కోహ్లీ దగ్గర కారును కొని గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చి..
ముంబయి: గర్ల్‌ఫ్రెండ్‌కు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆడి కారు బహుమతిగా ఇచ్చిన ఓ వ్యక్తిని థానే పోలీసులు భారీ కుంభకోణం కేసులో అరెస్టు చేశారు. అతడు గిఫ్ట్‌గా ఇచ్చిన కారును స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం ముంబయిలో మకాం ఉంటున్న అతడిని కోట్ల విలువ చేసే కుంభకోణానికి పాల్పడినందుకు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సాగర్ థక్కర్ అనే వ్యక్తి అలియాస్ షాగీ కలకలం సృష్టించిన కాల్ సెంటర్ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు. ఇతడు పాల్పడిన కుంభకోణంలో బాధ్యులైన వారు ఎక్కువగా దక్షిణాసియా వాసులే ఉన్నారు.
అది కూడా అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా వారినే ఎక్కువగా మోసం చేశాడు. అమెరికా అధికారుల సమాచారం మేరకు 300మిలియన్ల డాలర్లను కొల్లగొట్టాడు. 2013నుంచి అతడు ఈ కుంభకోణానికి తెరతీయగా థానేలోని మిరా రోడ్డులో గత ఏడాది(2016) అక్టోబర్ 4న పోలీసులు నిర్వహించిన దాడులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు రెండు రోజుల్లోనే దేశం విడిచి వెళ్లిపోయాడు.
ఇటీవలె దుబాయ్ అతడిని దేశం నుంచి బహిష్కరించడంతో తాజాగా అతడిని పోలీసులు ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. థక్కర్ ముంబయిలో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇతడికి పెద్ద మొత్తంలో ప్రైవేటు సైన్యం కూడా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం ఇటీవల ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి ఆడి ఆర్8కారు రూ.2.5కోట్లకు కొనుగోలు చేసి తన ప్రేయసికి బహుమతిగా ఇచ్చాడు. అయితే, కారు అమ్మిన కోహ్లీకి అతడు మోసగాడని తెలియదని, ఆయన అమాయకుడని థానే పోలీసు చీఫ్ తెలిపారు.