‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా? | Deutsche Bank AG (USA)(NYSE:DB): No DoJ Deal | Sakshi
Sakshi News home page

‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా?

Published Mon, Oct 10 2016 11:58 PM | Last Updated on Sat, Aug 25 2018 3:37 PM

‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా? - Sakshi

‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా?

14 బిలియన్ డాలర్లు చెల్లించాలన్న అమెరికా న్యాయ శాఖ
డాయిష్ బ్యాంకు తాకట్టు సెక్యూరిటీల విక్రయంపై దర్యాప్తు
కేసు పరిష్కారం కోసం జరిమానా చెల్లించాలని డిమాండ్
అంత చెల్లించేది లేదన్న జర్మనీ బ్యాంకు   పరిష్కారం కోసం చర్చలు
మరో ఆర్థిక సంక్షోభంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు
ఆ పరిస్థితి రాదంటున్న నిపుణులు

న్యూయార్క్: ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక రంగం ఇంకా కోలుకునే ప్రయత్నాల్లోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డాయిష్ బ్యాంకు 14 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలంటూ అమెరికా న్యాయశాఖ చేసిన డిమాండ్‌తో ఇటీవల ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. 2008లో అమెరికాకు చెందిన ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం లెహమాన్ బ్రదర్స్ కుప్పకూలడమే ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది.

619 బిలియన్ డాలర్ల రుణాలతో లెహమాన్ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. తాజా పరిణామాలను చూస్తే జర్మనీకి చెందిన నాలుగో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ కూడా లెహమాన్ బ్రదర్స్ మాదిరిగా చేతులెత్తేస్తుందేమో?, మరోసారి ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలు బయల్దేరాయి. మరి ఈ అంశం చివరికి ఎటు దారి తీస్తుంది...? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇదే.

జరిమానా ఎందుకు?
2008కి ముందు తన వద్ద తనఖా ఉంచిన సెక్యూరిటీలను డాయిష్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం ద్వారా  ఆర్థిక సంక్షోభానికి తన వంతు కారణమయ్యిందన్న అంశంపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు పరిష్కారం కోసం 14 బిలియన్ డాలర్లు చెల్లించాలన్నది అమెరికా న్యాయ శాఖ తాఖీదు. కానీ, అంత భారీ మొత్తంలో చెల్లించే ప్రశ్నే లేదని డాయిష్ బ్యాంకు స్పష్టం చేసింది.

ఆందోళనలు
జరిమానా భారీ స్థాయిలో ఉండడంతోపాటు డాయిష్ బ్యాంకు బ్యాలన్స్ షీటు బలహీనంగా ఉండడంతో లెహమాన్ బ్రదర్స్ వైఫల్యం చెందిన రోజులు ఇన్వెస్టర్లకు గుర్తుకు వచ్చాయి. ఫలితంగా వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఈ కథనం ప్రచురితమైన రోజే డాయిష్ బ్యాంకు షేరు ధర 8 శాతం పడిపోగా, బ్యాలన్స్ షీట్లు బలహీనంగా ఉన్న ఇతర యూరోప్ బ్యాంకుల షేర్లు కూడా కుదేలయ్యాయి. డాయిష్ షేరు ఏడాది కాలంగా 30 డాలర్లకు పైన ట్రేడ్ అవుతుండగా, తాజా పరిస్థితుల నడుమ సెప్టెంబర్ చివరికి అది 12 డాలర్ల దిగువకు వచ్చేసింది.

 ఊహించని పరిణామం
అయితే, ఇంత భారీ మొత్తంలో జరిమానా పడుతుందని డాయిష్ ఊహించకపోవడం కూడా తాజా అనిశ్చితికి కారణంగా పేర్కొనవచ్చు. కేవలం 3.4 బిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించాల్సి రావచ్చని మొదటి నుంచీ డాయిష్ భావిస్తోంది. అయితే ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని, ఆందోళన అక్కర్లేదని డాయిష్ బ్యాంక్ ప్రకటించింది.

డాయిష్ బ్యాంకు ముందున్న మార్గం?
అమెరికా న్యాయ శాఖ 14 బిలియన్ డాలర్లు డిమాండ్ చేయగా, ఇంత భారీ మొత్తంలో చెల్లించే ఉద్దేశం డాయిష్ బ్యాంకుకు ఏ కోశానా లేదు. దీనిపై తాము కౌంటర్ ప్రతిపాదన సమర్పించాల్సి ఉందని, చర్చలు ప్రారంభం అయ్యాయని డాయిష్ ఇప్పటికే తెలిపింది. ప్రత్యర్థి బ్యాంకులు ఇటువంటి కేసుల్లో అంతిమంగా తక్కువ జరిమానాకే పరిష్కరించుకున్నట్టే తాము కూడా దీనికి సానుకూల పరిష్కారం కనుగొంటామని డాయిష్ బ్యాంకు ఆత్మవిశ్వాసంతో ఉంది. 2 నుంచి 3 బిలియన్ డాలర్ల మధ్య జరిమానా చెల్లించడం అన్నది సహేతుకంగా ఉంటుందని డాయిష్ బ్యాంకు న్యాయ నిపుణుల సలహాగా ఉంది. చివరికి ఈ జరిమానా సగానికి తగ్గే అవకాశం ఉంటుందని అమెరికా న్యాయ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.

ముందే సిద్ధమైందా?
అయితే ఈ వివాద పరిష్కారం కోసం డాయిష్ జూన్ చివరి నాటికే 6.2 బిలియన్ డాలర్లను రిజర్వ్‌లో ఉంచిందని సమాచారం. ఈ ఏడాది చివరికి ఈ రిజర్వ్ నిధులను పెంచే ఆలోచనలోనూ ఉంది. కనుక ఈ అంశంపై అంతగా ఆందోళన అవసరం లేదన్నది నిపుణుల యోచన.

నిపుణులు ఏమంటున్నారు..
‘డాయిష్ బ్యాంకు సమస్యలు పరిష్కారం అవుతాయనే నేను భావిస్తున్నాను. లెహమాన్ వలే డాయిష్ మారబోదు’ అన్నది హార్వర్డ్ లా స్కూల్ ప్రొఫెసర్ హాల్ ఎస్ స్కాట్ అభిప్రాయం. ఇదో అప్రమత్తత సూచనా? అన్న ప్రశ్నకు కూడా ఆయన కాదనే జవాబిచ్చారు. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు డాయిష్ తన క్యాపిటల్ రేషియో బ్యాలెన్సింగ్ కోసం ఇన్వెస్టర్ల నుంచి మరింత నిధులు సేకరించడం లేదా ఆస్తులను అమ్మాల్సి రావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికా న్యాయ శాఖ జరిమానాను సగానికి తగ్గించినా సరే అది జర్మనీకి చెందిన ఒకానొక అతిపెద్ద బ్యాంకుకు భారమేనన్నది నిపుణుల అభిప్రాయం. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ప్‌గాంగ్ సైతం వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ బ్యాంకులు సైతం...
డాయిష్ వలే ఇదే మాదిరి దర్యాప్తు ఎదుర్కొంటున్న యూరోప్ బ్యాంకుల్లో బార్క్లేస్, క్రెడిట్ సూసే గ్రూపు, యూబీఎస్‌గ్రూపు, రాయల్ బ్యాంక్ స్కాట్లాండ్ గ్రూపు ఉన్నాయి.

 భారీ జరిమానా చెల్లించిన కేసులు..
ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన కేసుల్లో అమెరికాకు చెందిన బడా బ్యాంకులు సైతం లోగడ బిలియన్ డాలర్ల జరిమానాలు చెల్లించాయి.

బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్ప్ 16.65 బిలియన్ డాలర్లు

గోల్డ్‌మ్యాన్ శాక్స్ గ్రూపు 5.4 బిలియన్ డాలర్లు

సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, మోర్గాన్ స్టాన్లీ మూడూ కలిపి 23 బిలియన్ డాలర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement