అడుగడుగునా తనిఖీలు..  | Officers Are Become Videographers In Election Inspection | Sakshi
Sakshi News home page

అడుగడుగునా తనిఖీలు.. 

Published Fri, Nov 9 2018 3:06 PM | Last Updated on Fri, Nov 9 2018 3:06 PM

Officers Are Become Videographers In Election Inspection - Sakshi

వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గంలో తనిఖీలు గురువారం ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని వేములవాడటౌన్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనారావుపేట, కథలాపూర్, మేడిపల్లి మండలాల పోలీసులు బృందాలుగా విడిపోయి రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు. దీంతో అడుగడుగునా తనిఖీలు జరుగుతున్నాయంటూ వేములవాడ రాజన్న దర్శనం కోసం వస్తున్న భక్తులతోపాటు స్థానికులు, ఇతర జిల్లాలకు చెందిన వారు పేర్కొంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు తనిఖీలు ఇలాగే ఉంటాయని రిటర్నింగ్‌ అధికారి ఖిమ్యానాయక్‌ పేర్కొన్నారు. ఇందుకు తనిఖీ బృందాలతోపాటు మోడల్‌ కోడ్‌ బృందాలు సైతం చురుకుగా పని చేస్తున్నట్లు చెప్పారు.  

అధికారులే వీడియోగ్రాఫర్లు:
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెల రోజుల నుంచి వీడియో, ఫొటోలు తీసే కార్యక్రమాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించిన అధికారులు హఠాత్తుగా వారిని విధుల్లోంచి తొలగించి వేశారు. దీంతో బుధ, గురువారాలు అధికారులే తమ మొబైల్‌ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీస్తూ ఉన్నతాధికారులకు చేరవేశారు. అయితే వీడియో గ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్ల స్థానంలో కొత్తగా వీడియోలు, ఫొటో కెమెరాలు కొనుగోలు చేసి వీఆర్‌ఏలతో వీటి పనులు చేయించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే వీడియో కెమెరాలు, ఫొటో కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో మోడల్‌ కోడ్‌ బృందాల్లో పని చేస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులే తమతమ మొబైల్‌ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయాల్సి వచ్చింది. 
 
డబ్బులకు లెక్కలు చూపాల్సిందే :
ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ కచ్చితంగా అమలు పరిచే క్రమంలో డబ్బుల తరలింపు అంశంలో డబ్బులకు సంబంధించిన లెక్కలు తప్పకుండా అధికారులకు చూపించాల్సి ఉంటుందని రిటర్నింగ్‌ అధికారి పేర్కొంటున్నారు. ప్రజలు ఎక్కడ నుంచి ఎక్కడైనా డబ్బులు తీసుకెళ్లే అవకాశం ఉందని, అయితే తప్పకుండా ఆ డబ్బులకు సంబంధించిన లెక్కలు తప్పకుండా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారులకు చూపించాలని విజ్ఞప్తి చేశారు.  

మీటింగుల్లోనే అధికారులు :
తమతమ అవసరాల కోసం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు ఎన్నికల విధుల కారణంగా అధికారులు అందుబాటులో ఉండలేకపోతున్నారు. ఎవరిని ప్రశ్నించినా ఎన్నికలకు సంబంధించి మీటింగ్‌లో ఉన్నారన్న సమాధానమే వస్తోంది. దీంతో భూములు, రెవెన్యూ, సర్టిఫికేట్లు, ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించిన పనులకు అధికారులు అందుబాటులో ఉండటం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. చేసేది లేక జనం వెనుదిరిగి వెళ్లి పోతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement