ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ
సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు అమెరికా న్యాయశాఖ అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదు
లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారమూ లేదు.. రెండు కీలక నేరారోపణల్లో అసలు అదానీల పేర్లే లేవు
నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయ ఆధారాలేవీ లేవు
సాక్షి, అమరావతి: ‘‘అదానీ’’ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు ‘అదుగో పులి అంటే.. ఇదుగో తోక!’ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా న్యాయశాఖ (డీఓజే) నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పష్టం చేశారు.
సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదని.. లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోందన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన 1, 5వ నేరారోపణల్లో అదానీ గానీ ఆయన మేనల్లుడు పేర్లు గానీ లేనే లేవని చెప్పారు.
‘ఎఫ్‌సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లోగానీ.. న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోగానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వారు తెరపైకి తెచ్చారు. కీలకమైన ఈ రెండు నేరారోపణల్లో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు.
ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదని.. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ అని.. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘డీఓజే’ నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ఈ కేసులో న్యాయపరమైన అంశాలను విశ్లేషించిన న్యాయ కోవిదులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment