
సాక్షి, అనంతపురం అర్బన్: జిల్లాలో 63 మండలాలు ఉన్నాయి. అయితే పుట్టపర్తి తహసీల్దారు గోపాలకృష్ణ రూటే సపరేటు... అందరు తహసీల్దార్లకు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరణ అన్ని చోట్ల జరుగుతుంటే ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ముఖ్య గమనిక అంటూ ‘‘ప్రస్తుతం రేషన్‌కార్డులకు దరఖాస్తులను స్వీకరించబడవు మీ సేవలోనే ప్రభుత్వ వెబ్‌సైట్ రిలీజ్ చేసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలి’’ అని ఏకంగా నోటీసు బోర్డులో ఉంచారు.
దరఖాస్తులు కచ్చితంగా తీసుకోవాలి
కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని కచ్చితంగా స్వీకరించాలే తప్ప తిరస్కరించకూడదు. కలెక్టరేట్‌తో సహా జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాల్లోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలా వచ్చిన దరఖాస్తులను మాస్టర్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. అంతే కాకుండా వాటిని పంచాయతీలకు పంపించి విచారణ చేయించి అర్హులను గుర్తిస్తారు. ఇది ప్రక్రియ. అయితే పుట్టపర్తి తహసీల్దారు మాత్రం ఇందుకు భిన్నంగా దరఖాస్తుల స్వీకరించబోమని నోటీసు ఉంచడం చర్చనీయాంశంగా మారింది.
తహసీల్దార్ కార్యాలయంలో అతికించిన నోటీసు
మీ–సేవలో దరఖాస్తు విధానం లేదు
కొత్తగా రేషన్ కార్డు కోసం మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ప్రస్తుతం అమలులో లేదు. కార్డు కోసం మీ సేవలో దరఖాస్తులను స్వీకరించరు. అందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ కూడా లేదు. అయితే పుట్టపర్తి తహసీల్దార్ ఇందుకు భిన్నంగా... మీ– సేవలోనే ప్రభుత్వ వెబ్‌సైట్ రిలీజ్ చేసిన తరువాత దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.
దరఖాస్తులు స్వీకరించాలి
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చేసుకుంటున్న దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయాల్లో స్వీకరించాలి. అంతే తప్ప వాటిని తిరస్కరించకూడదు. వచ్చిన దరఖాస్తులను పంచాయతీలకు పంపించి విచారణ చేయించి అర్హులను గుర్తించే ప్రక్రియ నిర్వహిస్తాం. పుట్టపర్తి తహసీల్దార్ అలా ఎలా నోటీసు ఉంచారో తెలీదు. ఆయనతో నేనే స్వయంగా మాట్లాడాతాను.
– డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా సరఫరాల అధికారి, పౌర సరఫరాల శాఖ