోడ్ బృందాలు సైతం చురుకుగా పని చేస్తున్నట్లు చెప్పారు. అధికారులే వీడియోగ్రాఫర్లు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెల రోజుల నుంచి వీడియో, ఫొటోలు తీసే కార్యక్రమాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన అధికారులు హఠాత్తుగా వారిని విధుల్లోంచి తొలగించి వేశారు. దీంతో బుధ, గురువారాలు అధికారులే తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీస్తూ ఉన్నతాధికారులకు చేరవేశారు. అయితే వీడియో గ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్ల స్థానంలో కొత్తగా వీడియోలు, ఫొటో కెమెరాలు కొనుగోలు చేసి వీఆర్ఏలతో వీటి పనులు చేయించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే వీడియో కెమెరాలు, ఫొటో కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో మోడల్ కోడ్ బృందాల్లో పని చేస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులే తమతమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయాల్సి వచ్చింది. డబ్బులకు లెక్కలు చూపాల్సిందే : ఎన్నికల నేపథ్యంలో కోడ్ కచ్చితంగా అమలు పరిచే క్రమంలో డబ్బుల తరలింపు అంశంలో డబ్బులకు సంబంధించిన లెక్కలు తప్పకుండా అధికారులకు చూపించాల్సి ఉంటుందని రిటర్నింగ్ అధికారి పేర్కొంటున్నారు. ప్రజలు ఎక్కడ నుంచి ఎక్కడైనా డబ్బులు తీసుకెళ్లే అవకాశం ఉందని, అయితే తప్పకుండా ఆ డబ్బులకు సంబంధించిన లెక్కలు తప్పకుండా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారులకు చూపించాలని విజ్ఞప్తి చేశారు. మీటింగుల్లోనే అధికారులు : తమతమ అవసరాల కోసం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు ఎన్నికల విధుల కారణంగా అధికారులు అందుబాటులో ఉండలేకపోతున్నారు. ఎవరిని ప్రశ్నించినా ఎన్నికలకు సంబంధించి మీటింగ్‌లో ఉన్నారన్న సమాధానమే వస్తోంది. దీంతో భూములు, రెవెన్యూ, సర్టిఫికేట్లు, ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించిన పనులకు అధికారులు అందుబాటులో ఉండటం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. చేసేది లేక జనం వెనుదిరిగి వెళ్లి పోతున్నారు. -
పోలీస్ జులుం నశించాలంటూ వీఆర్ఏల నిరసన
రాయచోటి : పోలీస్ జులుం నశించాలంటూ మంగళవారం రాయచోటి మండలంలోని వీఆర్ఏలు నల్లబ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి తగాదా విషయంలో అనవసరంగా పోలీసులు జోక్యం చేసుకొని, తమపై దాడి చేస్తున్నారంటూ వాపోయారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి దూషిస్తున్నారని, దీన్ని వ్యతిరేకించి వాస్తవాలు మాట్లాడుతుంటే కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు డిమాండ్ చేశారు. నిరసనలో వీఆర్ఏలు రామమోహన్, శ్రీనివాసులు, వెంకటేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.