అంచనాలకు మించి క్యూ3లో 8.4 శాతం వృద్ధి
తయారీ, మైనింగ్ – క్వారీ, నిర్మాణ రంగాలు చేయూత
వ్యవసాయం తీవ్ర నిరాశ
2023–24లో 7.6 శాతం పురోగతి: కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ దూసుకుపోతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదయ్యింది. ఎస్‌బీఐ రీసెర్చ్, జర్మనీ బ్రోకరేజ్– డాయిష్ బ్యాంక్ వంటి సంస్థలు 7 శాతం వరకూ వృద్ధి అంచనాలను వెలువరించాయి. తాజా ప్రోత్సాహకర ఎకానమీ ఫలితాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతం నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) ప్రకటించింది.
ఈ మేరకు తన రెండవ అడ్వాన్స్ అంచనాలను వెలువరించింది. మొదటి అడ్వాన్స్ అంచనాలు 7.3 శాతం. సమీక్షా కాలంలో (క్యూ3)లో తయారీ, మైనింగ్ అండ్ క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించినట్లు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. కాగా, వ్యవసాయ రంగం తీవ్ర విచారకరమైన రీతిలో 0.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (క్యూ3) వృద్ధి రేటు 4.3 శాతం.
క్యూ1, క్యూ2 శాతాలు అప్..
2022–23 వృద్ధి అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎన్‌ఎస్‌ఓ తగ్గించడం మరో అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకటి, రెండు త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా ఎన్‌ఎస్‌ఓ సవరించడం మరో సానుకూల అంశం. తాజా ప్రోత్సాహకర ఫలితంతో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం.
8.4 శాతం వృద్ధి ఎలా అంటే..
2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ... 2011–12 బేస్ ఇయర్ ప్రాతిపదిక వాస్తవిక జీడీపీ) రూ.40.35 లక్షల కోట్లు. తాజా 2023–24 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 43.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే అంకెల్లో వృద్ధి 8.4 శాతం అన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోని కరెంట్ ప్రైస్ ప్రకారం ఈ విలువ రూ.68.58 లక్షల కోట్ల నుంచి రూ.75.49 లక్షల కోట్లకు ఎగసింది.
ఈ ప్రాతిపదిక వృద్ధి రేటు 10.1 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 7.6 శాతం అంచనాలు చూస్తే.. (వాస్తవ వృద్ధి) జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్ల నుంచి రూ.172.90 లక్షల కోట్లకు పెరగనుంది. కరెంట్ విలువ ప్రాతిపదికన ఈ వృద్ధి అంచనా 9.1 శాతంగా ఉంది. విలువల్లో రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.293.90 లక్షల కోట్లకు జీడీపీ విలువ పెరగనుంది.
జనవరిలో మౌలిక రంగం నిరాశ
8 పరిశ్రమల గ్రూప్ 3.6 శాతం వృద్ధి
ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ జనవరిలో 15 నెలల కనిష్ట స్థాయిలో 3.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2023 జనవరిలో ఈ రేటు 4.9 శాతం. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 40 శాతం. సమీక్షా కాలంలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. బొగ్గు, స్టీల్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, సిమెంట్ రంగాల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉంది.
తలసరి ఆదాయాలు ఇలా...
మరోవైపు వాస్తవ గణాంకాల (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని) ప్రాతిపదికన 2021–22లో దేశ తలసరి ఆదాయం రూ.1,50,906కాగా, 2022–23లో ఈ విలువ రూ. 1,69,496కు ఎగసినట్లు ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. కరెంట్ ప్రైస్ ప్రకారం చూస్తే ఈ విలువలు రూ.1,05,092 నుంచి రూ.1,18,755కు ఎగశాయి.
Comments
Please login to add a commentAdd a comment