న్యూఢిల్లీ: భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్‌లపై ఉగ్ర దాడులకు పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పన్నాగం పన్నినట్టు బట్టబయలైంది. చెన్నైలో పట్టుపడిన ఓ శ్రీలంక దేశీయుడిని విచారించగా ఈ విషయం వెల్లడైంది. ఓ ఆగ్నేయాసియా దేశంలో జరిగిన దర్యాప్తు నేపథ్యంలో సకీర్ హుస్సేన్ అనే శ్రీలంక దేశీయుడి పేరు బయటికొచ్చింది. వెంటనే ఆ దేశం భారత్‌లోని కేంద్ర భద్రతా సంస్థను అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో సకీర్‌ను గత నెల 29న చెన్నైలో అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. భారత్‌లోని రెండు విదేశీ కాన్సులేట్లపై ఉగ్ర దాడులకు పాల్పడేందుకు ఐఎస్‌ఐ పన్నాగం పన్నిన విషయం వెల్లడైంది. ఈ కుట్రలో కొలంబోలోని పాక్ హైకమిషన్ అధికారి ఒకరు కీలకపాత్ర పోషించినట్టు తేలింది.
ఆ మేరకు చెన్నైలోని అమెరికా కాన్సులేట్, బెంగళూరులోని ఇజ్రాయెల్ కాన్సులేట్లకు సంబంధించి సమాచారాన్ని సేకరించేందుకు మాల్దీవులకు చెందిన ఇద్దరిని చెన్నై పంపించేందుకు ఐఎస్‌ఐ పన్నాగం పన్నిందని, వారికి అవసరమైన ప్రయాణ పత్రాలతోపాటు బస ఏర్పాట్లు చేసేందుకు తనను పురమాయించినట్టు సకీర్ హుస్సేన్ వెల్లడించాడని కేంద్ర భద్రతా సంస్థలు తెలిపాయి.