మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం రద్దు సబబేనన్న హైకోర్టు
కేంద్ర హోంశాఖ ఇచ్చిన నోటిఫికేషన్ సమర్థనీయమేనని స్పషీ్టకరణ
తప్పుడు పత్రాలతో అధికారులను, కోర్టును రమేశ్ తప్పుదోవ పట్టించారని ఆగ్రహం
దీనికి మూల్యంగా నెలలోగా రూ. 30 లక్షల జరిమానా కట్టాలని ఆదేశం
ఐదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం చెన్నమనేని పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చె న్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.
ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేశ్‌ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎ మ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమ నేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొన సాగుతోంది.
ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి అక్టోబర్‌లో తీర్పు రిజర్వు చేసి సోమవారం తీర్పు వెలువరించారు.
ఆయన ఎన్నిక కూడా చెల్లదన్న ఆది శ్రీనివాస్
చెన్నమనేని ఇరుదేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదించారు. ‘రెండుచోట్ల వివిధ కేటగిరీల కింద పౌరసత్వం కలిగి ఉండటాన్ని మన చట్టాలు అనుమతించవు. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుడు ఎన్నటికీ ఇక్కడ ఎమ్మెల్యే కాలేరు. తన పౌరసత్వ సమస్య 2009 నుంచి పెండింగ్‌లో ఉన్నా చెన్నమనేని రమేశ్ రెండు పౌరసత్వాలలో ఒకదాన్ని వదులుకోలేదు’అని వారు గుర్తుచేశారు.
చెన్నమనేని రమేశ్ క్లెయిమ్ చేస్తున్న రెండు విభిన్న రకాల పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను న్యాయమూర్తికి సమరి్పంచారు. రమేశ్ పౌరసత్వాన్ని కొనసాగించడం ‘ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు’అని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. మరోవైపు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు వాదిస్తూ ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుతో చెన్నమనేని రమేశ్ జర్మనీకి అనేకసార్లు వెళ్లారు. జర్మనీ పౌరసత్వంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నిక కూడా చెల్లదు’అని పేర్కొన్నారు.
ఆ అధికారం కేంద్రానికి లేదని వాదించిన రమేశ్
మరోవైపు చెన్నమనేని రమేశ్ తరఫున న్యాయవాది రామారావు వాదిస్తూ ‘చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారు. జర్మనీ పాస్‌పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదు. దేశ సార్వ¿ౌమత్వానికి విఘాతం కలిగించిన వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. కానీ రమేశ్ అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలి. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ రద్దు నోటిఫికేషన్‌ను కొట్టేయాలి’అని కోరారు.
అప్పీల్‌కు వెళ్లడాన్ని పరిశీలిస్తా: చెన్నమనేని
హైకోర్టు తీర్పు తీవ్ర నిరాశపరిచిందని చెన్నమనే ని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సో మవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రా జకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు నడిచానని.. నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తుచేశారు. వరుస ఓటములను జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు తన పౌరసత్వంపై కేసులు వేశారని చెన్నమనేని ఆరోపించారు. ఇలాంటి కేసులను గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో విజయవంతంగా ఎదుర్కొన్నానని.. తాజా తీర్పుపై అప్పీల్ చేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వేములవాడ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment