
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాతో ద్వైపాక్షి సంబంధాలను మరింత ధృఢతరం చేసుకోవడానికి భారత్‌కు ఇదే మంచి తరుణమని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందన్న కారణంతో అమెరికా ఆ దేశానికి నిధులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వామి ఇటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ మరింత దగ్గరయ్యేందుకు ఇంతకుమించిన మంచి సమయం మరొకటి లేదని ఆయన అన్నారు.
భారత్ వెంటనే తన రాయబార కార్యలయాన్ని టెల్ అవైవ్ నుంచి జెరూలసలేంకు మార్చడం మంచిదని ఆయన మరోసారి సూచించారు. ఈ చర్యతో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టడంతో పాటు.. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు మరింత దగ్గరకావొచ్చన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు 15 ఏళ్లుగా అమెరికా లక్షలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసినా.. ఆ దేశం తమకు అబద్దాలను చెప్పిందన్న ట్రంప్ ట్వీట్‌ను సుబ్రమణ్య స్వామి స్వాగతించారు. అమెరికా ఇప్పటికైనా నిజాలు గ్రహించిందని వ్యాఖ్యానించారు.