చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని, ఆయన భారతీయపౌరుడు కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. భారతీయ పౌరుడి హోదాలో ఓటర్ల జాబితాలో ఆయనపేరు చేర్చడం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు బుధవారం తీర్పు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా తీర్పు అమలును 4వారాల పాటు నిలుపుదల చేయాలని రమేష్ తరఫు న్యాయవాది కోరగా.. రాతపూర్వకంగా పిటిషన్ దాఖలు చేసుకుంటే పరిశీలిస్తామని న్యాయమూర్తి తెలిపారు.రమేష్ సీనియర్ రాజకీయవేత్త సీహెచ్.రాజేశ్వరరావు కుమారుడు.
2009 సాధారణ ఎన్నికల్లో ఆయన వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. రమేష్ అంతకుముందే జర్మనీలో స్థిరపడి, అక్కడి పౌరసత్వం పొందారు. అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన కొద్ది రోజులకే ఇక్కడి పౌరసత్వ ధ్రువీకరణ పొందారు. అనంతరం వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో రమేష్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ రమేష్ పౌరసత్వంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. హోంశాఖ విచారణ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేగా చెన్నమనేని రమేష్ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆది శ్రీనివాస్ 2010 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
భారత పౌరసత్వ చట్టం ప్రకారం దేశంలో పుట్టిన వ్యక్తి విదేశాల్లో స్థిరపడి, అక్కడి పౌరసత్వం తీసుకుంటే.. ఆ తరువాత తిరిగి భారతదేశానికి వచ్చి వరుసగా సంవత్సరం పాటు నివసిస్తేనే భారత పౌరుడిగా పరిగణించాలని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. కానీ, చెన్నమనేని వరుసగా కేవలం 96 రోజులు మాత్రమే దేశంలో నివాసం ఉన్నారని, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 5(ఎఫ్) ప్రకా రం ఆయనను భారత పౌరుడిగా భావించడానికి వీలులేదన్నారు. తప్పుడు నివేదికలు సమర్పించి పౌరసత్వ ధ్రువీకరణ పత్రం పొందారన్న ఆది శ్రీనివాస్ వాదనతోన్యాయమూర్తి ఏకీభవించారు. ఈకేసులో రమేష్ వ్యవహారశైలిని సైతం న్యాయ మూర్తి తప్పుబట్టారు. ఎన్నిరోజులు దేశంలో నివాసం ఉన్నారనే విషయాన్ని తే ల్చేందుకు పాస్‌పోర్ట్ కీలకమైనదని, కానీ దానిని కోర్టు ముందుంచడంతో రమేష్ విఫలమయ్యారన్నారు. తాను ఏడాదిపాటు దేశంలో ఉన్నట్లు నిరూపించడంలో చెన్నమనేని విఫలయ్యారని, రమేష్ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం కూడా చట్టవిరుద్ధమని, ఎమ్మెల్యేగా రమేష్ ఎన్నిక చెల్లుబాటుకాదని తీర్పులో పేర్కొన్నారు.
ఆది శ్రీనివాస్ పోరాటం...: చెన్నమనేని 2004 ఎన్నికల్లోనే టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు యత్నించి, భారత పౌరసత్వం లభించకపోవడంతో పోటీ చేయలేకపోయారు. అప్పటినుంచి పౌరసత్వం సంపాదించేందుకు ప్రయత్నాలు కొనసాగించి.. చివరకు ఎన్నికల సంఘం నుంచి ఓటరు గుర్తింపు కార్డు, భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రం పొందారు. వాటి ఆధారంగా వేములవాడ నియోజకవర్గంలో ఓటరుగా తన పేరును నమోదు చేసుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి, 1821 ఓట్ల మెజారిటీతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఆ తర్వాత ఆది శ్రీనివాస్ దీనిపై 2009 జూన్‌లో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
దాంతో కేంద్ర హోంశాఖ రమేష్‌కు షోకాజు నోటీసు జారీ చేసి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని కరీంనగర్ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను ఆదేశించింది. వారు విచారణ జరిపి చెన్నమనేని రమేష్ 96 రోజులు మాత్రమే వరుసగా దేశంలో ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. అయితే.. అదే సమయంలో చెన్నమనేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లోచేరారు. దీంతో ఆయన ఎమ్మెల్యే పదవిలో లేరన్న కారణంతో హైకోర్‌ట పిటిషన్‌ను కొట్టివేసింది. అదే స్థానంలో 2010 జూలైలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన రమేశ్ మళ్లీ ఆది శ్రీనివాస్‌పై గెలిచారు. శ్రీనివాస్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ కొన సాగి, ప్రస్తుతం తీర్పు వెలువడింది. రమేష్ ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. తీర్పుపై సుప్రీంకోర్టును కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.