ఏపీఎల్‌కు గ్రీన్‌ రేషన్‌ కార్డులు | Green ration cards for APL | Sakshi
Sakshi News home page

ఏపీఎల్‌కు గ్రీన్‌ రేషన్‌ కార్డులు

Published Fri, Mar 14 2025 4:43 AM | Last Updated on Fri, Mar 14 2025 4:43 AM

Green ration cards for APL

దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారికి జారీ 

తెల్ల రేషన్‌ కార్డు స్థానంలో 3 రంగుల స్మార్ట్‌కార్డు 

వచ్చే నెల నుంచి చిప్‌తో కూడిన కార్డుల పంపిణీ  

సన్న బియ్యం పంపిణీ మే నెల నుంచే.. 

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్నవారితోపాటు దారిద్యరేఖకు ఎగువన (ఏపీఎల్‌) ఉన్నవారికి కూడా రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీఎల్‌ వారికి ఇచ్చే రేషన్‌కార్డులపై సబ్సిడీతో కూడిన ఎలాంటి సరుకుల సరఫరా ఉండదు. వారికి సన్నబియ్యాన్ని ఇవ్వాలని భావిస్తున్నా.. బియ్యం సేకరణ ధర, నిర్వహణ చార్జీలను కలిపి రేషన్‌ షాపుల్లో విక్రయించాలని యోచిస్తోంది. 

ఈ అంశాన్ని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ లాబీల్లో తనను కలిసిన మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఉన్న తెల్లరేషన్‌ కార్డులను మూడు రంగుల్లో జారీచేయాలని, గులాబీ కార్డులను గ్రీన్‌కార్డులుగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఏపీఎల్‌కు ఇచ్చే కార్డులు ప్రస్తుతానికి గుర్తింపుకార్డులుగా మాత్రమే ఉపయోగపడతా యని అన్నారు. ఉచితంగా సన్నబియ్యం ఇచ్చే కార్డులపై ఎవరెవరి ఫొటోలు ఉండాలన్నది ప్రస్తుతానికి బయటపెట్టలేమని పేర్కొన్నారు.  

స్మార్ట్‌ కార్డుల కోసం టెండర్లు 
చిప్‌తో కూడిన స్మార్ట్‌ రేషన్‌కార్డుల కోసం టెండ ర్లు ఆహ్వానించినట్లు మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. కార్డుల డిజైన్‌ కూడా పూర్తయిందని తెలిపారు. వచ్చేనెలలో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు చెప్పారు. సన్నబియ్యం పంపిణీకి ఇంకా పూర్తిస్థాయిలో సమాయత్తం కాలేదని.. మే నుంచి బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్‌ సీజన్‌లో 155 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అయితే.. రబీ సీజన్‌లో 80 నుంచి 85 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. 

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశవ్యాప్తంగా సన్నబియ్యం ధరలు పడిపోయాయని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణలో సన్నబియ్యం కిలో రూ.60 – 65 వరకు ఉంది కదా? అని ఒక విలేకరి ప్రశ్నించగా.. అవి మరీ ఖరీదైన బియ్యం అయి ఉండవచ్చని పేర్కొన్నారు.  

నాణ్యత లేకుంటే నేషనల్‌ వేస్ట్‌ 
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్న బియ్యం తినే స్థితిలో లేకపోతే.. అదంతా జాతీయ వ్యర్థంగా (నేషనల్‌ వేస్ట్‌) మారుతుందని సీఎం రేవంత్‌రెడ్డి, తాను ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసినప్పుడు చెప్పామని ఉత్తమ్‌ తెలిపారు. 

రేషన్‌ షాపుల్లో ప్రస్తుతం దొడ్డు బియ్యానికి ఇస్తున్న సబ్సిడీతోపాటు సన్నబియ్యానికి అదనంగా అయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరితే ఆయన సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పంపాలని కోరినట్లు వెల్లడించారు. దొడ్డు బియ్యానికి కిలో దాదాపు రూ.33 పైగా వ్యయం అవుతుంటే, సన్నబియ్యానికి కిలో రూ.47 వరకు అవ్వొచ్చని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement