US Department of Justice
-
అదానీపై లంచం ఆరోపణల్లేవు!
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ బోర్డు సీనియర్ డైరెక్టర్ వినీత్జైన్పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. ‘‘న్యూయార్క్ కోర్టులో గత వారం అమెరికా న్యాయ శాఖ (యూఎస్ డీఓజే) దాఖలు చేసిన అభియోగ పత్రంలో, యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ (ఎఫ్‌సీపీఏ/అవినీతి నిరోధక) చట్టం నిబంధనలను ఉల్లంఘించే కుట్రకు పాల్పడినట్టు వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ లేదా వినీత్జైన్పై అభియోగాలు మోపలేదు’’అని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం కింద మోసం, కుట్ర, ఉద్దేశపూర్వక కుట్ర ఆరోపణలే మోపినట్టు తెలిపింది. ఈ అభియోగాలకు చట్టం పరిధిలో శిక్షలు లంచం కంటే చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీల చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చట్ట ఉల్లంఘన దిశగా అదానీ గ్రీన్ ఎనర్జీకి సాయం అందించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరో సివిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఏజీఈఎల్ వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం 1933, సెక్యూరిటీస్ చట్టం 1934లోని పలు సెక్షన్లను వీరు ఉల్లంఘించారని.. ఏజీఈఎల్ సైతం ఇవే చట్ట ఉల్లంఘనలకు పాల్పడేందుకు సాయం లేదా ప్రోత్సాహం అందించినట్టు సివిల్ కేసులో అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. ఏజీఈఎల్ సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వీలుగా భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారంటూ అదానీ తదితరులపై కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని, ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.అదరగొట్టిన అదానీ షేర్లు...అమెరికా లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో అదానీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అదానీ టోటల్ గ్యాస్ 20%, అదానీ పవర్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10% లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ ఇంట్రాడేలో అప్పర్‌సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 12%, ఎన్డీటీవీ 9%, అదానీ విల్మార్ 8%, అదానీ పోర్ట్స్ 6%, సంఘీ ఇండస్ట్రీస్ 5%, అంబుజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 4% పెరిగాయి. పదకొండు కంపెనీల షేర్లూ రాణించడంతో ఒక్కరోజులో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.24 లక్షల కోట్లు పెరిగింది. -
‘సోలార్’ లంచాలు.. ఊహాగానాలే
సాక్షి, అమరావతి: ‘‘అదానీ’’ వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు ‘అదుగో పులి అంటే.. ఇదుగో తోక!’ అన్నట్లుగా ఉన్నాయనే అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి అదానీ గ్రూపు లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా న్యాయశాఖ (డీఓజే) నమోదు చేసిన కేసులో నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ భారత్‌లో అధికారులకు, నేతలకు లంచాలిచ్చినట్లు డీఓజే తన అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్ర జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారేగానీ దానికి ఎలాంటి సాక్ష్యాధారాలూ చూపలేదని.. లోతుగా పరిశీలిస్తే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని స్పష్టమవుతోందన్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన 1, 5వ నేరారోపణల్లో అదానీ గానీ ఆయన మేనల్లుడు పేర్లు గానీ లేనే లేవని చెప్పారు. ‘ఎఫ్‌సీపీఏ’ని ఉల్లంఘించారన్న నేరారోపణల్లోగానీ.. న్యాయానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణల్లోగానీ అదానీల పేర్లు లేవనే విషయాన్ని వారు తెరపైకి తెచ్చారు. కీలకమైన ఈ రెండు నేరారోపణల్లో అదానీల పేర్లు లేవనే విషయాన్ని ప్రధానంగా మీడియా సంస్థలు గుర్తించాలని సూచిస్తున్నారు. అసలు లంచం ఇవ్వటానికి ప్రయత్నించారనిగానీ.. ఇచ్చారనిగానీ నిరూపించే కనీస సమాచారం కూడా లేదని పేర్కొంటున్నారు. ఆ నేరారోపణల్లో ఎక్కడా కూడా ఇండియాలో లంచాలు ఇచ్చినట్లు లేదని.. లంచం ఇచ్చేందుకు కుట్ర పన్నారన్నదే ప్రధాన నేరారోపణ అని.. అయితే అందుకు ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ నేపథ్యంలో అమెరికా ‘డీఓజే’ నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలేవీ లేవని ఈ కేసులో న్యాయపరమైన అంశాలను విశ్లేషించిన న్యాయ కోవిదులు చెబుతున్నారు. -
గూగుల్ క్రోమ్‌ను అమ్మాల్సిందే..!
వాషింగ్టన్: ఆన్లైన్ సెర్చ్‌లో గూగుల్ చట్టవిరుద్ధమైన గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి ఆ సంస్థ తన క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సిందేనంటూ అమెరికా న్యాయశాఖ స్పష్టం చేస్తోంది. ఈ మేరకు న్యాయశాఖ తన స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేసినట్లు అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా)లో దాఖలు చేసిన 28 పేజీల ఫైల్ స్పష్టం చేస్తోంది. గూగుల్ ‘‘గుత్తాధిపత్యం’’ చేస్తోందన్న ఇటీవలి కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, టెక్ దిగ్గజాన్ని దాని ఆధిపత్య మార్కెట్ స్థానం నుండి తొలగించే చర్యలను అమెరికా న్యాయశాఖ సూచించింది. న్యాయశాఖ ప్రతిపాదనతో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ (ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా) న్యాయమూర్తి మెహతా అంగీకరిస్తే, క్రోమ్‌ను గూగుల్ విక్రయించాల్సి రావచ్చన్నది నిపుణుల విశ్లేషణ. గూగుల్ చట్టవిరుద్ధ గుత్తాధిపత్య ధోరణులను అరికట్టడానికి ఉన్న మార్గాల్లో క్రోమ్ వెబ్ బ్రౌజర్‌ను విక్రయించడం ఒకటని అమెరికా న్యాయశాఖతో పాటు పలు రాష్ట్రాలూ ప్రతిపాదనలు పెట్టడం గమనార్హం. ‘‘గూగుల్ ఒక గుత్తాధిపత్య సంస్థ. దాని గుత్తాధిపత్యం కొనసాగడానికి ఈ గుత్తాధిపత్యమూ పనిచేసింది’’ అని ఈ ఏడాది ఆగస్టులో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ కొలంబియా న్యాయమూర్తి అమిత్ మెహతా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. జరిగేదేమిటి? జడ్జి మెహతా ప్రభుత్వ సిఫార్సులను ఆమోదిస్తే, తుది తీర్పు వెలువడిన ఆరు నెలల్లోపు గూగుల్ తన 16 ఏళ్ల క్రోమ్ బ్రౌజర్‌ను విక్రయించాల్సి వస్తుందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక పేర్కొంది. ‘‘కానీ కంపెనీ ఖచి్చతంగా అప్పీల్‌కు వెళుతుంది. ఇదే జరిగితే ఇప్పటికే నాలుగేళ్లుగా సాగిన ఈ వివాదం మరింతకాలం కొనసాగే అవకాశం ఉంది. పొడిగించే అవకాశం ఉంది. ఇది యూట్యూబ్ వంటి దాని స్వంత సేవలను విస్తృత పరచకుండా గూగుల్‌ను నిలువరిస్తుంది’’ అని కూడా ప్రెస్ నివేదిక వ్యాఖ్యానించింది. గూగుల్ మాతృ సంస్థ ఖండన కాగా తాజా పరిణామాలపై గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కెంట్ వాకర్ ఒక బ్లాగ్‌లో వ్యాఖ్యానిస్తూ, న్యాయశాఖ ప్రతిపాదనను ఒక సంస్థను ‘‘అస్థిరపరిచేది‘గా అలాగే ‘‘అనవసర జ్యోక్యం ఎజెండా‘ను ముందుకు తెచ్చేదిగా ఉందని పేర్కొన్నారు. న్యాయశాఖ విధానం ప్రభుత్వ విపరీత జోక్యానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ధోరణి అమెరికన్ వినియోగదారులకు, డెవలపర్లకు, చిన్న వ్యాపారాలకు హాని కలిగిస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక నాయకత్వాన్ని అవసరమైన సమయంలో ప్రమాదంలో పడేసే విధానంగా విశ్లేషించారు. ఇతర టెక్ దిగ్గజాలపైనా ఇవే కేసులు ఇటీవలి సంవత్సరాలలో అమెజాన్, మెటా, గూగుల్ వంటి అనేక పెద్ద టెక్ కంపెనీలపై అమెరికా ప్రభుత్వ సంస్థలు ‘గుత్తాధిపత్యానికి సంబంధించి’ ఇదే తరహా కేసులు నమోదు చేశాయి. ఆయా సంస్థలు గుత్తాధిపత్యాన్ని సృష్టిస్తున్నాయని, మార్కెట్లోని ఇతర సంస్థల పోటీని అణిచివేస్తున్నాయని ఈ కేసుల సారాంశం. ఆపిల్, శామ్సంగ్ వంటి సంస్థలకు వాటి స్మార్ట్ఫోన్లు, వెబ్ బ్రౌజర్లపై ఆటోమేటిగ్గా తన సెర్చ్ ఇంజన్ లింక్ వచ్చే విధంగా గూగుల్ బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు 2020లోనే అమెరికా న్యాయశాఖ, కాలిఫోర్నియా, కొలరాడో, న్యూజెర్సీ మరియు న్యూయార్క్సహా పలు అమెరికా రాష్ట్రాలు కేసులు దాఖలు చేశాయి. గూగుల్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోందంటూ జడ్జి మెహతా ఆగస్టులో చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై తాజా పరిణామాలకు దారితీశాయి. సంస్థ గుత్తాధిపత్యాన్ని సరిదిద్దడాదనికి పరిష్కారాలను సమర్పించమని జడ్జి మెహతా న్యాయశాఖ అలాగే రాష్ట్రాలకు సూచించడం గమనార్హం. -
అతన్ని పట్టిస్తే రూ.37 కోట్లు ఇస్తాం : అమెరికా
వాషింగ్టన్ : ముంబై 26/11 మారణహోమానికి ఈ నవంబర్ 26తో పుష్కరకాలం పూర్తయింది.సరిగ్గా పన్నేండేళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం 2008 ముంబై దాడులకు పాల్పడడంలో కీలకంగా వ్యవహరించిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌పై భారీ నజరానా ప్రకటించింది. ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించిన సాజిద్ మిర్ సమాచారం ఇచ్చినా లేక పట్టిచ్చిన వారికి 5 లక్షల అమెరికన్ మిలియన్ డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 37కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా న్యాయశాఖ పేర్కొన్నది. అమెరికాలో జరిగిన రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ సందర్భంగా సాజిద్ మిర్ సమాచారం ఇస్తే రూ. 37 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ముంబై దాడులకు లష్కరే ఆపరేషన్స్ మేనేజర్‌గా సాజిద్ మిర్ సూత్రధారిగా వ్యవహరించాడు. దాడుల ప్లానింగ్, ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్ సాజిద్ దగ్గరుండి పర్యవేక్షించాడు. కాగా సాజిద్ మిర్ ను అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు 2011 ఏప్రిల్ 11 న దోషిగా ప్రకటించింది. ఉగ్రవాదులకు అన్ని విధాలా సాయపడ్డాడని, ఓ దేశంలో భారీ ప్రాణ, ఆస్థి నష్టానికి కారకుడయ్యాడని పేర్కొంది. కాగా 2008 నవంబరు 26 న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ముంబైలోని పలు హోటళ్లు, ప్రదేశాలను టార్గెట్లుగా చేసుకుని ధ్వంస రచనకు పూనుకొంది. ఈ నగరంలోని తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ హోటల్, లియో పోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, చత్రపతి శివాజీ టర్మినస్ వంటి పలు చోట్ల జరిగిన పేలుళ్లలో 166 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఆ ఘటనలో 9 మంది టెర్రరిస్టులు కూడా మృతి చెందగా సజీవంగా పట్టుబడిన ఒకే ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్ ను 2012 నవంబరు 11 న పూణే లోని ఎరవాడ సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. -
టిక్‌టాక్ విక్రయానికి గడువు పెంపు
వాషింగ్టన్: ప్రస్తుత ప్రెసిడెంట్ ట్రంప్ పాలనా విభాగం టిక్‌టాక్ విక్రయానికి మరో 7 రోజుల గడువును పెంచింది. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. దీంతో డిసెంబర్ 4లోగా చైనీస్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు టిక్‌టాక్ యూఎస్ విభాగాన్ని విక్రయించేందుకు వీలు చిక్కింది. షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ విక్రయానికి ఆగస్ట్‌లోనే ఆదేశించిన ట్రంప్ ప్రభుత్వం తదుపరి గడువును 15 రోజులపాటు పెంచిన విషయం విదితమే. ఈ గడువు సైతం శుక్రవారం(27)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా 7 రోజుల గడువునిచ్చింది. తొలుత ట్రంప్ ప్రభుత్వం టిక్‌టాక్ యాప్‌ను విక్రయించవలసిందిగా బైట్‌డ్యాన్స్‌ను ఆదేశించింది. ఇందుకు 90 రోజుల గడువునిస్తూ ఆగస్ట్ 14న ఆదేశాలు జారీ చేసింది. కాగా.. టిక్‌టాక్ యూఎస్ విభాగం విక్రయానికి చైనీస్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ కొద్ది రోజులుగా చర్చలు నిర్వహిస్తూ వస్తోంది. టిక్‌టాక్ కొనుగోలు రేసులో తొలుత మైక్రోసాఫ్ట్ పేరు వినిపించినప్పటికీ తదుపరి రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇంక్, సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ రేసులోకి వచ్చిన విషయం విదితమే. ప్రతిపాదన ఇలా ఈ నెల 10న టిక్‌టాక్ విక్రయంపై యూఎస్ ప్రభుత్వానికి బైట్‌డ్యాన్స్ ఒక ప్రతిపాదనను పంపింది. దీనిలో భాగంగా ఒరాకిల్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో టిక్‌టాక్‌ను కొత్త సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఇదేవిధంగా టిక్‌టాక్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు కొనసాగుతారని తెలియజేసింది. అయితే టిక్‌టాక్ యూఎస్ వినియోగదారుల డేటా, కంటెంట్ ఆధునీకరించడం తదితర కార్యకలాపాలను యూఎస్ కంపెనీలు చేపడతాయని పేర్కొంది. -
మరో షాక్: ఇన్ఫీపై న్యాయ విచారణ
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో షాక్ తగిలింది. నిన్ననే(శుక్రవారమే) ఆ కంపెనీ సీఈవో, ఎండీ పదవికి విశాల్ సిక్కా అనూహ్యంగా రాజీనామా చేయగా... ఒక్కరోజు వ్యవధిలోనే అమెరికా న్యాయ సంస్థలు ఆ కంపెనీపై న్యాయ విచారణకు దిగాయి. ఫెడరల్ సెక్యురిటీస్ చట్టాలను దేశీయ ఈ కంపెనీ, దాని అధికారులు, డైరెక్టర్లు ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తరుఫున నాలుగు అమెరికా న్యాయ సంస్థలు విచారణను ప్రారంభించాయి. బ్రోన్‌స్టెయిన్, జివెర్ట్జ్ అండ్ గ్రాస్మాన్, రోసెన్ న్యాయ సంస్థ, పోమెరాంట్జ్ న్యాయ సంస్థ, గోల్డ్ బర్గ్ లా పీసీలు ఈ విచారణ చేపట్టాయి. అమెరికా స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ లిస్టు అయి ఉంది. సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇన్ఫోసిస్ పెట్టుబడిదారుల తరుఫున పొటెన్షియల్ సెక్యురిటీ క్లయిమ్స్‌పై విచారణ జరుపుతున్నామని రోసెన్ చెప్పింది. ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి భౌతికంగా తప్పుదోవ పట్టించే వ్యాపార సమాచారాన్ని ఆ సంస్థ జారీచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయన్నది. ఇన్వెస్టర్లు పోగొట్టుకున్న మొత్తాలను రికవరీ చేయడానికి కంపెనీ క్లాస్ యాక్షన్ దావాకు కూడా సిద్ధమై ఉండాలని హెచ్చరించింది. ఇన్ఫోసిస్ లేదా కొందరు ఆఫీసర్లు, డైరెక్టర్లు ఫెడరల్ సెక్యురిటీ చట్టాలకు అనుగుణంగా పనిచేశారా లేదా అన్నది విచారిస్తున్నామని బ్రోన్‌స్టెయిన్ పేర్కొంది. సెక్యురిటీస్ మోసానికి లేదా చట్టవిరుద్ధమైన వ్యాపార విధానాలకు వారు పాల్పడారా? లేదా? అన్నది తేల్చుతామని పోమెరాంట్జ్ తెలిపింది. సిక్కా రాజీనామా అనంతరం ఇన్ఫీకి మరింత షాక్‌గా ఈ విచారణలు ప్రారంభమయ్యాయి. సిక్కా రాజీనామాతోనే ఇప్పటికే ఇన్ఫీ షేరు కనీసం 9 శాతం మేర నష్టపోయింది. -
ఆ 61మందిలో ఎక్కువమంది భారతీయులే...
-
ఆ 61మందిలో ఎక్కువమంది భారతీయులే...
వాషింగ్టన్ : అహ్మదాబాద్ కేంద్రంగా సాగిన వందల కోట్ల కాల్ సెంటర్ కుంభకోణంలో 61మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా న్యాయశాఖ గురువారం అభియోగాలు నమోదు చేసింది. వీరిలో ఎక్కువమంది భారతీయులే. ఈ కేసుకు సంబంధించి అమెరికాలో 20మందిని నిన్న అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిని ఇమిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా అమెరికా న్యాయ విభాగం అభియోగాలు నమోదు చేసిన పలువురిని ఇటీవలే భారత్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిని అమెరికాకు అప్పగించే అంశంపై చర్చలు సాగుతున్నాయి. కాగా గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా.. భారతదేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచి. కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. అయితే కేవలం అమెరికాలోనే కాక.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు. (చదవండి...కాల్ సెంటర్ కేసులో ఐపీఎస్ కొడుకు?) -
‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా?
-
‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా?
14 బిలియన్ డాలర్లు చెల్లించాలన్న అమెరికా న్యాయ శాఖ • డాయిష్ బ్యాంకు తాకట్టు సెక్యూరిటీల విక్రయంపై దర్యాప్తు • కేసు పరిష్కారం కోసం జరిమానా చెల్లించాలని డిమాండ్ • అంత చెల్లించేది లేదన్న జర్మనీ బ్యాంకు పరిష్కారం కోసం చర్చలు • మరో ఆర్థిక సంక్షోభంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు • ఆ పరిస్థితి రాదంటున్న నిపుణులు న్యూయార్క్: ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక రంగం ఇంకా కోలుకునే ప్రయత్నాల్లోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డాయిష్ బ్యాంకు 14 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలంటూ అమెరికా న్యాయశాఖ చేసిన డిమాండ్‌తో ఇటీవల ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. 2008లో అమెరికాకు చెందిన ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం లెహమాన్ బ్రదర్స్ కుప్పకూలడమే ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది. 619 బిలియన్ డాలర్ల రుణాలతో లెహమాన్ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. తాజా పరిణామాలను చూస్తే జర్మనీకి చెందిన నాలుగో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ కూడా లెహమాన్ బ్రదర్స్ మాదిరిగా చేతులెత్తేస్తుందేమో?, మరోసారి ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలు బయల్దేరాయి. మరి ఈ అంశం చివరికి ఎటు దారి తీస్తుంది...? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇదే. జరిమానా ఎందుకు? 2008కి ముందు తన వద్ద తనఖా ఉంచిన సెక్యూరిటీలను డాయిష్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం ద్వారా ఆర్థిక సంక్షోభానికి తన వంతు కారణమయ్యిందన్న అంశంపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు పరిష్కారం కోసం 14 బిలియన్ డాలర్లు చెల్లించాలన్నది అమెరికా న్యాయ శాఖ తాఖీదు. కానీ, అంత భారీ మొత్తంలో చెల్లించే ప్రశ్నే లేదని డాయిష్ బ్యాంకు స్పష్టం చేసింది. ఆందోళనలు జరిమానా భారీ స్థాయిలో ఉండడంతోపాటు డాయిష్ బ్యాంకు బ్యాలన్స్ షీటు బలహీనంగా ఉండడంతో లెహమాన్ బ్రదర్స్ వైఫల్యం చెందిన రోజులు ఇన్వెస్టర్లకు గుర్తుకు వచ్చాయి. ఫలితంగా వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఈ కథనం ప్రచురితమైన రోజే డాయిష్ బ్యాంకు షేరు ధర 8 శాతం పడిపోగా, బ్యాలన్స్ షీట్లు బలహీనంగా ఉన్న ఇతర యూరోప్ బ్యాంకుల షేర్లు కూడా కుదేలయ్యాయి. డాయిష్ షేరు ఏడాది కాలంగా 30 డాలర్లకు పైన ట్రేడ్ అవుతుండగా, తాజా పరిస్థితుల నడుమ సెప్టెంబర్ చివరికి అది 12 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఊహించని పరిణామం అయితే, ఇంత భారీ మొత్తంలో జరిమానా పడుతుందని డాయిష్ ఊహించకపోవడం కూడా తాజా అనిశ్చితికి కారణంగా పేర్కొనవచ్చు. కేవలం 3.4 బిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించాల్సి రావచ్చని మొదటి నుంచీ డాయిష్ భావిస్తోంది. అయితే ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని, ఆందోళన అక్కర్లేదని డాయిష్ బ్యాంక్ ప్రకటించింది. డాయిష్ బ్యాంకు ముందున్న మార్గం? అమెరికా న్యాయ శాఖ 14 బిలియన్ డాలర్లు డిమాండ్ చేయగా, ఇంత భారీ మొత్తంలో చెల్లించే ఉద్దేశం డాయిష్ బ్యాంకుకు ఏ కోశానా లేదు. దీనిపై తాము కౌంటర్ ప్రతిపాదన సమర్పించాల్సి ఉందని, చర్చలు ప్రారంభం అయ్యాయని డాయిష్ ఇప్పటికే తెలిపింది. ప్రత్యర్థి బ్యాంకులు ఇటువంటి కేసుల్లో అంతిమంగా తక్కువ జరిమానాకే పరిష్కరించుకున్నట్టే తాము కూడా దీనికి సానుకూల పరిష్కారం కనుగొంటామని డాయిష్ బ్యాంకు ఆత్మవిశ్వాసంతో ఉంది. 2 నుంచి 3 బిలియన్ డాలర్ల మధ్య జరిమానా చెల్లించడం అన్నది సహేతుకంగా ఉంటుందని డాయిష్ బ్యాంకు న్యాయ నిపుణుల సలహాగా ఉంది. చివరికి ఈ జరిమానా సగానికి తగ్గే అవకాశం ఉంటుందని అమెరికా న్యాయ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ముందే సిద్ధమైందా? అయితే ఈ వివాద పరిష్కారం కోసం డాయిష్ జూన్ చివరి నాటికే 6.2 బిలియన్ డాలర్లను రిజర్వ్‌లో ఉంచిందని సమాచారం. ఈ ఏడాది చివరికి ఈ రిజర్వ్ నిధులను పెంచే ఆలోచనలోనూ ఉంది. కనుక ఈ అంశంపై అంతగా ఆందోళన అవసరం లేదన్నది నిపుణుల యోచన. నిపుణులు ఏమంటున్నారు.. ‘డాయిష్ బ్యాంకు సమస్యలు పరిష్కారం అవుతాయనే నేను భావిస్తున్నాను. లెహమాన్ వలే డాయిష్ మారబోదు’ అన్నది హార్వర్డ్ లా స్కూల్ ప్రొఫెసర్ హాల్ ఎస్ స్కాట్ అభిప్రాయం. ఇదో అప్రమత్తత సూచనా? అన్న ప్రశ్నకు కూడా ఆయన కాదనే జవాబిచ్చారు. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు డాయిష్ తన క్యాపిటల్ రేషియో బ్యాలెన్సింగ్ కోసం ఇన్వెస్టర్ల నుంచి మరింత నిధులు సేకరించడం లేదా ఆస్తులను అమ్మాల్సి రావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికా న్యాయ శాఖ జరిమానాను సగానికి తగ్గించినా సరే అది జర్మనీకి చెందిన ఒకానొక అతిపెద్ద బ్యాంకుకు భారమేనన్నది నిపుణుల అభిప్రాయం. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ప్గాంగ్ సైతం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ బ్యాంకులు సైతం... డాయిష్ వలే ఇదే మాదిరి దర్యాప్తు ఎదుర్కొంటున్న యూరోప్ బ్యాంకుల్లో బార్క్లేస్, క్రెడిట్ సూసే గ్రూపు, యూబీఎస్గ్రూపు, రాయల్ బ్యాంక్ స్కాట్లాండ్ గ్రూపు ఉన్నాయి. భారీ జరిమానా చెల్లించిన కేసులు.. ⇔ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన కేసుల్లో అమెరికాకు చెందిన బడా బ్యాంకులు సైతం లోగడ బిలియన్ డాలర్ల జరిమానాలు చెల్లించాయి. ⇔ బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్ప్ 16.65 బిలియన్ డాలర్లు ⇔ గోల్డ్‌మ్యాన్ శాక్స్ గ్రూపు 5.4 బిలియన్ డాలర్లు ⇔ సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, మోర్గాన్ స్టాన్లీ మూడూ కలిపి 23 బిలియన్ డాలర్లు -
ఎట్టకేలకు తలొగ్గిన యాపిల్ కంపెనీ!
గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న హైడ్రామా తర్వాత యాపిల్ సంస్థ ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. వివాదాస్పదంగా మారిన టెర్రెరిస్టు ఐఫోన్ ను అన్ లాక్ చేయడానికి కొత్త ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఇచ్చేందుకు సోమవారం అంగీకరించింది. ఐఫోన్ అన్‌లాక్ విషయంలో యాపిల్ కంపెనీకి, అమెరికా ప్రభుత్వానికి గతేడాది డిసెంబర్ నుంచి వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శాన్‌బెర్నార్డినో లో కాల్పులు జరిపిన ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్ చేయాలని గతంలో అమెరికా దిగువ కోర్టులు ఆదేశాలు జారీచేసినా యాపిల్ సంస్థ అందుకు నిరాకరిస్తూ వచ్చింది. ఆ కంపెనీకి వ్యతిరేకంగా మరో కేసును ఆ దేశ న్యాయవిభాగం కోర్టు ముందు ఈ ఏడాది మొదట్లో ఉంచింది. గతేడాది డిసెంబర్ 2 న సయీద్ ఫరూక్, తష్ఫిన్ మాలిక్ దంపతులు కాలిఫోర్నియా లోని శాన్ బెర్నార్డినోలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 14 మందిని పొట్టనపెట్టుకున్నారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో వీరిద్దరూ హతమైన విషయం తెలిసిందే. అయితే ఫరూక్ ఐఫోన్‌ను డీకోడ్ చేసి సమాచారాన్ని సేకరించాలనుకున్న ఎఫ్‌బీఐ అధికారులకు యాపిల్ హై సెక్యూరిటీ టెక్నాలజీ అడ్డుగా నిలిచింది. దీంతో యాపిల్ సంస్థ ఎఫ్‌బీఐకి ఈ సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చాలా రోజులుగా ఇందుకు నిరాకరిస్తూ వచ్చిన యాపిల్ యాజమాన్యం ప్రత్యామ్నాయంగా కొత్త ప్రోగ్రామ్ ను సిద్ధం చేసి ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో యాపిల్ పై దాఖలైన పిటిషన్, కేసులను అమెరికా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ సహాయం చేసేందుకు ముందుకు వచ్చామని ఆ సంస్థకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. -
యాపిల్‌తో మళ్లీ ఘర్షణ దిశగా అమెరికా!
ఐఫోన్ అన్‌లాక్ విషయంలో యాపిల్ కంపెనీకి, అమెరికా ప్రభుత్వానికి ఘర్షణ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే సాన్‌బెర్నార్డినో సాయుధుడి ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వలేమంటూ అమెరికా కోర్టు యాపిల్‌కు ఊరట కల్పించినా.. ఆ కంపెనీకి వ్యతిరేకంగా మరో కేసును ఆ దేశ న్యాయవిభాగం కోర్టు ముందు ఉంచింది. డ్రగ్స్ నేరగాడైన ఓ నిందితుడి ఐఫోన్‌ను యాపిల్ అన్‌లాక్ చేసేవిధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టును న్యాయవిభాగం ఆశ్రయించింది. సాన్‌బెర్నార్డినోలో కాల్పులు జరిపిన సాయుధుడి ఐఫోన్ అన్‌లాక్ చేసేందుకు 1789నాటి చట్టం ఆధారంగా ఆదేశాలు ఇవ్వలేమంటూ కాలిఫోర్నియా కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దొడ్డిదారిలో తాము ఆ సాయుధుడి ఐఫోన్‌ను హ్యాక్ చేసి.. అందులోని వివరాలు వెల్లడించలేమని, ఒకవేళ తాము అలా చేస్తే భవిష్యత్‌లో ఐఫోన్ యూజర్ల వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడే అవకాశముందన్న యాపిల్ వాదనను కోర్టు సమర్థించింది. అయినప్పటికీ తాజాగా డ్రగ్స్ నేరగాడి కేసులో ఐఫోన్‌ను అన్‌లాక్ చేసేలా యాపిల్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ అమెరికా న్యాయవిభాగం మరో కేసును కోర్టు ముందు ఉంచింది. సాన్‌బెర్నార్డినో కేసు మాదిరిగానే ఈ కేసులోనూ 1789నాటి చట్టం ఆధారంగా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. -
హెడ్లీ వివరాలు చెప్పేందుకు భార్య నిరాకరణ
న్యూఢిల్లీ: ఎన్ఐఎ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ భార్య షాజియా, అతని వ్యాపార భాగస్వామి రేమండ్ శాండర్స్‌లు నిరాకరించారు. వ్యక్తిగత స్వేచ్ఛ సాకుతో సమాధానాలిచ్చేందుకు ఒప్పుకోలేదని అధికారులు తెలిపారు. హెడ్లీకి సంబంధించిన వివరాలు సేకరించేందుకు అమెరికా న్యాయశాఖ సాయంతో ఎన్ఐఏ ఈ ప్రయత్నం చేసింది. అమెరికా న్యాయ నిబంధనల ప్రకారం కేసులో నిందితుడిగా ఉన్నా... విచారణను తిరస్కరించవచ్చు. హెడ్లీ భార్య, స్నేహితుడ్ని ప్రశ్నించడంతో అతని కుటుంబ వివరాలు, భారత్‌లో కార్యకలాపాలు, లష్కరేతోయిబాతో సంబంధాలు తెలుస్తాయని ఎన్ఐఏ ఆశించింది. -
ట్యాక్సీకి టోకరా : యువతికి అరుదైన శిక్ష
అమెరికాలోని పెన్సిల్వేనియా మున్సిపల్ కోర్టు తాజాగా ఓ అరుదైన, ఆశ్చర్యకరమైన తీర్పును వెలువరించింది. ట్యాక్సీలో ప్రయాణించి డబ్బులు చెల్లించకుండా పారిపోయిన ఓ యువతికి 30 మైళ్ల నడక శిక్షను విధించింది. దీంతో తరచూ వెరైటీ తీర్పులు ఇస్తారని పేరున్నజడ్జి మైఖేల్ కికొనెట్టీ మరోసారి వార్తల్లో నిలిచారు. గతవారం ఒహోయోలోని లేక్ కంట్రీ నుంచి పెన్సిల్వేనియాకు ట్యాక్సీలో ప్రయాణించిన విక్టోరియా బాస్కోమ్ అనే యువతి.. తన గమ్యస్థానం వద్ద ట్యాక్సీ ఆగగానే డబ్బులివ్వకుండా చటుక్కున పారిపోయింది. కంగుతిన్న ఆ ట్యాక్సీడ్రైవర్ ఎలాగైతేనేం ఆమెను పట్టుకుని కేసుపెట్టి కోర్టుకీడ్చాడు. ఇరుపక్షాల వాదనలు విన్న పెన్సిల్వేనియా మున్సిపల్ కోర్టు జడ్జి.. విక్టోరియాను దోషిగా నిర్ధారించి ఆమె ట్యాక్సీలో ప్రయాణించిన 30 మైళ్ల (48 కిటోమీటర్ల) దూరం నడవడంతోపాటు నష్టపరిహారంగా ట్యాక్సీ డ్రైవర్ కు 100 డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. మరో గమ్మత్తేమిటంటే సదరు దోషులు శిక్ష ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాడు జడ్జి మైఖేల్! విచారణ సమయంలో 'ఒకవేళ ట్యాక్సీ దొరకకుంటే నువ్వెలా వెళ్లేదానివి' అన్ని జడ్జిప్రశ్నకు 'నడుచుకుంటూ వెళ్లేదాన్నేమో' అని విక్టోరియా సమాధానం చెప్పింది. దీంతో న్యాయమూర్తి 'లేక్ కంట్రీ జైలులో 60 రోజులు పనిచేస్తావా? లేక నువ్వు ప్రయాణించిన దూరం (48 గంటల లోపు) నడిచి వెళతావో చాయిస్ ఈజ్ యువర్స్' అని శిక్ష నిర్ణయాన్ని విక్టోరియాకే వదిలిపెట్టాడు. మొదట పని కంటే నడకే మేలనుకున్న విక్టోరియా ఇప్పుడు మాత్రం.. 'ఏల ట్యాక్సీ ఎక్కవలె.. ఎక్కితిపో.. ఎల డబ్బులివ్వకుండా పారిపోవలె.. పారిపోతినిపో.. ఏల 30 మైళ్లు నడవవలె.. నడిస్తిపో..' అంటూ కాళ్లు ఒత్తుకుంటోంది.