అంతర్జాతీయంగా సంచలనం సృష్టించే హత్యలూ, హత్యాయత్నాలూ ఒక్కోసారి ఉలిక్కిపడేలా చేస్తాయి. వాటి వెనక ప్రభుత్వాల ప్రమేయం ఉన్నదన్న అనుమానాలు తలెత్తితే అవి మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా సందర్భాల్లో అవి దేశాలమధ్య చిచ్చు రేపుతాయి. ఇలాంటి ఆపరేషన్లను గుట్టుచప్పుడు కాకుండా చేయడంలో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆరితేరింది. చేతికి నెత్తురంటకుండా, సాక్ష్యాధారాలేమీ మిగలకుండా ప్రత్యర్థులను మట్టుబెట్టడంలో ఆ సంస్థ తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. అలాంటి ఉదంతంలో ఇప్పుడు మన దేశం పేరు వినబడటం ఆశ్చర్య కరమే.
అమెరికాలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యాయత్నం కేసులో అమెరికాలో దాఖలైన తాజా నేరారోపణ పత్రం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజానికి ఏడాదికాలంగా ఆ పంచాయతీ నడుస్తోంది. నేరుగా భారత్‌ను నిందించక పోయినా నిరుడు మే నెలలో దాఖలు చేసిన నేరారోపణ పత్రం తమ గడ్డపై తమ పౌరుడిని హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నం వెనక ‘భారత ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రమేయం ఉన్నద’ంటూ ఆరోపించింది. అప్పట్లో ఆ ఉద్యోగి పేరు వెల్లడించకుండా ‘సీసీ 1’గా మాత్రమే ప్రస్తావించింది.
కానీ శుక్రవారం అమెరికా న్యాయశాఖ అతని పేరు వికాస్ యాదవ్ అనీ, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఇంతక్రితం పనిచేశాడనీ వెల్లడించింది. వికాస్ యాదవ్ ప్రస్తుతం భారత ప్రభుత్వ ఉద్యోగి కాదని నేరారోపణ పత్రం చెప్పటం... భారత ప్రభుత్వం ఈ కేసులో తమకు సహకరిస్తున్నదని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అనటం ఉన్నంతలో ఊరట. తమ దేశంలో స్థిరపడిన ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని ఒకపక్క కెనడా ఆరోపిస్తున్న తరుణంలో అమెరికా సైతం ఇదే తరహా ఆరోపణ చేయటం గమనించదగ్గది.
ఎన్నికల్లో సిక్కు ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రధాని ట్రూడో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసిన మన దేశానికి తాజా పరి ణామం ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గురుపత్వంత్‌ను హతమార్చ టానికి ఏమేం చేయాలో నిందితులు చర్చించుకున్న సందర్భంలోనే నిజ్జర్ హత్యను జయప్రదంగా పూర్తిచేయటం గురించిన ప్రస్తావన వచ్చింది.
ఇలాంటి వ్యవహారాలు చక్కబెట్టే వారికి వేయి కళ్లుండాలి. తాము ఎవరిని సంప్రదిస్తున్నామోక్షుణ్ణంగా తెలిసివుండాలి. కానీ ఆ సమయంలో రా సీనియర్ అధికారిగా ఉన్న వికాస్ యాదవ్ మాదకద్రవ్య ముఠాలతో సంబంధాలుండే నిఖిల్ గుప్తాకు గురుపత్వంత్‌ను అంతంచేసే బాధ్యత అప్పగించటం, గుప్తా దాన్ని కాస్తా కిరాయి హంతకుడనుకున్న మరో వ్యక్తికి ఇవ్వటంతో కథ అడ్డం తిరిగింది. నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్‌లో దొరికిపోవటం, అతన్ని ఆ దేశం అమెరికాకు అప్పగించటం పర్యవసానంగా మొత్తం పథకం బట్టబయలైంది. కిరాయి హంతకుడనుకున్న వ్యక్తి కాస్తా అమెరికా మాదకద్రవ్య నిరోధక విభాగం ఏజెంటు.
ఆ సంగతి తెలియక హత్య కోసం అతనితో లక్ష డాలర్లకు కాంట్రాక్టు కుదుర్చుకోవటం, అందులో 15 వేల డాలర్లు చెల్లించటం నిఖిల్ గుప్తాతోపాటు వికాస్ మెడకు చుట్టుకుంది. అది మన దేశ ప్రతిష్ఠకు కూడా మచ్చ తెచ్చింది. వికాస్ సాధారణ అధికారి కాదు. రా సంస్థకు ముందు ఆయన సీఆర్‌పీఎఫ్‌లో పనిచేశాడు. వికాస్‌ను సర్వీసునుంచి తొలగించి అతనికోసం గాలిస్తున్నామని మన ప్రభుత్వం ఇచ్చిన వివరణకు అమెరికా సంతృప్తి చెందింది. ‘రా’లో ఉన్నతాధికారులకు చెప్పకుండా వికాస్ యాదవ్ ఇలాంటి పెడధోరణులకు పాల్పడ్డాడని మన ప్రభుత్వం చెబుతోంది.
విదేశాల్లో గూఢచర్యం ఆషామాషీ కాదు. అలాంటి పనిలో నిమగ్నమైవుండేవారు ఉన్నతాధి కారులకు తమ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు వర్తమానం అందిస్తే వేరే విషయం. చెప్పినా చెప్ప కున్నా అంతా సవ్యంగా జరిగితే రివార్డులు దక్కవచ్చేమో. కానీ వికటిస్తే ఆ అధికారితోపాటు దేశం పరువు కూడా పోతుంది. గురుపత్వంత్ ఖలిస్తాన్ వేర్పాటువాదే కావొచ్చు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తే అయివుండొచ్చు.
మన దేశంలో కేసులుంటే తమకు అప్పగించాలని అమె రికాను కోరాలి. ఆ దేశ పౌరుడిగా అక్కడే స్థిరపడిన వ్యక్తిపై అంతకుమించి ఏదో సాధించాలను కోవటం తెలివితక్కువతనం. అసలు ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోతుందా? అతని సహచరులు భయకంపితులై ఉద్యమానికి దూరమవుతారా? ఏం సాధిద్దా మని వికాస్ ఇలాంటి పనికి సిద్ధపడ్డాడో తేల్చటం అవసరం.
వికాస్ యాదవ్ విషయంలో ఇంత పట్టుదలగా పనిచేస్తున్న అమెరికా చరిత్ర కూడా తక్కువేమీ కాదు. 2003 నాటి రవీందర్ సింగ్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ‘రా’లో సంయుక్త కార్య దర్శిగా ఉన్న రవీందర్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు డబుల్ ఏజెంటుగా పనిచేసి పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వగైరా దేశాల్లో రా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అందజేశాడు. తనసంగతి బయటపడిందని గ్రహించగానే కుటుంబంతో సహా మాయమై అమెరికాలో తేలాడు. వారికి అక్కడ మారు పేర్లతో పాస్‌పోర్టులు కూడా మంజూరయ్యాయి.
విచిత్రంగా మన దేశం అతన్ని అప్పగించాలని పట్టుబట్టలేదు. ఉద్యోగంనుంచి తొలగించి అధికార రహస్యాల చట్టం కింద కేసు పెట్టడంతో సరిపెట్టింది. 2016లో ఒక రోడ్డు ప్రమాదంలో రవీందర్ మరణించాడని అంటున్నా దాన్ని ధ్రువీకరించే సమాచారం మన ప్రభుత్వం దగ్గరలేదు. మొత్తానికి గూఢచర్యం వికటిస్తే ఏమవుతుందో వికాస్ యాదవ్ ఉదంతం తెలియజెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment