ఆ 61మందిలో ఎక్కువమంది భారతీయులే...
వాషింగ్టన్ : అహ్మదాబాద్ కేంద్రంగా సాగిన వందల కోట్ల కాల్ సెంటర్ కుంభకోణంలో 61మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా న్యాయశాఖ గురువారం అభియోగాలు నమోదు చేసింది. వీరిలో ఎక్కువమంది భారతీయులే. ఈ కేసుకు సంబంధించి అమెరికాలో 20మందిని నిన్న అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిని ఇమిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా అమెరికా న్యాయ విభాగం అభియోగాలు నమోదు చేసిన పలువురిని ఇటీవలే భారత్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిని అమెరికాకు అప్పగించే అంశంపై చర్చలు సాగుతున్నాయి.
కాగా గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా.. భారతదేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచి. కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. అయితే కేవలం అమెరికాలోనే కాక.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు.
(చదవండి...కాల్ సెంటర్ కేసులో ఐపీఎస్ కొడుకు?)