పూణెలో సంచలన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 11వేల మంది అమెరికన్లను మోసం చేసిన కాల్‌సెంటర్ బాగోతాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే పూణెకు చెందిన కాల్‌సెంటర్ చాలా కాలంగా పన్ను కట్టకుండా ఉన్నందుకు జరిమానా కట్టాలంటూ వేలాది మంది అమెరికన్లకు శఠగోపం పెట్టింది. అక్రమంగా కోట్లాది రూపాయలను వెనకేసుకుంది. విషయం పసిగట్టిన అమెరికా ఆదాయశాఖ, ఫెడరల్ ట్రేడ్ కమీషన్‌లు ఈ అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచారు.
లక్షలాది డాలర్లు పక్కదారి పట్టడంపై విచారణ చేపట్టిన అమెరికా బృందం పూణె కేంద్రంగా ఈ ఘరానా మోసం జరుగుతోందని గుర్తించారు. వెంటనే పూణె పోలీసులకు విషయం తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా ఉప్మర్‌కేట్, కోరేగాన్‌పార్క్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ బోగస్ కాల్ సెంటర్‌ను గుర్తించారు. అనంతరం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు.
బాధితల నుంచి సొమ్ము వసూలు చేయడానికి కాల్‌సెంటర్లు పలు అమెరికా సంస్థల పేరును ఉపయోగించుకొనేవారు. ఫోన్ చేసి ఆదాయపుపన్ను కట్టనందుకు జరిమానా చెల్లించాలంటూ బెదిరించేవారు. దీంతో బాధితులు 500 నుంచి 1000 డాలర్ల వరకూ కాల్‌సెంటర్ చెప్పిన ఖాతాల్లో జమచేసేవారు. ఈ కుంభకోణంపై స్పందించిన పోలీసులు కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకున్న అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment