న్యూయార్క్: అమెరికాలో వేల మంది నుంచి కోట్ల డాలర్లను కాజేసిన కాల్‌సెంటర్ కుంభకోణం కేసులో 21 మంది భారత సంతతి వ్యక్తులకు కనిష్టంగా 4 ఏళ్ల నుంచి గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత 21 మందిలో చాలా మందిని అధికారులు భారత్‌కు పంపనున్నారు. ఇదే కేసులో గతంలోనూ ముగ్గురు భారతీయ నేరస్తులకు శిక్షపడగా, ఇటీవల మరో 21 మందికి కూడా శిక్షలు ఖరారయ్యాయి.
ఈ సందర్భంగా అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెసన్స్ మాట్లాడుతూ వృద్ధులను, అమాయకులను మోసగించే వారిపై పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు. ‘అమెరికాలోని వృద్ధులు, చట్టబద్ధంగా ఉంటున్న వలసదారులు జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బును కాజేయాలని చూసే మోసగాళ్లంతా ఒకటి గుర్తుంచుకోవాలి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు, నేరగాళ్లను జైళ్లలో పెట్టేందుకు అమెరికా ప్రభుత్వం తన సర్వ శక్తులనూ వినియోగిస్తుంది’ అని సెషన్స్ హెచ్చరించారు. ఈ కేసులో భారత్‌లో ఉంటున్న 32 మందిని కూడా నిందితులుగా చేర్చి, ఐదు కాల్‌సెంటర్లపై కేసులు నమోదు చేసినప్పటికీ వీరిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు.
కుంభకోణం ఎలా జరిగింది?
ఈ కుంభకోణం 2012 నుంచి 2016 మధ్య జరిగింది. ముందుగా నేరగాళ్లు డేటా బ్రోకర్ల ద్వారా అమెరికాలోని వ్యక్తుల సమాచారం సేకరిస్తారు. అందులో నుంచి వృద్ధులు, వలసదారుల ఫోన్ నంబర్లు వెతికిపట్టుకుని వారికి అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్ల నుంచి ఫోన్ చేస్తారు. తాము యూఎస్‌సీఐఎస్ (అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం) లేదా ఐఆర్‌ఎస్ (అంతర్గత ఆదాయ విభాగం) నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి వాళ్లను నమ్మిస్తారు. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పే సమాచారమంతా నిజమే అయ్యుండటంతో బాధితులు నేరగాళ్ల మాటలు నమ్మేవారు.
ఏవేవో కారణాలతో వారు ప్రభుత్వానికి కొంత డబ్బు బాకీ పడ్డారనీ, ఆ డబ్బు చెల్లించకపోతే జరిమానాలు వేస్తామనో, అరెస్టు చేస్తామనో, దేశం నుంచి బహిష్కరిస్తామనో చెప్పి వారిని భయభ్రాంతులకు గురిచేసేవారు. డబ్బు చెల్లించేందుకు ఒప్పుకున్న అమాయకుల నుంచి ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్లు, ప్రీపెయిడ్ పేమెంట్ కార్డులు తదితరాల ద్వారా డబ్బు గుంజేవారు. తాము చెప్పిన ఖాతాలకు బాధితులు డబ్బు పంపిన వెంటనే అహ్మదాబాద్ కాల్‌సెంటర్‌లోని వాళ్లు అమెరికాలోని సహ నేరగాళ్లకు ఫోన్ చేస్తారు. వీలైనంత తొందరగా వాళ్లు ఆ డబ్బును వేరే బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించేవారు.
Comments
Please login to add a commentAdd a comment