vemulawada constituency
-
వేములవాడ పాలిటిక్స్.. పరోక్షంగా చెన్నమనేని కౌంటర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో పార్టీలో కోల్డ్ వార్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చెన్నమనేనికి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(వ్యవసాయ రంగ వ్యవహారాలుగా నియమించిన విషయం తెలిసిందే. అనంతరం, సీఎం కేసీఆర్‌ను చెన్నమ్మనేని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక, తాజాగా చెన్నమనేని వేములవాడలో నెలకొన్న అంతర్గత సంక్షోభం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, గురువారం చెన్నమనేని తన తండ్రి రాజేశ్వర రావు శతజయంతి ఉత్సవాల కోసం వేములవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజకీయాలంటే స్వచ్చంద సంస్థలు, ఫౌండేషన్ల పెట్టి ప్రచారం చేసుకోవడం కాదు. తాము చేసిన నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో నిలవాలి. అందుకు నా తండ్రి చెన్నమనేని రాజేశ్వర రావు ఒక ఉదాహరణ అంటూ ప్రత్యర్థులకు పరోక్షంగా చురకలు అంటించారు. ఇదే క్రమంలో ఆయన.. తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి సారథ్యంలో మా తండ్రి చేసిన పోరాటం మరువలేనిది. సాగునీటి ప్రాజెక్టుల కొరకు ఆయన చేసిన ఉద్యమాలు, పాదయాత్రలు, నిరసన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే కాళేశ్వరం ప్యాకేజ్-9లోని మల్కపేట రిజర్వాయర్‌కు చెన్నమనేని రాజేశ్వర్ రావు పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పడం విశేషం. అందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: సస్పెన్స్ ఓవర్.. కేసీఆర్‌ను కలిసిన చెన్నమనేని -
సస్పెన్స్ ఓవర్.. కేసీఆర్‌ను కలిసిన చెన్నమనేని
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పలువురు సిట్టింగ్‌లకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన కేసీఆర్.. పలువురు నేతలకు కీలక పదవులు, బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు(వ్యవసాయ రంగ వ్యవహారాలు)గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సీఎం కేసీఆర్‌ను చెన్నమనేని ప్రగతిభవన్‌లో కలిశారు. తనను వ్యవసాయ రంగ ప్రధాన సలహాదారుగా నియమించినందుకు కేసీఆర్‌ను చెన్నమనేని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల నుంచి వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేవలం దశాబ్ది కాలంలోపే అధిగమించిందని తెలిపారు. చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తా.. సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ రాష్ట్రం నేడు వ్యవసాయ విధానాల అమలులో, వ్యవసాయాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయ అభివృద్ధి, రెండవ దశలో భవిష్యత్తు సవాళ్లకు సిద్దమౌతున్న సమయంలో సీఎం తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఎమ్మెల్యే రమేశ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెన్నమనేనికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఇక, కేసీఆర్‌తో భేటీ తర్వాత వేములవాడ బీఆర్ఎస్ రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఒకింత బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. చెన్నమనేని ఏం చెబుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: ఎన్నికలకు ఇంకా మూడు నెలలుంది.. ఎమ్మెల్యే రాజయ్య షాకింగ్ కామెంట్స్ -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. కేటీఆర్ అనుచరుడికి సీటు!
ఆ నియోజకవర్గంలో టిక్కెట్ వార్తతో పాటు ఫ్లెక్సీల వార్ కూడా తీవ్రమవుతోంది. టిక్కెట్ రాదేమో అన్న ఆందోళనతో సిటింగ్ ఎమ్మెల్యే అసహనానికి గురవుతున్నారట. ఇంతకుముందు ప్రత్యర్థి పార్టీలతో యుద్ధం చేశారు. ఇప్పుడు పార్టీలోనే కోల్డ్ వార్ సాగుతోంది. టిక్కెట్ కోసం మరో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ ఎమ్మెల్యే ఎవరు?.. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ఒకవైపు పౌరసత్వ కేసు.. మరోవైపు సొంతపార్టీలో సీటు గొడవ నిద్రలేకుండా చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి సాగుతున్న పౌరసత్వ కేసు ఇంకా కొలిక్కి రాకపోవడం.. ఇంటిగోల కలిసి రమేష్ బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎమ్మెల్యే కావాలన్న తన చిరకాల కోరిక తీర్చుకోవాలనుకున్న చల్మెడ లక్ష్మీనర్సింహారావు కొద్దికాలం క్రితమే కాంగ్రెస్‌ను వీడి కారెక్కడంతో రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇద్దరూ కోనరావుపేట మండలానికి చెందినవారే. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గం వారే. ఈ ఈక్వేషన్స్‌తోనే ఇద్దరి మధ్యా పార్టీలో కోల్డ్ వార్ మొదలైంది. ఇదిలాఉంటే.. గులాబీ పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఫ్లెక్సీల గొడవ ఓ ఆరని చిచ్చులా మారింది. ఈ చిచ్చును ఆర్పే ఫైరింజన్స్ కూడా లేకపోవడంతో.. అవి ఇంకా భగ్గున మండుతూనే ఉన్నాయి. ఈమధ్యే చల్మెడ బర్త్ డే వేడుకల సందర్భంగా వేములవాడ పట్టణ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్.. చల్మెడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అందులో ఎమ్మెల్యే ఫోటో చిన్నగా వేయడం.. చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఫోటో పెద్దగా వేయడంతో వివాదం మొదలైంది. పోలీసులు రాత్రికి రాత్రే విజయ్‌ని పిలిచి మందలించారు. ఫ్లెక్సీలను తొలగించాలని పోలీసులు బెదిరించినట్టు విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదైనా ఉంటే పార్టీ పరంగా ఫిర్యాదు చేయాలి. కానీ.. పోలీసుల జోక్యం ఎందుకు అని విజయ్ ప్రశ్న. గతంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కట్టినా ఇదే విధంగా రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని వాపోయాడు. ఈ ఫ్లెక్సీల వివాదం ఇదే మొదటిసారి కాదు.. చివరిదీ కాదన్నట్టుగా తయారైంది. గత శివరాత్రి సమయంలో చల్మెడతో పాటు.. వేములవాడ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న ఏనుగు మనోహర్ రెడ్డి ఫ్లెక్సీలనూ భారీగా ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే కోపానికి కారణమైంది. అంతేకాదు ఈమధ్య కొన్ని సమావేశాల్లో రమేష్ బాబు అసహనంగా మాట్లాడటం.. పార్టీలోని అంతర్గత ప్రత్యర్థులకు తాకేలా కామెంట్స్ చేయడమూ అలవాటుగా మారింది. తన టిక్కెట్ పై నెలకొన్న సందేహాలపై మీడియాలో వార్తలు రావడాన్ని కూడా రమేష్ బాబు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. చల్మెడ లక్ష్మీనర్సింహారావు వేములవాడలో యాక్టివ్ అవుతుండటంతో ఇద్దరి మధ్యా వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆఫీస్ విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్లో.. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు, పరువునష్టం దావా వేస్తామన్న వార్నింగ్‌పై ఇప్పుడు వేములవాడలో చర్చ నడుస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావుకు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనడం కంటే పార్టీలో అంతర్గత ప్రత్యర్థులతో ఫైట్ చేయడమే టఫ్ టాస్క్‌లా మారింది. పౌరసత్వ సమస్యతో ఈసారి రమేష్ బాబుకు టిక్కెట్ వస్తుందా? రాదా అన్న సందేహాల నడుమ చల్మెడ యాక్టివ్ కావడం.. కేటీఆర్ అనుచరుడుగా ఉన్న ఏనుగు మనోహర్ రెడ్డి కూడా టికెట్‌పై ధీమాగా ఉండటం మొత్తంగా గందరగోళం కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఆర్ఐ గోలి మోహన్ కూడా తనకే టిక్కెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే! -
కేటీఆర్ వేములవాడను దత్తత తీసుకోవాలి: షర్మిల
కథలాపూర్ (వేములవాడ): ‘మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక ఉందని దత్తత తీసుకోవడం కాదు. మీ నియోజకవర్గం పక్కన ఉన్న వేములవాడ నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలి’అని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగించారు. కథలాపూర్‌లో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు యాదాద్రిపై ఉన్న ప్రేమ వేములవాడ రాజన్నపై లేదని మండిపడ్డారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని చెప్పిన పాలకులు హామీని విస్మరించారని మండిపడ్డారు. యాదాద్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని కేసీఆర్ అక్కడ అభివృద్ధికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీ దేశంలో ఉంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే లేడని పక్క నియోజకవర్గానికి చెందిన కేటీఆర్‌కు తెలుసు. వేములవాడను కేటీఆర్ దత్తత తీసుకోవచ్చు కదా?’అని ఆమె ప్రశ్నించారు. -
ప్రయాణికుడి ట్వీట్.. స్పందించిన సజ్జనార్
వేములవాడ: ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. వేములవాడకు చెందిన వెల్దండి సదానందం ఈనెల 6న వేములవాడ నుంచి కరీంనగర్‌కు బస్సులో ప్రయాణించారు. ఆ సమయంలో డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో వీడియో తీసి ట్విట్టర్లో సజ్జనార్‌కు పోస్టుచేశారు. దీనిపై స్పందించిన సజ్జనార్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చదవండి: Drunk And Drive Test: ఇక రోజూ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చుక్కేస్తే.. చిక్కినట్టే! అదేరోజు కరీంనగర్లో దిగి బస్టాండ్‌లో మరుగుదొడ్ల నిర్వహణ, వాటర్ బాటిళ్ల అమ్మకాలపై అధిక వసూళ్లు చేస్తున్నట్లు పోస్టు చేయడంతో వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్లే క్రమంలో కండక్టర్ మాస్క్ లేకుండా విధులు నిర్వహిస్తున్న ఫొటో షేర్ చేయడంతో కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. -
పౌరసత్వం రద్దుపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలపై టీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పందించారు. భారతీయ పౌరుడిగా తన పౌరసత్వ పరిరక్షణకు మళ్ళి హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. ద్వంద్వ పౌరసత్వ వివాదంలో జూలై 15, 2019న హైకోర్టు తీర్పు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చిందని, ఈ ఆదేశాలను కేంద్ర హోంశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నా పౌరసత్వాన్ని 2017లో కేంద్ర హోంశాఖ రద్దు చేయడంతో దీనిపై హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. అనంతరం సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం గత జూలై 15న నా పౌరసత్వ రద్దును కొట్టివేసింది. పౌరసత్వ చట్టం నియమ నిబంధనల ప్రకారం నా దరఖాస్తులను సమగ్రంగా, హేతుబధ్ధంగా, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలే తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయంలో మా రీ-అప్పీలుపై హైకోర్టు స్పందిస్తూ ఒక వేళ సెక్షన్ 10.3ను పరిగణించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా.. న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని తేల్చిచెప్పింది. ఈ ఆదేశాల మేరకే గత నెల 31న ఢిల్లీలో మరోసారి వాదనలు జరిగాయి. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం’ అని అన్నారు. తన పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని, తనకు తప్పక న్యాయం జరుగుతుందని చెన్నమనేని రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. -
అడుగడుగునా తనిఖీలు..
వేములవాడ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గంలో తనిఖీలు గురువారం ముమ్మరం చేశారు. నియోజకవర్గంలోని వేములవాడటౌన్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనారావుపేట, కథలాపూర్, మేడిపల్లి మండలాల పోలీసులు బృందాలుగా విడిపోయి రోడ్డుపై తనిఖీలు నిర్వహించారు. దీంతో అడుగడుగునా తనిఖీలు జరుగుతున్నాయంటూ వేములవాడ రాజన్న దర్శనం కోసం వస్తున్న భక్తులతోపాటు స్థానికులు, ఇతర జిల్లాలకు చెందిన వారు పేర్కొంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు తనిఖీలు ఇలాగే ఉంటాయని రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ పేర్కొన్నారు. ఇందుకు తనిఖీ బృందాలతోపాటు మోడల్ కోడ్ బృందాలు సైతం చురుకుగా పని చేస్తున్నట్లు చెప్పారు. అధికారులే వీడియోగ్రాఫర్లు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెల రోజుల నుంచి వీడియో, ఫొటోలు తీసే కార్యక్రమాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన అధికారులు హఠాత్తుగా వారిని విధుల్లోంచి తొలగించి వేశారు. దీంతో బుధ, గురువారాలు అధికారులే తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీస్తూ ఉన్నతాధికారులకు చేరవేశారు. అయితే వీడియో గ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్ల స్థానంలో కొత్తగా వీడియోలు, ఫొటో కెమెరాలు కొనుగోలు చేసి వీఆర్ఏలతో వీటి పనులు చేయించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే వీడియో కెమెరాలు, ఫొటో కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో మోడల్ కోడ్ బృందాల్లో పని చేస్తున్న పోలీసు, రెవెన్యూ అధికారులే తమతమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీయాల్సి వచ్చింది. డబ్బులకు లెక్కలు చూపాల్సిందే : ఎన్నికల నేపథ్యంలో కోడ్ కచ్చితంగా అమలు పరిచే క్రమంలో డబ్బుల తరలింపు అంశంలో డబ్బులకు సంబంధించిన లెక్కలు తప్పకుండా అధికారులకు చూపించాల్సి ఉంటుందని రిటర్నింగ్ అధికారి పేర్కొంటున్నారు. ప్రజలు ఎక్కడ నుంచి ఎక్కడైనా డబ్బులు తీసుకెళ్లే అవకాశం ఉందని, అయితే తప్పకుండా ఆ డబ్బులకు సంబంధించిన లెక్కలు తప్పకుండా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అధికారులకు చూపించాలని విజ్ఞప్తి చేశారు. మీటింగుల్లోనే అధికారులు : తమతమ అవసరాల కోసం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు ఎన్నికల విధుల కారణంగా అధికారులు అందుబాటులో ఉండలేకపోతున్నారు. ఎవరిని ప్రశ్నించినా ఎన్నికలకు సంబంధించి మీటింగ్‌లో ఉన్నారన్న సమాధానమే వస్తోంది. దీంతో భూములు, రెవెన్యూ, సర్టిఫికేట్లు, ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించిన పనులకు అధికారులు అందుబాటులో ఉండటం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. చేసేది లేక జనం వెనుదిరిగి వెళ్లి పోతున్నారు. -
వేములవాడకు ఎల్లంపల్లి నీళ్లు
మేడిపెల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని భూములకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తెలిపారు. గురువారం మేడిపెల్లి, కట్లకుంటలో ‘మన ఊరు-మన ప్రణాళిక’పై జరిగిన గ్రామసభల్లో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని 97 వేల ఎకరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. చందుర్తి మండలం రుద్రంగి శివారులో ఉన్న చెరువును నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మేడిపెల్లిలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, ఎంపీపీ పల్లి జమున, నియోజకవర్గ ఇన్చార్జి అంబయ్య, మండల పరిశీలకుడు శాంతికుమార్, తహశీల్దార్ వసంత, ఎంపీడీవో సుందరవరదరాజన్, ఎంఈవో జితేందర్‌రావు, సర్పంచులు బొంగోని రాజాగౌడ్, గౌరి భూమయ్య, రాములు, అంగడి ఆనందం, చెట్ట గంగరాజు, ఎంపీటీసీలు కుందారపు అన్నపూర్ణ, దాసరి శంకర్, సురకంటి విజయనారాయణరెడ్డి, భూమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని, ఆయన భారతీయపౌరుడు కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. భారతీయ పౌరుడి హోదాలో ఓటర్ల జాబితాలో ఆయనపేరు చేర్చడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు బుధవారం తీర్పు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా తీర్పు అమలును 4వారాల పాటు నిలుపుదల చేయాలని రమేష్ తరఫు న్యాయవాది కోరగా.. రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.రమేష్ సీనియర్ రాజకీయవేత్త సీహెచ్.రాజేశ్వరరావు కుమారుడు. 2009 సాధారణ ఎన్నికల్లో ఆయన వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. రమేష్ అంతకుముందే జర్మనీలో స్థిరపడి, అక్కడి పౌరసత్వం పొందారు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన కొద్ది రోజులకే ఇక్కడి పౌరసత్వ ధ్రువీకరణ పొందారు. అనంతరం వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రమేష్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ రమేష్ పౌరసత్వంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. హోంశాఖ విచారణ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆది శ్రీనివాస్ 2010 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. భారత పౌరసత్వ చట్టం ప్రకారం దేశంలో పుట్టిన వ్యక్తి విదేశాల్లో స్థిరపడి, అక్కడి పౌరసత్వం తీసుకుంటే.. ఆ తరువాత తిరిగి భారతదేశానికి వచ్చి వరుసగా సంవత్సరం పాటు నివసిస్తేనే భారత పౌరుడిగా పరిగణించాలని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. కానీ, చెన్నమనేని వరుసగా కేవలం 96 రోజులు మాత్రమే దేశంలో నివాసం ఉన్నారని, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5(ఎఫ్) ప్రకా రం ఆయనను భారత పౌరుడిగా భావించడానికి వీలులేదన్నారు. తప్పుడు నివేదికలు సమర్పించి పౌరసత్వ ధ్రువీకరణ పత్రం పొందారన్న ఆది శ్రీనివాస్ వాదనతోన్యాయమూర్తి ఏకీభవించారు. ఈకేసులో రమేష్ వ్యవహారశైలిని సైతం న్యాయ మూర్తి తప్పుబట్టారు. ఎన్నిరోజులు దేశంలో నివాసం ఉన్నారనే విషయాన్ని తే ల్చేందుకు పాస్‌పోర్ట్ కీలకమైనదని, కానీ దానిని కోర్టు ముందుంచడంతో రమేష్ విఫలమయ్యారన్నారు. తాను ఏడాదిపాటు దేశంలో ఉన్నట్లు నిరూపించడంలో చెన్నమనేని విఫలయ్యారని, రమేష్ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం కూడా చట్టవిరుద్ధమని, ఎమ్మెల్యేగా రమేష్ ఎన్నిక చెల్లుబాటుకాదని తీర్పులో పేర్కొన్నారు. ఆది శ్రీనివాస్ పోరాటం...: చెన్నమనేని 2004 ఎన్నికల్లోనే టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు యత్నించి, భారత పౌరసత్వం లభించకపోవడంతో పోటీ చేయలేకపోయారు. అప్పటినుంచి పౌరసత్వం సంపాదించేందుకు ప్రయత్నాలు కొనసాగించి.. చివరకు ఎన్నికల సంఘం నుంచి ఓటరు గుర్తింపు కార్డు, భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రం పొందారు. వాటి ఆధారంగా వేములవాడ నియోజకవర్గంలో ఓటరుగా తన పేరును నమోదు చేసుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి, 1821 ఓట్ల మెజారిటీతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఆ తర్వాత ఆది శ్రీనివాస్ దీనిపై 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దాంతో కేంద్ర హోంశాఖ రమేష్‌కు షోకాజు నోటీసు జారీ చేసి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కరీంనగర్ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను ఆదేశించింది. వారు విచారణ జరిపి చెన్నమనేని రమేష్ 96 రోజులు మాత్రమే వరుసగా దేశంలో ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. అయితే.. అదే సమయంలో చెన్నమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లోచేరారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవిలో లేరన్న కారణంతో హైకోర్ట పిటిషన్‌ను కొట్టివేసింది. అదే స్థానంలో 2010 జూలైలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన రమేశ్ మళ్లీ ఆది శ్రీనివాస్‌పై గెలిచారు. శ్రీనివాస్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ కొన సాగి, ప్రస్తుతం తీర్పు వెలువడింది. రమేష్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. తీర్పుపై సుప్రీంకోర్టును కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.