ఆ నియోజకవర్గంలో టిక్కెట్ వార్తతో పాటు ఫ్లెక్సీల వార్ కూడా తీవ్రమవుతోంది. టిక్కెట్ రాదేమో అన్న ఆందోళనతో సిటింగ్ ఎమ్మెల్యే అసహనానికి గురవుతున్నారట. ఇంతకుముందు ప్రత్యర్థి పార్టీలతో యుద్ధం చేశారు. ఇప్పుడు పార్టీలోనే కోల్డ్ వార్ సాగుతోంది. టిక్కెట్ కోసం మరో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ ఎమ్మెల్యే ఎవరు?..
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ఒకవైపు పౌరసత్వ కేసు.. మరోవైపు సొంతపార్టీలో సీటు గొడవ నిద్రలేకుండా చేస్తున్నాయి. అనేక సంవత్సరాల నుంచి సాగుతున్న పౌరసత్వ కేసు ఇంకా కొలిక్కి రాకపోవడం.. ఇంటిగోల కలిసి రమేష్ బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎమ్మెల్యే కావాలన్న తన చిరకాల కోరిక తీర్చుకోవాలనుకున్న చల్మెడ లక్ష్మీనర్సింహారావు కొద్దికాలం క్రితమే కాంగ్రెస్‌ను వీడి కారెక్కడంతో రచ్చ మొదలైంది. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇద్దరూ కోనరావుపేట మండలానికి చెందినవారే. పైగా ఇద్దరూ ఒకే సామాజికవర్గం వారే. ఈ ఈక్వేషన్స్‌తోనే ఇద్దరి మధ్యా పార్టీలో కోల్డ్ వార్ మొదలైంది.
ఇదిలాఉంటే.. గులాబీ పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొంతకాలంగా సాగుతున్న ఫ్లెక్సీల గొడవ ఓ ఆరని చిచ్చులా మారింది. ఈ చిచ్చును ఆర్పే ఫైరింజన్స్ కూడా లేకపోవడంతో.. అవి ఇంకా భగ్గున మండుతూనే ఉన్నాయి. ఈమధ్యే చల్మెడ బర్త్ డే వేడుకల సందర్భంగా వేములవాడ పట్టణ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్.. చల్మెడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అందులో ఎమ్మెల్యే ఫోటో చిన్నగా వేయడం.. చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఫోటో పెద్దగా వేయడంతో వివాదం మొదలైంది. పోలీసులు రాత్రికి రాత్రే విజయ్‌ని పిలిచి మందలించారు. ఫ్లెక్సీలను తొలగించాలని పోలీసులు బెదిరించినట్టు విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదైనా ఉంటే పార్టీ పరంగా ఫిర్యాదు చేయాలి. కానీ.. పోలీసుల జోక్యం ఎందుకు అని విజయ్ ప్రశ్న. గతంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కట్టినా ఇదే విధంగా రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని వాపోయాడు. ఈ ఫ్లెక్సీల వివాదం ఇదే మొదటిసారి కాదు.. చివరిదీ కాదన్నట్టుగా తయారైంది.
గత శివరాత్రి సమయంలో చల్మెడతో పాటు.. వేములవాడ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్న ఏనుగు మనోహర్ రెడ్డి ఫ్లెక్సీలనూ భారీగా ఏర్పాటు చేయడం ఎమ్మెల్యే కోపానికి కారణమైంది. అంతేకాదు ఈమధ్య కొన్ని సమావేశాల్లో రమేష్ బాబు అసహనంగా మాట్లాడటం.. పార్టీలోని అంతర్గత ప్రత్యర్థులకు తాకేలా కామెంట్స్ చేయడమూ అలవాటుగా మారింది. తన టిక్కెట్ పై నెలకొన్న సందేహాలపై మీడియాలో వార్తలు రావడాన్ని కూడా రమేష్ బాబు జీర్ణించుకోలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. చల్మెడ లక్ష్మీనర్సింహారావు వేములవాడలో యాక్టివ్ అవుతుండటంతో ఇద్దరి మధ్యా వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆఫీస్ విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్లో.. ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు, పరువునష్టం దావా వేస్తామన్న వార్నింగ్‌పై ఇప్పుడు వేములవాడలో చర్చ నడుస్తోంది.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావుకు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనడం కంటే పార్టీలో అంతర్గత ప్రత్యర్థులతో ఫైట్ చేయడమే టఫ్ టాస్క్‌లా మారింది. పౌరసత్వ సమస్యతో ఈసారి రమేష్ బాబుకు టిక్కెట్ వస్తుందా? రాదా అన్న సందేహాల నడుమ చల్మెడ యాక్టివ్ కావడం.. కేటీఆర్ అనుచరుడుగా ఉన్న ఏనుగు మనోహర్ రెడ్డి కూడా టికెట్‌పై ధీమాగా ఉండటం మొత్తంగా గందరగోళం కొనసాగుతోంది. మరోవైపు ఎన్ఆర్ఐ గోలి మోహన్ కూడా తనకే టిక్కెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: కూతురు ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. ఏమన్నారంటే!
Comments
Please login to add a commentAdd a comment